Jagannadh Goud …. టొరొంటో లో చాలా కాలం తరువాత నా మిత్రుడు కలిస్తే ఏరా చాలా ఏళ్ళు వచ్చాయి మనకి. వయస్సు తో పాటు ఏమైనా ఆలోచనలో కూడా మార్పు వచ్చిందా అని క్యాజువల్ గా అడిగాను. అప్పుడు అతను అన్నాడు.
*అవును నేను మారుతున్నాను*
తల్లిదండ్రులను, బంధువులను, భార్యను, పిల్లలను స్నేహితులను, సినెమా హీరోలని ఇన్నాళ్లు ప్రేమించాను.ఇప్పుడిప్పుడే నన్ను నేను ప్రేమించుకోవడం మొదలు పెట్టాను.
Ads
*అవును నేను మారుతున్నాను*
నేనేమీ ప్రపంచ పటాన్ని కాదు, ప్రపంచాన్నంతా నేనే ఉద్ధరించాలని అనుకోవటం లేదు. ఎదుటి వాళ్ళ లో లోపాలని చూసే ముందు నాలో లోపాలని సవరించుకోవాలి అనుకుంటున్నాను.
*అవును నేను మారుతున్నాను*
ఇంతకముందు ఏ పని చేయాలన్నా సమాజం ఏమనుకుంటుందో అని నామోషీ గా భావించేవాడిని. సమాజానికే ఇజ్జత్ లేదు, దాని గురించి ఆలోచించటం మానేసి నేను ఏమనుకుంటున్నానో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను.
*అవును నేను మారుతున్నాను*
కూరగాయల వాళ్లతో, పండ్ల కొట్ల వాళ్ళతో బేరాలు ఆడటం మానేశాను. వాళ్లకు నాలుగు రూపాయలు ఎక్కువ ఇచ్చినంత మాత్రాన నేను పెద్దగా నష్టపోయేది ఏమీ లేదని తెలుసుకున్నాను.ఆ డబ్బులు వాళ్ల పిల్లల స్కూల్ ఫీజు కన్నా పనికి వస్తాయి కదా అని అనుకుంటున్నాను.
*అవును నేను మారుతున్నాను*
ఒకప్పుడు నేను ప్రత్యేకమైనవాడిని అనుకునేవాడిని. శతకోటి లింగాలలో మనం ఒక బోడి లింగం మాత్రమే. ఈ భూమి మీద కొన్ని లక్షల, కోట్ల గొప్ప వాళ్ళు, వీరులు జన్మించి చనిపోయారు. ఏదో ఒకరోజు మనం కూడా పోతాం. జీవితం లో జీవితం ని మించిన గొప్పది, విలువైనదీ ఏమీ లేదు అని తెలుసుకున్నాను.
*అవును నేను మారుతున్నాను*
గతం లో ఫేస్ బుక్ లో వ్యతిరేక కామెంట్స్ పెడితే వాదించేవాడిని. ఇప్పుడు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను అని చెప్పి ఊరుకుంటున్నాను.
*అవును నేను మారుతున్నాను*
ఒకప్పుడు ఇతరులు ఏ మాట అన్నా బాధ పడేవాడిని, ఇంకా ఎవరెవరు మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోటానికి ప్రయత్నించేవాడిని. ఇప్పుడు ఇతరుల మాటలకి నవ్వి ఊరుకుంటున్నాను.
*అవును నేను మారుతున్నాను*
కొందరు జనాలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకొని బుర్ర పాడుచేసుకునేవాడిని.ఇప్పుడు ఎవరి చదువు, పెరిగిన పరిస్థితులు, అవగాహన, ఏర్పరచుకున్న అభిప్రాయాలు, వాళ్ళ జీవన ప్రయాణం ని బట్టి వాళ్ళు ఉంటారు. మనుష్యులుగా పుట్టినంత మాత్రాన అందరూ మనుష్యులు కాదు, రక రకాలుగా ఉంటారు; వైవిధ్యం ఉంటుంది, ఉండాలి కూడా అని తెలుసుకున్నాను.
*అవును నేను మారుతున్నాను*
ఒకప్పుడు డబ్బు ది ఏముంది, కొండాపూర్ లో కుక్కని కొట్టినా డబ్బులు వస్తై అనుకునేవాడిని. ఇప్పుడు విలువలతో పాటు డబ్బు కూడా చాలా అవసరం అని తెలిసుకున్నాను.
*అవును నేను మారుతున్నాను*
ఒకప్పుడు ఎవరైనా వచ్చి మా నాన్నకి శుభలేఖ ఇస్తే మనకి సెపరేట్ గా ఇవ్వలేదు కదా, మనల్ని పేరు పెట్టి పిలవలేదు అని ఆ పెండ్లి కి వెళ్ళేవాడిని కాదు. ఇప్పుడు వెధవలని కూడా అప్పుడప్పుడూ వెళ్ళి కలిసి వస్తున్నాను, లేకపోతే అసమర్ధుని జీవయాత్ర లో సీతారామారావు లా మిగిలిపోతాం.
*అవును నేను మారుతున్నాను*
నాకు చాలా విషయాల మీద అవగాహన ఉంది, నేను ఉత్తముడిని అనుకునేవాడిని. ప్రతి ఒక్కరూ మనలాగే ఉంటారు, చాలా విషయాల్లో నేనే వెనకబడి ఉన్నాను, నేను తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
*అవును నేను మారుతున్నాను*
టాక్సీ డ్రైవర్ దగ్గర చిల్లర కోసం తగాదా పడటం లేదు, ఆ కాస్త చిల్లర అతని మొహంలో నవ్వులు పూయించడం నాకు ఆనందంగా ఉంది. ఏదేమైనా జీవిక కోసం నాకన్నా ఎంతో కష్ట పడుతున్నాడు అతను.
*అవును నేను మారుతున్నాను*
ఒకప్పుడు జనాల మాటల్ని నమ్మేవాడిని. రూపాయి ఖర్చుపెట్టకుండా రాజకీయం చేశాను అని చెప్పినా గుడ్డిగా నమ్మేవాడిని.ఇప్పుడు పనులని బట్టి మాత్రమే కాకుండా దానివెనక వారి ఆలోచనలని బట్టి జనాలని నమ్ముతున్నాను.
*అవును నేను మారుతున్నాను*
చెప్పిందే ఎందుకు చెబుతున్నావ్ అని పెద్దవాళ్ళను అడగడం మానేశాను. వాళ్లు గతాన్ని నెమరు వేసుకోవడానికి అది పనికి వస్తుందని గ్రహించాను.
*అవును నేను మారుతున్నాను*
తోటివారిలో తప్పు ఉంది అని తెలిసినా వారిని సరిదిద్దే ప్రయత్నం మానుకున్నాను.అందరిని సరైన దారిలో పెట్టే బాధ్యత నా ఒక్కడి భుజాలమీద లేదు అని తెలుసుకున్నాను. సమగ్రత కన్నా ప్రశాంతత ముఖ్యం అని తెలుసుకున్నాను.
*అవును నేను మారుతున్నాను*
ఒకప్పుడు జనాలు చేసే మోసాలు చూసి బురదలో పందుల్లా, పెంట మీద పురుగుల్లా, కొండాపూర్ లో కుక్కల్లా బతుకుతున్నారు అనుకునేవాడిని. ఇప్పుడు ఉచితంగా ఉదారంగా అభినందనలు అందరిపై కురిపిస్తున్నాను, అది వారితో పాటు నాకు ఆనందాన్నిస్తోంది.
*అవును నేను మారుతున్నాను*
చొక్కా పై పడ్డ మరకలు చూసి బెంబేలు పడటం మానేశాను.ఆకారం కన్నా వ్యక్తిత్వం ముఖ్యం అని తెలుసుకున్నాను.
*అవును నేను మారుతున్నాను*
ఇంతకముందు నేను పట్టిన కుందేలు కి మూడే కాళ్ళు అన్న చందాన ఉండేవాడిని. ఇప్పుడు నిజంగా మూడే కాళ్ళు ఉన్నా, నేను ఏమైనా నాలుగో కాలిని చూడలేకపోతున్నానా అనుకుంటున్నాను.
*అవును నేను మారుతున్నాను*
నాకు విలువనివ్వని వారికి దూరం గా జరగడం నేర్చుకున్నాను. వారికి నా విలువ ఏమిటో తెలిసి ఉండకపోవచ్చు కానీ నా విలువ ఎంతో, ఏమిటో నాకు తెలుసు.
*అవును నేను మారుతున్నాను*
ఎవరైనా నన్ను తీవ్రమైన పోటీ లోకి లాగాలని చూసినప్పుడు ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నాను. నాకు ఎవరితో పోలిక లేదు, పోటీ అవసరం లేదు.
*అవును నేను మారుతున్నాను*
గతం లో నా అభిప్రాయం మాత్రమే కరక్ట్ అనుకునేవాడిని. ఇప్పుడు అవతలివారి కోణం లో అర్ధం చేసుకుంటున్నాను. ఇతరుల అభిప్రాయాలని, దానివెనక కారణాలని తెలుసుకుని నన్ను నేను సరి చేసుకుంటున్నాను.
*అవును నేను మారుతున్నాను*
నా భావావేశాలు నన్ను కలవర పెట్టకుండా చూసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను నన్నుగా మనిషిగా నిలబెట్టేవి అవే. ఒక బాంధవ్యాన్ని ఒక సంబంధాన్ని తుంచుకోవడం కన్నా అహంకారాన్ని చంపుకోవడం మంచిదని గ్రహించాను.ఎందుకంటే నా అహంకారం నన్ను ఒంటరి గా నిలబెడుతుంది
సంబంధ బాంధవ్యాలు కొనసాగితే నేను ఎప్పుడూ ఒంటరిని కాదు కదా.
*అవును నేను మారుతున్నాను*
ప్రతిరోజు అదే చివరి రోజు అన్నట్టుగా బతకడం నేర్చుకున్నాను. నిజానికి ఈరోజే చివరి రోజు కావచ్చు ఏమో..!
*అవును నేను మారుతున్నాను*
నాకేది సంతోషాన్ని ఇస్తుందో అదే చేస్తున్నాను. నా సుఖసంతోషాలకు నేనే…నేను మాత్రమే బాధ్యుడను. *అవును నేను మారుతున్నాను* – అజ్ఞాత రచయిత
Share this Article