అబ్బే, నానితోనే కాలేదు, నాగశౌర్యతో అవుతుందా..? అనే ఓ వార్త ఎక్కడో చదవబడితిని… సదరు వార్తా రచయిత బాధేమిటయ్యా అంటే… ఆమధ్య నాని ‘అంటే సుందరానికి’ అనే సినిమాలో బ్రాహ్మణ యువకుడి వేషం వేసెను కదా, అది కాస్తా తుస్సుమని పంక్చర్ అయిపోయింది కదా… తనతోనే బ్రాహ్మణ పాత్రను క్లిక్ చేయడం సాధ్యం కాలేదు, ఇక నాగశౌర్యతో అవుతుందా అని ఫిలిమ్ సర్కిళ్లలో చర్చ సాగుతోందిట…
నిజానికి అది చదవగానే హఠాత్తుగా జూనియర్ ఎన్టీయార్ నటించిన అదుర్స్ సినిమా గుర్తొచ్చింది… అనితర సాధ్యంగా ఆ పాత్రను ఇరగదీశాడు… ప్రత్యేకించి తన రూపం, వేషం ఎలా ఉన్నా సరే, ఓ డిఫరెంట్ డిక్షన్‌తో జూనియర్ ఆ పాత్రను రక్తికట్టించాడు… బ్రాహ్మణ యువకుడు అంటనే ఓ నిలువు బొట్టు, నెత్తిన పిలక, మడి, పాతకాలంనాటి భాష, ఓ సంప్రదాయిక వేషం గట్రా కనిపించాలనే భ్రమ ఏదో మన దర్శకులకు ఉన్నట్టుంది…
అసలు అక్షరాలా పౌరోహిత్యం చేసుకునే బ్రాహ్మణ యువకులు కూడా అలా కనిపించడం లేదు ఇప్పుడు… అవసరం లేదు కూడా… అందరితోపాటు వాళ్లు… నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనే ధ్యాస, ప్రయత్నం, ప్రయాస ఏమీ లేవు ఇప్పుడు… ఐనా సినిమావాళ్లకు అవన్నీ ఎక్కవు కదా… ఐనా నాని సినిమా ఫెయిలైందంటే అది దర్శకత్వ లోపాల కారణం… అంతేతప్ప నాని బాగా చేయలేదని కాదు… ఇప్పుడైనా నాగశౌర్య సినిమాకు కూడా కథ, దర్శకత్వ మెరుపులు బాగుంటేనే సక్సెస్…
Ads
బ్రాహ్మణ వేషంలో ఓ యువకుడి పాత్ర అనగానే… అదేదో బ్రాహ్మణ యువకుడిగా ఉండటం వల్ల ఏవో సమస్యలు గట్రా ఎదుర్కునే కథ అనుకోకండి… ఏదో కాసేపు అలా ఆటవిడుపు… అదుర్స్ సినిమాలోలాగా ఫుల్ లెంత్ పోర్షన్ కాదు… చెప్పనేలేదు కదూ, నాగశౌర్య నటించబోయే ఆ సినిమా పేరు కృష్ణ వృింద విహారి… అదేమిటి తెలుగులో బృంద అని రాయాలి కదా అంటూ అమాయకపు ప్రశ్న వేయకండి…
అదేదో సాత్విక, సంప్రదాయిక ఎట్సెట్రా లక్షణాలను చూపించే పాత్ర ఏమీ కాదండోయ్… ట్రెయిలర్లు చూస్తే బోధపడుతూనే ఉంది… ఐనా న్యూజీలాండ్ నుంచి షిర్లీ సెటియా అనే ఓ సింగర్‌ను పట్టుకొచ్చి.., హీరోయిన్‌ను చేసి… తీరా పట్టుచీర కట్టి, వాకిట్లో ముగ్గులు వేయిస్తారా తెలుగు దర్శకుడు ఎవరైనా..? నెవ్వర్… పైగా నాగశౌర్య సొంత సినిమా… మాంచి ఘాటు సీన్లు కూడా కనిపిస్తున్నయ్…
నిజానికి బ్రాహ్మణ యువకుడు అంటే ఓ ప్రత్యేక వేషంలో చూపించడమే కరెక్టు కాదు… ఇలాంటి పాత్రలు కూడా కొత్తేమీకాదు, అప్పట్లో మంచు విష్ణు చేసిన దేనికైనా రెడీ పాత్ర వివాదాన్ని రేకెత్తించింది… ఒకవేళ పాత్ర చిత్రీకరణ, కేరక్టరైజేషన్, ఔచిత్యం గనుక తేడా కొడితే, వెక్కిరింపుల వాసనలు గనుక సోకితే బ్రాహ్మణసంఘాలు గతంలోలాగా ఊరుకునే ప్రసక్తే లేదు… ఇక సినిమా జయాపజయాలు అంటారా..? అది దర్శకుడు అనీష్ చేతిలో ఉంది… అసలే నష్టాల్లో ఉన్న నాగశౌర్యను తేల్చుతాడో, ముంచుతాడో…!!
Share this Article