బోలెడు దృశ్యాలు… అప్ఘనిస్తాన్ వదిలి పారిపోవడానికి లక్షలాది మంది ప్రయత్నం… తాలిబన్ల పాలనలో బతకలేమంటూ భయం భయంగా ప్రజలు పరుగులు తీస్తున్న ఫోటోలు, వీడియోలు, వార్తలు… ‘‘అబ్బే, తాలిబన్లు మరీ చెడ్డవాళ్లు ఏమీ కారు, ఇండియా వాళ్లను గుర్తించాలి, చర్చలు జరపాలి, సత్సంబంధాలు పెట్టుకోవాలి, ఎట్టకేలకు అప్ఘన్‌కు విముక్తి లభించింది’’ అని పేలుతున్న మన మేధస్సుల సాక్షిగా… ఆ దేశప్రజలే ప్రాణాలకు తెగించి పారిపోతున్నారు…!! వాళ్లకన్నా మన బుర్రలకు ఎక్కువ తెలుసేమో తాలిబన్ల గురించి…! ఇండియాలో బతికేవాళ్లకు ఆ స్వేచ్ఛ, సెక్యూరిటీ విలువ తెలియదు, అర్థం కాదు…!! అన్నట్టూ, మొన్న విమానం చక్రాలపైకి ఎక్కి ఎగిరిపోదామని అనుకుని, తీరా మధ్యలో జారిపోయిన రెండు శరీరాల వీడియో, ఫోటోలు చూశాం కదా… తర్వాత ఏమైంది..? Scroll వాడు ఆ స్టోరీ రాశాడు… సంఘటన ఎవడైనా రిపోర్ట్ చేయగలడు, ఫాలోఅప్ సరిగ్గా రిపోర్ట్ చేసేవాడే నిజమైన రిపోర్టర్… ఒక్కసారి ఈ ఫోటో చూడండి… విమానం నుంచి రెండు దేహాలు పడిపోతున్న సీన్… ఆ ఫోటో… ఊఁ… తరువాత..?
కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు 8 కిలోమీటర్ల దూరంలో ఖైర్ ఖానాలోని ఓ రెండంతస్థుల భవనం… వలీ సలేక్ దాని ఓనర్ పేరు… తన ఇంటికి 9 కిలోమీటర్ల దూరంలో ఆయన సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు… ఆరుగురు పిల్లలు… ఇద్దరు కొడుకులు నిద్రపోతున్నారు… ఇద్దరు బిడ్డలు వంట చేస్తున్నారు… అకస్మాత్తుగా ఏదో పేలినట్టుగా శబ్దం… సలేక్ గబగబా ఇంటిపైకి ఎక్కి చూశాడు… తన పైకప్పు మీదే రెండు దేహాలు ఛిద్రమై కనిపించాయి… చుట్టూ రక్తం, మాంసం… చితికిపోయిన దేహాలు… అవే ఆ విమానం నుంచి జారిపడిన దేహాలు… రెండూ ఆ కప్పు మీదే పడ్డాయి,.. షాక్‌లో ఉండిపోయాడు సలేక్… విమానం నుంచి ఎవరైనా తాలిబన్లను బయటికి తోసేశారేమో అనుకున్నాడట మొదట్లో… ఈలోపు ఆయన భార్య పైకి వచ్చింది… ఆ శవాల స్థితి చూసి స్పృహ తప్పిపోయింది వెంటనే… ఆమెను కిందకు ఎత్తుకుపోయి, చుట్టుపక్కల వాళ్లను పిలిచాడు సలేక్…
Ads
వీలైనంతవరకూ ఒక్కచోటకు ఆ శరీరాల ముక్కల్ని ఒక్కచోటకు చేర్చి, బట్టల్లో చుట్టి… 300 మీటర్ల దూరంలో ఉండే ఓ మసీదు దగ్గర పెట్టారు… తిరిగి వచ్చి పైకప్పు మొత్తం క్లీన్ చేసుకున్నాడు… తరువాత స్నానం చేసి, తన కొలువుకు వెళ్లిపోయాడు… ఆ శవాలు ఎవరివీ అని వెతికారు స్థానికులు… ఒకరిని షఫీయుల్లాగా గుర్తించారు… ఇద్దరూ పాతికేళ్లకు కాస్త అటూఇటూ ఉంటారు… తరువాత కాసేపటికి ఆ శవసంబంధీకులు ఎవరో వచ్చారు… మరొకరిని ఫిదా మొహమ్మద్‌గా గుర్తించారు… సలేక్ భార్య భయంతో వణికిపోతోంది… నిద్రపోవడం లేదు, తిండి తినడం లేదు… భయం… సలేక్‌కు తప్ప ఇంకెవరికీ పాస్‌పోర్టులు లేవు… ఆరుగురు పిల్లలతో కలిసి ఎటు పోవాలి..? ఎలా పోవాలి..? అసలు సేఫ్ ప్లేస్ ఏది ఈ ప్రపంచంలో..? ఇదీ ప్రశ్న… ఢిల్లీలో జరీఫి అనే వాళ్ల బంధువు ఉన్నాడు… ట్రావెల్ ఏజెన్సీ, ప్రాపర్టీ కంపెనీ నడిపిస్తుంటాడు… ఆ కుటుంబంలోని వాళ్లు ఇండియాకు రావడానికి వీలుగా వీసాల కోసం అప్లయ్ చేశాడు… తన కుటుంబంలోని వాళ్ల కోసం కూడా వీసాలు తీసుకున్నాడు… కానీ ఏం లాభం..? అసలు ఫ్లయిట్లు ఏవీ..? ఆయన పంజ్ షీర్ ప్రావిన్సుకు చెందినవాడు… ఆ లోయ గురించి తెలుసు కదా… అదొక్కటే ఇప్పుడు తాలిబన్లు జొరబడలేని ఏకైక సురక్షిత ప్రాంతం… ఆ రెండు శవాలు పడ్డ ఆ ఇంట్లోని సభ్యులంతా ఇప్పుడు ఆ లొకాలిటీ వదిలేసి, ఆ ఇల్లు ఖాళీ చేసి… ఆ పంజ్ షీర్‌కు వెళ్లిపోయారు..!!
Share this Article