ఎల్లి మీద మల్లి పడె… మల్లి మీద ఎల్లి పడె….. ఎహె, పార్టీల గురించి, లీడర్ల గురించి, సోషల్ మీడియాలో యాక్టివిస్టుల గురించి కాదు…. మీడియా సంస్థల గురించి… వెలుగును నమస్తే తిడుతుంది… నమస్తేను వెలుగు ఆడిపోసుకుంటుంది… సాక్షిని జ్యోతి నిందిస్తుంది… జ్యోతిని సాక్షి ఉతికేస్తుంది… ఎన్టీవీని టీవీ5 అదిలిస్తుంది… టీవీ5కు ఎన్టీవీ ఝలక్కులిస్తుంటుంది… ఆయా సంస్థలు, ఓనర్ల ప్రయోజనాలు, పార్టీల అనుబంధాల ఆధారంగా పలు వార్తల మీద దుమ్మెత్తిపోసుకుంటాయి… మంచిదే, ఒకరి బట్టలు మరొకరు విప్పితేనే కదా, ఎవరి ‘కలర్’ ఏమిటో సమజయ్యేది… ఆంధ్రజ్యోతిని సాక్షి యెల్లో యెల్లో అని వెక్కిరిస్తుంటుంది… సాక్షిని జ్యోతి నీలిమీడియా అంటుంది… అంటే ఏమిటో, ఆ పేరెందుకో పెట్టారో తెలియదు… నన్ను యెల్లో అంటే నిన్ను బ్లూ అన్నాను, చెల్లుకుచెల్లు అన్నట్టుగా ఉంది… ఐనా మీడియా వార్ అంటేనే వీథిపంపు దగ్గర ఆడవాళ్లు బిందెల తన్నులాట, తిట్లాట… తాజాగా ఏమిటంటే…
గతంలో చంద్రబాబు దగ్గర సీఎంవో సెక్రెటరీగా పనిచేసిన లక్ష్మినారాయణ ఇంటి మీద ఏపీసీఐడీ అధికారులు దాడి చేసి, సోదాలు నిర్వహించారు… ఏపీఎస్ఎస్‌డీసీ స్కాం మీద సీఐడీ దర్యాప్తు చేస్తోంది… నిజమే, లక్ష్మినారాయణ చంద్రబాబుకు ఆంతరంగిక మనిషి… జగన్ అందుకే కక్షకట్టి, కేసు పెట్టించి, సతాయిస్తున్నాడని తెలుగుదేశం ఆరోపణ… మనం ప్రస్తుతం ఆ విమర్శలు, ప్రతివిమర్శల పంకంలోకి వెళ్లడం లేదు… అసలే తెర మీదకు మళ్లీ పట్టాభి కూడా వచ్చేశాడు… సోదాల వార్త తెలియగానే, హుటాహుటిన అక్కడికి వెళ్లిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దర్యాప్తు అధికారులను హల్‌చల్ చేశారనీ… రాధాకృష్ణ అధికారులను బెదిరించే ప్రయత్నం చేశాడనీ సాక్షి ఓ వార్త రాసేసింది… ఆ తనిఖీలను వీడియో తీయించాడు… సీఐడీ అధికారులు దీనిపై ఆగ్రహంగా ఉన్నారని కూడా చెప్పింది… అధికారులు విస్తుపోయారట కూడా…
Ads
అబ్బే, సీఐడీకి సహకరించాలని నేనే ఆ కుటుంబసభ్యులకు చెప్పాను, ఇంకాసేపు ఉండండి అని సీఐడీ అధికారులే రిక్వెస్ట్ చేశారు… కానీ సాక్షి ఏవేవో అవాకులు చెవాకులూ ప్రసారం చేసింది అంటూ బాగా ఆగ్రహపడ్డాడు… అదే వార్తగా రాసేసుకున్నాడు… సాక్షి అని మాత్రం రాయడు లెండి, ఆ పేరు రాస్తే మైలపడిపోతాడట… అదేమిటో మరి..! నిజానికి లక్ష్మినారాయణ అనే మాజీ ఐఏఎస్ అధికారి రాధాకృష్ణకు సన్నిహితుడు, ఇద్దరూ టీడీపీ క్యాంపుకు సన్నిహితులే… సోదాలు జరుగుతుంటే తను ఓ వ్యక్తిగా, లక్ష్మినారాయణ స్నేహితుడిగా అక్కడికి వెళ్లాడు, అందులో తప్పేం ఉంది… ప్రొసీజర్ పాటిస్తున్నారా అని అధికారులను అడిగాడు, తప్పేముంది..? అడ్డుకునే ప్రయత్నం చేస్తే గనుక రాధాకృష్ణ అయితేనేం, సీఐడీ ఉపేక్షించదు కదా… మరెందుకు సాక్షిలో ఆ వార్త..? దానికి కౌంటర్‌గా జ్యోతిలో ఎందుకు ఈ వార్త..? ఎవరికీ హుందాతనం లేదు… అదీ మనం చెప్పుకునే పాయింట్… నిజానికి ముందస్తు సమాచారం ఇచ్చాకే, పక్కా ప్రొసీజర్ ప్రకారమే తనిఖీలు చేస్తున్నామని సీఐడీ అధికారులు చెప్పాక ఇక రాధాకృష్ణ మాట్లాడలేదని సాక్షే తన వార్తలో రాసింది… మరెందుకు ఆ వార్త..? హేమిటో ఈ మీడియా వార్… చేతిలో బురద పట్టుకుని రెడీగా ఉంటున్నయ్..! పార్టీల నాయకులే కాస్త నయమేమో..!! అసలు ఆ స్కాం మీద కేసు కక్షసాధింపే అన్నట్టుగా… లక్ష్మినారాయణ తప్పేమీ లేనట్టుగా జ్యోతి కాలాల కొద్దీ కలం విదిల్చింది, స్నేహధర్మం… వామ్మో, ఎంత పెద్ద స్కామో తెలుసా అన్నట్టు సాక్షి బ్యానర్లు కుమ్మేసింది… దొందూదొందే…!!
Share this Article