తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణను పాలించింది తెలంగాణ రాష్ట్రసమతి… అఫ్‌కోర్స్, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి… పేరు మారితేనేం, డీఎన్ఏ మారదు కదా… జాతీయ రాజకీయాల్లో గాయిగత్తర లేపుతానని లేచి, నాలుగడుగులు కూడా పరుగు తీయకముందే ఆయాసం ముంచుకొచ్చి, ఆ జాతీయ జెండాను, ఎజెండాను పక్కన పడేసి మళ్లీ ఆ తెలంగాణ జెండానే, అనగా పాత తెలంగాణ సెంటిమెంట్‌నే నమ్మకుంటన్న, పట్టుకుంటున్న అవస్థ…
ఈరోజుకూ తాము సాధించిన ప్రగతిని చెప్పుకోలేక… దాన్నే చూపి వోట్లడగలేక… కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీలు జనంలో బాగా చర్చనీయాంశం అవుతున్నవేళ… బీఆర్ఎస్ అన్ని శ్రేణుల నాయకుల అక్రమాలపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నవేళ… కేసీయార్ ఇన్నేళ్లూ వోట్ల సాధనకు తాను నమ్ముకున్న ఆ తెలంగాణ భావోద్వేగాలకే మళ్లీ పదును పెడుతున్నాడు… ఆ తెలంగాణ మనోభావాల అస్త్రమే వోటర్ల మీదకు ప్రయోగించబోతున్నాడు…
అంతేకాదు, కాంగ్రెస్ హామీలను తలదన్నే రీతిలో బీఆర్ఎస్ హామీలు ఉంటాయట… కాంగ్రెస్ వాగ్దానాలను నమ్మకూడదట, తను చెప్పబోయే హామీలను మాత్రం నమ్మాలట… తను పాత హామీలన్నీ నెరవేర్చాడట… ఎవరూ అడగొద్దుట… నిరుద్యోగ భృతి వంటి పథకాలను గుర్తుచేయొద్దుట… అసలు తనవన్నీ శాంపిల్ పథకాలే కదా… దళితులకు మూడెకరాలు గాయబ్… దళితబంధు ఏదో కొందరికి ఇచ్చేసి మమ అనిపించేయడం… డబుల్ బెడ్రూం ఇళ్లు అటకెక్కి, ఇంటికి 3 లక్షల గృహలక్ష్మి తెర మీదకు వచ్చింది…
Ads
ఒకే ఒక్క మోటార్ రన్ చేసి, అదుగో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంటూ ప్రజల కళ్లకు గంతలు కట్టడం.., ధరణి వైఫల్యాలు, అక్రమాలు… టీఎస్పీఎస్సీ అక్రమాలు, వైఫల్యాలు… చెబుతూ పోతే ఎన్నో…
పలు సర్వేల్లో కాంగ్రెస్ ఎడ్జ్ కనిపిస్తోంది… సో, ఏదో తేడా కొడుతోంది… బీజేపీ రోజురోజుకూ బలహీనపడుతోంది… బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఏదో ఆట ఆడుతున్నాయని జనంలో చాలామంది నమ్ముతున్నారు… సిక్స్ గ్యారంటీలు, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత, బీజేపీ డౌన్ కావడం… ఇలా పలు కారణాలు కాంగ్రెస్ పుంజుకోవడానికి కారణం కావచ్చు… సో, ఇప్పుడు బీజేపీతో చిక్కు లేదు, కాంగ్రెసే థ్రెట్… దాంతో కేసీయార్ తన పాత ఎన్నికల అస్త్రం, అదే తెలంగాణ ఉద్వేగాన్నే మళ్లీ తెర మీదకు తీసుకొస్తున్నట్టున్నాడు… కాంగ్రెస్ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నాడు…
పొద్దున్నే నమస్తే తెలంగాణలో ఓ బ్యానర్ స్టోరీ… 60 ఏళ్ల ద్రోహ చరిత్ర అని సీరియల్ స్టార్ట్ చేసింది… నాడు మన తెలంగాణ పరాధీనమైందెట్ల అనే శీర్షికతో ఈ థాట్ పోలీసింగ్ కథనాల పరంపర ఆరంభమైంది… ఎస్, తెలంగాణ కోరికలను కాలరాచి ఆంధ్రాతో కలిపారు నిజమే… తరువాత చాలా ఏళ్లు కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేస్తూనే పోయింది అనే తరహాలో ఇక ఆ కథనాలు కుమ్మేస్తారన్నమాట… ప్రజల్లో కాంగ్రెస్‌ను దోషిగా, ద్రోహిగా చిత్రించే ప్రక్రియ అన్నమాట…
పొద్దున్నే మంత్రి గంగుల కమలాకర్ ఎక్కడో మాట్లాడుతున్నాడు… ఈ కాంగ్రెస్, ఈ బీజేపీల ముసుగులో మళ్లీ ఆంధ్రోళ్లు వచ్చి, వాళ్లు అధికారంలోకి గనుక వస్తే తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపేస్తారట… తన విజ్ఞతకు జేజేలు… స్వతంత్ర రాష్ట్రంగా విడిపోయిన ఏ చిన్న ప్రాంతమైనా సరే మళ్లీ పాత రాష్ట్రంతో కలిసిందా మన దేశంలో..? అది సాధ్యమేనా..? పైగా తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీల్లో ఉన్నది తెలంగాణ నాయకులు కాదా..? రేవంత్‌రెడ్డి ఆంధ్రుడా..? కిషన్‌రెడ్డి ఆంధ్రుడా..? టీడీపీ, జనసేన, వైఎస్సార్టీపీ వంటి పార్టీలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినా కాస్త సరిపోయేవేమో…
నమస్తే కథనం, గంగుల వ్యాఖ్యానం చూస్తుంటే కేసీయార్ మెల్లిమెల్లిగా భావోద్వేగాలనే మళ్లీ నమ్ముకోబోతున్నాడా అనే సందేహం కలగడం సహజం… వోకే, ఈసారి ప్రజలు నమ్ముతారా అనేది వేచిచూడాలి… కాంగ్రెస్ చాలా విషయాల్లో తెలంగాణకు ద్రోహం చేసింది కరెక్టే… కానీ తెలంగాణను ఆ పార్టీయే ఇచ్చింది… తను ఆంధ్రాలో నష్టపోతామని తెలిసీ ఇచ్చింది… పైగా తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీల్లో టీడీపీ పాత్ర కూడా తక్కువేమీ కాదు…
అదే టీడీపీలో మంత్రిగా పనిచేసిన ఇదే కేసీయార్ ఒక్కమాట మాట్లాడలేదు అప్పట్లో… దేవేందర్ గౌడ్ నయం, నియామకాలకు సంబంధించిన అక్రమాల మీద మాట్లాడాడు… కొత్త ఎన్నికల హామీల మీద, మళ్లీ తెలంగాణ ఎమోషన్ మీద నమ్మకం పెట్టుకున్న కేసీయార్ ఆశలు ఫలాలనిస్తాయా..? చూడాల్సిందే..!!
Share this Article