.
( రమణ కొంటికర్ల ) ….. దావూద్ అండర్ వరల్డ్ మాఫియా ముంబైలో డ్రగ్స్ రాకెట్ ను ఎలా నడిపించారు..? ఎన్ఫోర్స్మెంట్ దాడులతో చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ ముంబై పతాక శీర్షికల్లోకి దావూద్ పేరు…
అక్టోబర్ 8వ తేదీ బుధవారం రోజున డోంగ్రీ, మజ్ గావ్, వర్లీ సహా… మొత్తం ముంబైలోని తొమ్మిది ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందాలు ఏకకాలంలో దాడులు చేశాయి. ఫైజల్ జావేద్ షేక్, అతడి భార్య అల్ఫియా ఫైజల్ షేక్ ఈ ఇద్దరూ కలిసి డ్రగ్స్ ముఠా నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఆ నెట్వర్క్ ను బ్రేక్ చేసి ఆ అక్రమ సొమ్మును స్వాధీనపర్చుకునేందుకు ఈడీ దాడులకు దిగింది.
Ads
ఫైజల్ షేక్ ను ఇప్పటికే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పలుమార్లు అరెస్ట్ చేసింది. డ్రగ్స్ వ్యవహారాల్లో అతడు కరడుగట్టిన నేరస్థుడు. దావూద్ ఇబ్రహీం నార్కోటిక్స్ కార్యకలాపాల్లో కీలక వ్యక్తిగా చెప్పుకునే సలీమ్ డోలా నుంచి మెఫెడ్రోన్ అనే డ్రగ్ ను భారీగా సరఫరా చేసుకున్నట్టు ఇప్పుడు ఫైజల్ షేక్ పై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి…
స్మగ్లింగ్ ప్రపంచంలో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ నీ, ముంబై పోలీసులను మూడు చెరువుల నీళ్లు తాగించిన కరడుగట్టిన స్మగ్లర్ సలీం డోలా. ప్రస్తుతం సలీం డోలా టర్కీలో ఉన్నట్టుగా సమాచారం. డోలా ఒకవైపు టర్కీ నుంచి తన ఆపరేషన్స్ నడిపిస్తుంటే… అతడి సహచరుడైన షకీల్ షేక్ యూఏఈ నుంచి తన ఆపరేషన్స్ సమన్వయం చేస్తూ ఉంటాడు.
ఈడీ దాడుల్లో ఏం దొరికాయి.. ఏం స్వాధీనపర్చుకున్నారు..?
ముంబైలోని తొమ్మిది ప్రాంతాల్లో దాడుల తర్వాత ఈడీ సిబ్బంది 42 లక్షల రూపాయల నగదు, మూడు లగ్జరీ కార్లు, డిజిటల్ పరికరాలు, ఆస్తిపత్రాలు, ఇతర నిందితుల ఆధారాలు స్వాధీనం చేసుకుంది. అలాగే, ఓ బ్యాంక్ లాకర్, మాదకద్రవ్యాల డబ్బు జమైనట్టుగా అనుమానిస్తున్న పలు బ్యాంక్ ఖాతాల వివరాలను కూడా స్వాధీనపర్చుకున్న ఈడీ ఆ ఖాతాలనూ స్తంభింపజేసింది.
రింకూసింగ్ కు దావూద్ గ్యాంగ్ నుంచి ఐదు కోట్ల రూపాయలివ్వాలన్న బెదిరింపు కథేంటి..?
సరిగ్గా కొద్దిరోజుల క్రితమే ఆసియా కప్ లో చిరకాల ప్రత్యర్థైన పాకిస్థాన్ పై చివరి బాల్ ఫోర్ కొట్టి ఇండియాను గెలిపించిన రింకూసింగ్ కు కూడా ఇప్పుడు డీ – కంపెనీ నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. ముంబై పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య మూడుసార్లు రింకూసింగ్ కు డీ కంపెనీ గ్యాంగ్ స్టర్స్ నుంచి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ ర్యాండమ్ గా మెస్సేజెస్, కాల్స్ రావడంతో రింకూసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్య కేసు వెలుగులోకి రాగానే.. రింకూసింగ్ వ్యవహారం కూడా బయటకొచ్చింది. బాబా సిద్ధిఖీ కుమారుడు జీషాన్ సిద్ధిఖీకి కూడా పదికోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపు కాల్స్ వచ్చినట్టు ముంబై పోలీసులు ఇప్పటికే వెల్లడించారు.
అలాగే పోలీసులు పట్టుకున్న మొహమ్మద్ దిల్షాద్, మొహమ్మద్ నవీద్ ఈ ఇద్దరూ కూడా పోలీసుల విచారణలో క్రికెటర్ రింకూసింగ్ ను కూడా లక్ష్యంగా చేసుకున్నట్టు అంగీకరించారు. నవీద్ వెస్ట్ ఇండీస్ లో పట్టుబడ్డాక ఇంటర్ పోల్ ఒప్పందంలో భాగంగా ఆగస్ట్ 1న భారత అధికారుల చేతికి చిక్కాడు.
నవీద్ మొదట క్రికెటర్ రింకూసింగ్ ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి సంప్రదించాడు. కానీ, రింకూ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో.. ఏప్రిల్ లో మళ్లీ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ డీ కంపెనీ సింబల్ పంపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
మొత్తంగా ఇంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ దావూద్ ఇబ్రహీం డీ కంపెనీ ముఠా కార్యకలాపాలు ముంబై కేంద్రంగా మళ్లీ ప్రో యాక్టివ్ అవుతుండటం ఇప్పుడు ముంబై పోలీస్ తో పాటు, ఇతర ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ను కూడా కొంత కలవరపెట్టే అంశం. అలాగే ఛేదించాల్సిన ఓ ఛాలెంజింగ్ టాస్క్…
Share this Article