Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాపం కేటీయార్… పాత తప్పుల్ని మరిచి… ఆకాశానికి మళ్లీ నిచ్చెనలు !!

October 24, 2026 by M S R

.

జరిగిన నష్టాలకు సహేతుక కారణాల్ని అన్వేషించి, దిద్దుకోలేనివాడు, ఆకాశానికి నిచ్చెనలేయాలని ప్రయత్నించి అడ్డంగా కూలిపోయేవాడిని విధి కూడా క్షమించదు… ఫాఫం, బీఆర్ఎస్ వారసుడు కేటీయార్ అదే బాటలో ఉన్నాడు… పాపం శమించుగాక…

పొద్దున్నే ఓ వార్త… సారాంశం ఏమిటయ్యా అంటే..? ‘‘కేటీయార్ ఎక్కడో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కేసీయార్ దేశ రాజకీయాల్లో కీలకం కానున్నాడు, తన నాయకత్వంలోనే బీజేపీ-కాంగ్రేసేతర పక్షాలన్నీ సంఘటితం కాబోతున్నాయి… రాహుల్ గాంధీ పనైపోయింది, బీజేపీకి ఇదే లాస్ట్ చాన్స్… కాబోయే సీఎం కేసీయారే…’’

Ads

నవ్వొచ్చింది… అఫ్‌కోర్స్, రాజకీయాల్లో ఎవరు ఎలా కీలకం అవుతారో ఎవరూ చెప్పలేరు… అంతా నంబర్ గేమ్… ఆఫ్టరాల్ గుజ్రాల్, దేవెగౌడ, చంద్రశేఖర్ ప్రధానులు కాలేదా ఈ దేశానికి..? కేసీయార్ కావొద్దని ఏముంది..? పైగా అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో ఓదశలో నాకు చాన్సివ్వండి, నేను బీజేపీతర పక్షాల మొత్తం ఎన్నికల ఖర్చు భరిస్తాను అని చెప్పినవాడే కదా…

అంతేనా..? ఇక చూసుకో నాసామిరంగా అంటూ కొన్ని రాష్ట్రాల్లో మాజీ సీఎంలు గట్రా గాలి నేతలను పోగేసి, ఇక ప్రధాని కుర్చే తరువాయి అన్నంత ఫోజు పెట్టి… తన పార్టీ పేరులోని తెలంగాణ ఆత్మను బొందపెట్టేసి… ఇటు రాష్ట్రానికీ గాకుండా, అటు కేంద్రానికీ గాకుండా… ఏ పార్టీ నమ్మకుండా, ఏ జనమూ నమ్మకుండా… చివరకు ఫామ్‌హౌజులో మొహం చెల్లక బందీగా గడుపుతున్నది కేసీయార్ కాదా..?

గతం ఇంత చేదుగా ఉంటే… మరెందుకు మళ్లీ జాతీయ రాజకీయాల్లో కేసీయార్ కీలకం కానున్నాడంటూ ఆకాశానికి నిచ్చెనలు ఎందుకు వేస్తున్నట్టు..? బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే దిశలో బేరమాడే శక్తిని పెంచుకోవడానికేనా..? అసలు తను బయటికే రావడం లేదు…

తను నిజానికి జనజీవనంలోనే లేడు… లేస్తే మనిషిని కాను అనే తరహా పోకడేనా..? ఇంకా ఇంకా కేంద్రంలో చక్రాలు తిప్పుతాను అనే భ్రమల్లో కేసీయార్ ఉన్నాడా..? కేసీయార్ ఉన్నాడని కేటీయార్ అంటున్నాడా..? అంతా అగమ్యగోచరం… కేసీయార్ భాషలోనే చెప్పాలంటే బభ్రాజమానం భజగోవిందం…

అసలు ఒక్క రోజైనా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చుకున్న ఫలితాల సమీక్ష జరిగిందా పార్టీలో..? తెలంగాణలో మట్టిగొట్టుకుపోయిన కారణాల విశ్లేషణ జరిగిందా..? కనీసం కోటరీలోనైనా..! సరే, కేసీయార్ ఎవరు చెప్పినా వినడు, అంతా ఏకచ్ఛత్రాధిపత్యమే, వోకే… కానీ నాలుగు బలమైన తాకులు తగిలినప్పుడైనా డయాగ్నయిజ్ చేసుకోవాలి కదా…

kcr

సరే, ఆశలుండటంలో తప్పేమీ లేదు… కేసీయార్ ప్రధాని కావొద్దనీ అనడం లేదు… కానీ మోదీ మీద వ్యతిరేకత, సీజేపీ ఆందోళనలు, జాతీయ స్థాయిలో అస్థిరత కనిపిస్తున్న నేపథ్యంలో తన ధోరణి ఏమిటో, తన అభిప్రాయం ఏమిటో ఒక్క ముక్క చెప్పలేని దురవస్థలో ఎందుకున్నాడు మరి కేసీయార్..?

పోనీ, కనీసం తెలంగాణ ప్రజాసమస్యలపైనైనా వీసమెత్తు స్పందన ఎందుకు లేదు..? గెలిస్తే, అధికారంలో ఉంటేనే ప్రజాజీవితం, ఓడితే ఎవడి ఖర్మ వాడిది అని వదిలేయడమేనా తన రాజకీయ తత్వం..? పోనీ, ప్రస్తుతం బీజేపీ- కాంగ్రెస్ కూటములను కాదని ఓ నేషనల్ ఫ్రంటో, టెంటో మళ్లీ ప్రయోగం చేసే స్థితి ఉందా..?

లేదు… ఇండి కూటమి కకావికలు అవుతోంది… యాంటీ బీజేపీ సంఘటనే కష్టతరమవుతోంది… మరిక మూడో ఫ్రంటుకు తావేది..? అన్నింటికీ మించి కేసీయార్‌ను నమ్మే రాజకీయ పార్టీ ఏముంది దేశంలో..? మరి కేటీయార్ ఎందుకు ఈ ‘‘మళ్లీ జాతీయ రాజకీయాల్లో కేసీయార్ కీలకం’’ అనే విచిత్ర వ్యాఖ్యానాలకు దిగుతున్నాడు..?! దీని మర్మమేమిటి అమిత్ షా..?!



చెల్లియొ చెల్లకో, తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్… తొల్లి, గతించె… ఈ పాపులర్ పద్యం గుర్తుంది కదా…. సేమ్, చెల్లియొ చెల్లకో, కేసీయార్ తమకు చేసిన యెగ్గులు సైచిరి తెలంగాణజనం… తొల్లి, గతించె…!!


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రీతిరెడ్డి..! తెలంగాణ విద్యావ్యవస్థకు ఓ మణికిరీటం..!!
  • పాపం కేటీయార్… పాత తప్పుల్ని మరిచి… ఆకాశానికి మళ్లీ నిచ్చెనలు !!
  • వాట్సాప్, టెలిగ్రామ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ !!
  • మోహన్‌లాల్ బాడీ డబుల్ ! ఇదో దిక్కుమాలిన సోషల్ రాద్దాంతం !!
  • అమెరికాకు అంబానీ సాయం దేనికి..? ఈ సంప్రదింపుల మర్మమేంటి..?
  • అమెరికా చమురు దరిద్రం! ఆయిల్ పాలిటిక్స్‌లో ఉల్టా పల్టా !!
  • చర్చిద్దాం రండి… తుమ్మడిహెట్టి ఎత్తుపై మహారాష్ట్ర సీఎం సానుకూలత !!
  • దిక్కుమాలిన జర్నలిజం! చిన్న ఆర్టిస్టులంటే మరీ అంత లోకువా..?
  • పోటీయే కదా ప్రజాస్వామిక స్పూర్తి… నిర్బంధ ఏకగ్రీవాలు దేనికి..?
  • రష్మిక పాత ఫ్రెండ్ ప్రేరణ కంభం! ఇదేనా తన ఐడెంటిటీ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions