.
ముందుగా ఓ వార్త చదవండి…. గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
జనవరి 10 తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల షో నుంచి 6 షోస్ కు అనుమతి… మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 150 రూపాయలు పెంపు…
Ads
సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 100 రూపాయలు పెంపు, జనవరి 11 నుంచి 5 షోస్ కు అనుమతి… జనవరి 11 నుంచి మల్టీ ప్లెక్స్ ధర 100 రూపాయలు పెంపుకి అనుమతి
సింగిల్ స్క్రీన్ ధర్ 50 రూపాయలు పెంపు కు అనుమతి, బెనిఫిట్ షోస్ కు అనుమతి నిరాకరించిన తెలంగాణా ప్రభుత్వం…
ఏం సమర్థనలు చెప్పుకున్నా వేస్ట్… రేవంత్ రెడ్డి మాట తప్పి, స్పిరిట్ తప్పి, పరువు కోల్పోయాడు… గేమ్ చేంజర్ సినిమా టికెట్ రేట్ల పెంపునకు, అదనపు షోలకు అనుమతించాడు…
దిల్ రాజు కోసం చాలా మెట్లు దిగిపోయాడు… క్రెడిబులిటీ కోల్పోయాడు రేవంత్ రెడ్డి… ‘‘అబ్బే, టికెట్ రేట్లు పెంచబోమని చెప్పలేదు కదా, కేవలం బెనిఫిట్ షోలకు అనుమతించబోం అన్నాం కదా’’ అంటారేమో… ఐనా సరే, అది ఓ విఫల సమర్థనే అవుతుంది…
అసలు దిల్ రాజు ఎదుట ఇంతగా సాగిలబడాలా ఓ ప్రభుత్వం..? సినిమాటోగ్రఫీ మంత్రి దిల్ రాజేనా..? అసలు నిజామాబాద్‌లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ప్రిరిలీజ్ ప్రమోషన్ సభకు అనుమతి ఇవ్వడమే తప్పు…
ఎవరో నిర్మాత ప్రైవేటు సినిమా దందా కోసం ఈ మీటింగులకు పర్మిషన్స్ ఇవ్వడం దేనికి…? ప్రభుత్వం పోలీస్ బందోబస్తు ఇవ్వడం ఏమిటి..? దాంతో జనానికి ఒరిగే ఫాయిదా ఏమిటి..? సినిమావాళ్ల వ్యాపారానికి సహకరించాలా ప్రభుత్వాలు..?
అదే దిల్ రాజు సినిమా గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మరో తప్పు… నాలుగు రోజులు పోతే మళ్లీ బెనిఫిట్ షోలు మన్నూమశానం… ఒక ముఖ్యమంత్రి కనబరిచే కఠిన ధోరణి నాలుగురోజులకే ఇలా నీరుకారిపోతుందా..? ఎలా..? ఆల్రెడీ అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చేశాడు…
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఓ యువతి మృతి, ఓ పిల్లాడి చావుబతుకులు, ఓ పాన్ ఇండియా హీరో అరెస్టు… ఎవరైతేనేం, తప్పు జరిగితే ఉపేక్షించబోం.., అనుచిత, అనవసర ఔదార్యాలు కనబరచబోం అనే ఆ కఠిన ధోరణి ఒక్కసారిగా ముక్కలుగా పగిలిపోవాలా…? కారణం..?
మరి డాకూ మహారాజ్ చేసిన పాపమేమిటి,..? మన అభిమాన చంద్రబాబు సొంత వియ్యంకుడే కదా హీరో… పైగా సంక్రాంతికి వస్తున్నాం కూడా దిల్ రాజు సినిమాయే కదా… ఇచ్చేయండి… ఒకసారి మెట్లు దిగిపోయాక ఇక మొహమాటాలేమిటి..? మీనమేషాలేమిటి..?
సినిమా టికెట్ రేట్ల పెంపుకి ఎందుకు అనుమతించాలో సరైన కారణాలు చెప్పగలడా ముఖ్యమంత్రి..? సినిమా నిర్మాణ వ్యయం పెరిగితే అది నిర్మాత రిస్క్… హీరోలకు అడ్డంగా దోచిపెట్టి, ఈమేరకు ప్రేక్షకులను బాదడం దేనికి..? దానికి ప్రభుత్వమే అంగీకరించడం దేనికి..? హీరోలకు అడ్డగోలుగా సంపాదించి పెట్టాలా ప్రభుత్వాలు కూడా..!
పోనీ, ఆ పవన్ కల్యాణ్ చెప్పినట్టే ఓ శుష్క, వ్యర్థ కారణమైనా చెప్పొచ్చు కదా… బ్లాక్ మార్కెట్ కంట్రోల్ కోసం ఈ టికెట్ రేట్ల పెంపు అని..! ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది అని…! You are not at all a game changer…!
Share this Article