.
నిన్నో మొన్నో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడో అన్నట్టు గుర్తు… మళ్లీ కేసీయార్ రావద్దనే వ్యతిరేకతతో తమను గెలిపించారనీ, ఇప్పుడిక మంచి పేరు తెచ్చుకుని ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకుని, వచ్చేసారీ అధికారంలోకి రావాలని… దాదాపు అదే టోన్, అదే సారాంశం…
ఎల్ఆర్ఎస్ వంటి చాలా మడమ తిప్పడాలున్నాయి గానీ… కేసీయార్ పాలనలోని వైఫల్యాలను, లోపాలను, అక్రమాలను సరిదిద్దితేనే కదా, నిన్ను జనం ఇష్టపడేది… కానీ బ్యాడ్ లక్, సరిగ్గా అదే చేతకావడం లేదు… మరో ఉదాహరణ కావాలా..? ఇదుగో…
Ads
ఇప్పుడే వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో ఓ వార్త కనిపించింది… ఇదీ అది…
బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీల పెంపు
రేపటి నుండి అమలులోకి రానున్న కొత్త టోల్ ఛార్జీలు
కారు, జీపు, లైట్ వాహనాలకు కిలోమీటర్‌కు రూ.2.34 నుండి రూ.2.44కు పెంపు
మినీ బస్, ఎల్సీవీలకు కిలోమీటర్‌కు రూ.3.77 నుండి రూ.3.94కు పెంపు
2 యాక్సిల్ బస్సులకు కిలోమీటర్‌కు రూ.6.69 నుండి రూ.7కు పెంపు
భారీ వాహనాలకు కిలోమీటర్‌కు రూ.15.09 నుండి రూ.15.78కు పెంపు
ఏడాది కూడా కాలేదు, టోల్ పెంచేసి… అప్పుడే మళ్లీ… గత జూన్‌లోనే ఇలా పెంచారు… ఇది టోల్ తీయడం కాదు, తోలు వలవడం అంటారు… ఒక్కసారి ఆ ప్రకటన చూడండి…
ఇది ఎవరు ప్రకటించారు..? ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేటు లిమిటెడ్… ఇదెక్కడిది అనకండి… ఆమధ్య, అంటే అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ‘అడ్డగోలు కంట్రాక్టు’ కుదుర్చుకుని, ఏళ్ల తరబడీ ఓఆర్ఆర్ మీద గుత్తాధిపత్య హక్కుల్ని ధారాదత్తం చేసింది కదా… అదే ఇది…
అసలు ఆ కంట్రాక్టు కుదిరిన వెంటనే అది రుసుం పెంచేసింది తనకు ఇష్టం వచ్చినంత… పైగా దానికి లెక్కాపత్రమూ ఉండదు, పద్ధతి అసలే లేదు…
అప్పట్లో రేవంత్ రెడ్డి కూడా ఈ కంట్రాక్టును విమర్శించాడు… అధికారంలోకి వచ్చాక దాని మతలబు ఏమిటో తేలుస్తాననీ అన్నట్టు గుర్తుంది… ఏం జరిగింది..? ఏమీ జరగలేదు… తమ చేతికి రాగానే పెంచింది, మధ్యలో పెంచింది… ఇప్పుడు మళ్లీ పెంచుతోంది…
ఓఆర్ఆర్ మీద ట్రాఫిక్ పెరిగింది, వాహనాల రాకపోకలు పెరిగాయి… ఇంకా పెరుగుతాయి… మరి ఏం ఆశించి బంగారు తెలంగాణ ఉద్దారకులు దాన్ని ఏదో ప్రైవేటు సంస్థకు అప్పగించారు..? అందులో మతలబు ఏమిటి..? ఈ ప్రభుత్వం కూడా కిమ్మనకుండా ప్రేక్షకపాత్ర పోషించడం దేనికి..? అంతా ఆ పైవాడికే ఎరుక..!!
ఓఆర్ఆర్‌ను ఎంతకు గుండుగుత్తాగా ఏకంగా 30 ఏళ్ల లీజుకు ఇచ్చిపారేశాడో తెలుసా కేసీయార్… దాని ఖరీదు 7,380 కోట్లు… నిజానికి ఓ ప్రైవేటు సంస్థకు ఎందుకు ఇవ్వాలి..? హెచ్ఎండీఏకు చేతకాదా..? ఈ దుందుడుకు చర్యకు కేసీయార్ ప్రభుత్వం ఎందుకు పాల్పడినట్టు..? కారణం ఏమిటి..?
ఇదే డౌట్ ప్రస్తుత సీఎం, అప్పటి ప్రతిపక్షంలోని నాయకుడు రేవంత్‌రెడ్డికీ వచ్చింది అప్పట్లో… ఆ టెండర్లపై సమాచారం అడిగినా కేసీయార్ ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ హైకోర్టు దాకా వెళ్లాడు… చాలా చౌకగా టెండర్ ఎందుకు కట్టబెట్టినట్టు అని ప్రశ్నించాడు… ఇదొక అవినీతి దందా అని విమర్శలు చేశాడు…
సరే, జరిగిన అన్యాయాన్ని రేవంత్‌రెడ్డి సరిదిద్దుతాడు, ఈ బాగోతాన్ని మొత్తం తవ్వి అక్రమాల బాధ్యులను గుర్తించి తాటతీస్తాడు అనుకున్నారు కదా… ఇప్పుడు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది… అడ్డగోలు నిర్వహణకు తోడు మరింత అడ్డగోలుగా ఛార్జీలను పెంచి పారేస్తోంది సదరు సంస్థ…
కొన్నాళ్ల క్రితం ఓ వార్త… చదవండి, ఆ లీజు తీసుకున్న సంస్థ ఎలా దోపిడీ చేస్తున్నదో అర్థమవుతుంది… (2023 డిసెంబరు)
కేసీయార్ తెలంగాణ జనంపై రుద్దిన ఈ దోపిడీ బాగోతాన్ని రేవంత్‌రెడ్డి ఛేదిస్తాడు అనుకుంటే నిజంగా జరిగింది ఏమీ లేదు, ఒరిగిందీ లేమీ లేదు..? అసలు ఓఆర్ఆర్ మీద ఏం జరుగుతున్నదో తనకు సమాచారం ఉందా..? దీనిపై తనే పోరాడిన తీరు గుర్తుందా..?
ఆ అర్వింద్ కుమార్‌ను శంకరగిరి మాన్యాలు పట్టించడం కాదు, ఈ వంకర టెండర్ల అసలు యవ్వారం ఏమిటో తేలుస్తాడా..? ఏదీ ఉండదు, అసలు ఫార్ములా రేస్ విషయంలోనే అరెస్టులకు దిక్కులేదు… నిజానికి ఇది ఓ హైదరాబాద్ సమస్యో, తెలంగాణ సమస్యో కాదు… నార్త్, సౌత్ నడుమ ఓ ప్రధాన రోడ్ జంక్షన్ సమస్య…
సరే గానీ… రేవంత్ చేధించాల్సిన అవినీతి, అక్రమాల బాగోతాల్లో ఓఆర్ఆర్ కూడా ప్రయారిటీ లిస్టులో ఉన్నట్టా..? లేనట్టా..?
పెద్ద జోక్ ఏమిటంటే… బీఎల్ఎన్‌రెడ్డి అనే ఓ చీఫ్ ఇంజినీర్, హెచ్ఎండీఏలో కొలువు… అడ్డగోలు వసూళ్ల వార్తలు వచ్చిన సందర్భాల్లో ఏమన్నాడో తెలుసా..? ప్రజలంటే ప్రతి అధికారికీ లోకువే కదా… ఒకవేళ ఎక్కువ డబ్బులు తీసుకున్నట్టు రుజువైతే వాళ్ల ఖాతాల్లో జమ అవుతాయట… ఫిర్యాదులు విచారిస్తారట…
ఈ టోల్ కోసం ఎవరు ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎవరు విచారిస్తారు, ఎందరి డబ్బులు వాపస్ ఇప్పించారు..? సగటు రాజకీయ నాయకుడి యవ్వారంకన్నా దరిద్రంగా ఉంది ఆయన వివరణ అప్పట్లో… ఆ తరువాత ఎవరూ పట్టించుకోలేదు, ఇక మరోసారి బాదుడుకు రెడీ అయిపోయింది సదరు లీజు సంస్థ… కొత్త దేవుడికన్నా ఆ పాత దెయ్యమే మేలు అనిపిస్తోందా మీకు..?!
Share this Article