ఒక వార్త… గుట్కా ప్రకటనల్లో నటించినందుకు షారూక్ ఖాన్, అక్షయ కుమార్, అజయ్ దేవగణ్‌లకు కేంద్రం షోకాజు నోటీసులు జారీ చేసింది… ఎందుకు..? ఆ ప్రకటనల్లో నటించడం ప్రజాప్రయోజనాలకు విరుద్ధం, నియమావళికి విరుద్ధం, చట్టవిరుద్ధం కాబట్టి… అదీ మోతీలాల్‌యాదవ్ అనే లాయర్ వాళ్లపై ఓ పిటిషన్ వేశాడు కాబట్టి… కేంద్రం మొదట్లో ఏమీ పట్టించుకోలేదు కాబట్టి… మళ్లీ ఇంకో పిటిషన్ వేశాడు కాబట్టి… దాన్ని బట్టి అలహాబాద్ హైకోర్టు కేంద్రాన్ని అడిగింది కాబట్టి… అప్పుడు గానీ కేంద్రం స్పందించలేదు… అబ్బే, మేం షోకాజు నోటీసులు జారీచేశాం అని కోర్టుకు చెప్పుకుంది…
అంతే… నోటీసులు జారీ… ఇక అంతే… అవునూ, అసలు కేసు ఏమిటి..? ఆ నటులు గుట్కాయాడ్స్‌లో నటించారు… నటిస్తే తప్పేమిటి అంటారా..? అసలు మద్యం, గుట్కా, సిగరెట్ల ప్రకటనలు చట్టవిరుద్ధం… అందుకని వీళ్లు ఏం చేస్తారంటో ఆయా బ్రాండ్లకు పరోక్షంగా ప్రమోట్ చేసే యాడ్స్‌లో నటిస్తారు… అంటే మంచినీళ్ల సీసాలు, ఊదుబత్తీలు, వక్కపొడి వంటి ఉత్పత్తుల పేరుతో ప్రచారం చేస్తారు… వీటినే సరోగేట్ యాడ్స్ అంటారు… ఇవి నైతికంగా తప్పు…
మొదట్లో అమితాబ్ ఇలాగే ఈ యాడ్స్ చేశాడు… నెటిజనం బూతులు తిట్టేసరికి లెంపలేసుకుని, సదరు గుట్కా కంపెనీ నుంచి తీసుకున్న డబ్బు వాపస్ చేశాడు… ఐనాసరే ఆ కంపెనీ కొన్నిచోట్ల ప్రచారానికి వాడుకుంది… అది మరో కేసు… అక్షయకుమార్ కూడా తప్పు తెలుసుకుని, ఇకపై అలాంటి యాడ్స్ చేయను అన్నాడు… మరి ఆల్‌రెడీ మార్కెట్‌లో ఉన్నవాటి మాటేమిటి అంటే కిక్కుమనలేదు… ఇక షారూక్ ఖాన్, అజయ్ దేవగణ్ ఆమాత్రం కూడా స్పందించలేదు… మా మొహాలు, మా ఇమేజ్, మా యాడ్స్, మా సంపాదన అన్నట్టుగా సైలెంట్…
Ads
ఇప్పుడు మళ్లీ ఈ వివాదం తెర మీదకు వచ్చింది… కోట్ల మందిని ప్రభావితం చేసే సినిమా సెలబ్రిటీలకు సొసైటీ పట్ల బాధ్యత లేదా..? ఎంతసేపూ వాళ్ల డబ్బే వాళ్లకు ముఖ్యమా..? అంతే… అదే నిజం… సరే, మన తెలుగు ఇండస్ట్రీకి వద్దాం… మహేశ్ బాబు ఇలాంటి బాధ్యతారహిత యాడ్స్‌కు ప్రసిద్ధుడు… ఇవే గుట్కా యాడ్స్ చేశాడు తను కూడా… (తనతోపాటు టైగర్ ష్రాఫ్ కూడా కలిసి చేసిన యాడ్స్ బోలెడు… ఇప్పుడవి చెలామణీలో ఉన్నాయా లేదా తెలియదు…)
గతంలో ‘ముచ్చట’ కూడా మహేశ్ మౌనాన్ని ప్రశ్నించింది… తనే కాదు, హీరో బన్నీ కూడా… ఆమధ్య ఎవరో బన్నీ మీద కేసు పెట్టినట్టు, చదివినట్టు కూడా గుర్తుంది… ఓసారి ఆ పాత పోస్టులోకి వివరంగా వెళ్దాం…
హీరో బన్నీ మీద కేసు పెట్టడం కరెక్టేనా..? తను చేసిన తప్పేముంది..? తను శిక్షార్హుడేనా..? అనడిగాడు ఓ మిత్రుడు… దీనికి సమాధానం ఏమిటంటే..? బన్నీ శిక్షార్హుడే… తనే కాదు, మహేశ్ బాబు కూడా ఇలాంటి లీగల్ చిక్కులు తప్పకపోవచ్చు… వివరాల్లోకి వెళ్తే… కొద్దిరోజుల క్రితం రాపిడో యాడ్ చేశాడు బన్నీ… అందులో సిటీ బస్సులను తక్కువ చేసి చూపించడంతో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహించాడు… నిజానికి ఓ ప్రభుత్వ రంగ సంస్థను కించపరుస్తూ తమ గురించి డప్పు కొట్టుకోవడం కరెక్టు కాదు… అంత ఆలోచించే పరిణతి బన్నీకి ఉందని అనుకోలేం…
మొత్తానికి సజ్జనార్ హెచ్చరిక పనిచేసి, ఆ యాడ్‌లో కొన్ని మార్పులు చేశారు… తరువాత జొమాటో యాడ్ కూడా ఓ వివాదమే… అందులో బన్నీ సౌత్ ఇండియాలోని యాక్షన్ సీన్లపై ఓ సెటైర్ వేశాడు… కొంతమందికి అది నచ్చలేదు… ట్రోలింగ్‌కు దిగారు… నిజానికి యాడ్ కంటెంటులో తప్పులేదు… కానీ అనవసర వ్యతిరేకత దేనికిలే అనుకుని జొమాటో ఆ యాడ్‌లో మార్పులు చేసినట్టుంది…
తాజాగా బన్నీ శ్రీ చైతన్య విద్యాసంస్థల కోసం ఓ యాడ్ చేశాడు. ప్రస్తుతం ఆ యాడ్ వివాదానికి దారి తీస్తున్నది. బన్నీ నటించిన శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యాపార ప్రకటన విద్యార్థులని తప్పుదోవ పట్టించేలా ఉందని, ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకుల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తున్నారని బన్నీతో పాటు శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కొత్త ఉపేందర్‌రెడ్డి అనే సామాజిక కార్యకర్త హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు… నిజానికి మన రూల్స్ ఏమంటున్నాయో చూద్దాం ఓసారి…
వాణిజ్య ప్రకటన పై కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. తప్పుదోవ పట్టించే, అసత్యాలతో కూడిన ప్రకటనలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. కొత్త మార్గదర్శకాలు వెంటనే అమల్లోకి వస్తాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా చిన్న పిల్లలను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రకటనల విషయంలో నిబంధనలు కఠినతరం చేశారు.
పిల్లల కోసం చేస్తున్న ప్రకటనల్లో తప్పుదోవ పట్టించేలా తమ ఉత్పత్తులను వినియోగిస్తే ఎత్తు పెరగడం, లావు తగ్గడం, తెలివి తేటలు వస్తాయని, శక్తి వస్తుందని చేసే ప్రకటనల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. వాణిజ్య ప్రకటనలో వస్తువులో వాస్తవంగా ఏం ఉందో దాన్ని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. శ్రీచైతన్య, నారాయణ వంటి సంస్థలు తమ ర్యాంకుల విషయలో అడ్డగోలు అబద్ధాలు ప్రచారం చేసుకుంటుంటాయి… అవి ప్రజలను అసత్యాలతో తప్పుపట్టించడమే… సో, ఆ యాడ్స్‌లో పాల్గొన్నందుకు అల్లు అర్జున్ ఈ కేసుకు అర్హుడే అవుతాడు… సెలబ్రిటీలు తాము ఎండార్స్ చేసే ప్రకటనల్లోని వివరాలను ముందుగా నిర్ధారించుకోవాల్సిందే… లేకపోతే శిక్షలకు అర్హులవుతారు…
ప్రతి కంపెనీ తన ఉత్పత్తి విషయంలో పారదర్శకంగా వివరాలను ప్రకటనలో చెప్పాల్సి ఉంటుంది. వాస్తవ దూరంగా, అతిశయోక్తుల తో కూడిన ప్రకటనలు జారీ చేయడం ఇక నుంచి నిషేధం. ఇలాంటి ప్రకటనలు వినియోగదారుల హక్కులకు భంగం కల్గిస్తాయని కన్జ్యూమర్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. తప్పుడు ప్రకటనలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, వాస్తవ విరుద్ధమైన ప్రకటనలు జారీ చేసే వారిపైనా, అందులో నటించిన వారిపైనా, ప్రచురించిన, ప్రసారం చేసిన వారిపై మొదటిసారి 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇలాంటి ప్రకటనలు జారీ చేసే వారిపై మూడు సంవత్సరాల నిషేధం విధిస్తారు.
సెలబ్రేటీలు తాము ఎండార్స్ చేసే వస్తువు, ఉత్పత్తుల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తరువాతే నటించాలని, లేకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచర్చించారు. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకటనకర్తలకు, ప్రచురణ, ప్రసారకర్తలకు వర్తిస్తాయి. ఉత్పత్తులను ప్రమోట్ చేసే సెలబ్రిటీలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో నటించే వారు చిక్కుల్లో పడక తప్పదు. కేసులు, జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ , సోషల్ మీడియా ఎలాంటి మాధ్యమంలోని ప్రకటనలకైనా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.
మహేష్ బాబుకూ తప్పవు చిక్కులు…
నిషేధిత జాబితాలో ఉన్న వాటిని కొన్ని కంపెనీలు పరోక్షంగా అదే పేరుతో మరో ఉత్పత్తిని పెట్టి ప్రచారం చేస్తుంటాయి. వాటిని సరోగేట్ యాడ్స్ అంటారు… మద్యం కంపెనీలు , గుట్కా కంపెనీలు ఎక్కువగా ఇలాంటి ప్రకటనలు ఇస్తుంటాయి. ఇక నుంచి ఇలాంటి వాటిని అనుమతించరు.
తప్పుడు సమాచారంలో ఇచ్చే ప్రకటనలు వినియోగదారుల హక్కులను హరించడమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. గుట్కా సరోగేట్ యాడ్స్ విషయంలో అమితాబ్, అక్షయ్ కుమార్ తదితరులు నెటిజనం నుంచి వ్యతిరేకతను ఎదుర్కున్న సంగతి తెలిసిందే… మహేష్ బాబు కూడా పాన్ బహర్‌కు సరోగేట్ యాడ్స్ చేశాడు… ఎవరైనా ఫిర్యాదు చేసినా, కేసు పెట్టినా తనకూ చిక్కులు తప్పవు…!!
Share this Article