తరచూ తమిళ స్టాలిన్ మన వార్తల్లోకి వస్తున్నాడు ఈమధ్య… లావణ్య సూసైడ్ కేసులో విమర్శలకు గురికాగా, కొన్ని పాలనాంశాల్లో ప్రశంసలు పొందాడు… నిన్నటి నుంచీ స్టాలిన్ మీద అభినందనలు, పొగడ్తలు కనిపిస్తున్నయ్ సోషల్ మీడియాలో… ఆ పోస్టుల సారాంశం ఏమిటో ముందుగా సంక్షిప్తంగా చూద్దాం… ‘‘మంచి పాలకులు ప్రజల్ని జ్ఞానసంపద వైపు, ఆధునిక సమాజం వైపు తీసుకెళ్తారు… అది పురోగమన సూచిక… దానికి భిన్నంగా కొందరు బంగారు విగ్రహాలు, భారీ రియల్ ఎస్టేట్ కమర్షియల్ ఆధ్యాత్మిక కట్టడాల వైపు ప్రజల్ని తీసుకుపోతారు… అది తిరోగమన సూచిక…
స్టాలిన్ మొదటి కేటగిరీ… మధురైలో రూపుదిద్దుకోనున్న ఓ అద్భుతం దానికి ఉదాహరణ… మిగతా రాష్ట్రాలు గ్రంథాలయాల్ని నిర్లక్ష్యంలో కలిపేస్తే… స్టాలిన్ మాత్రం ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి పూనుకున్నాడు… దానిపేరు కళైంగర్ కరుణానిధి మెమోరియల్ లైబ్రరీ… సుమారు మూడు ఎకరాల్లో, రెండు లక్షల చదరపు అడుగుల భారీ నిర్మాణం ఇది… స్టాలిన్ వీడియో ద్వారా ఫౌండేషన్ పనుల్ని ప్రారంభించాడు… 99 కోట్లతో కొలువు దీరబోతున్న ఈ జ్ఞానవేదిక ఏడాదిలో నిర్మాణం పూర్తిచేసుకోనుంది…
అన్నీ ఆధునాతన సౌకర్యాలు, ఎనిమిది అంతస్థులు, ఎలివేటర్లు, ప్రశాంతమైన పఠన ప్రాంతాలు, గ్రూప్ రీడింగ్ ఏరియాలు, లాన్స్, వాష్ రూమ్స్, రెస్ట్ ప్లేసెస్, పగటిపూట పూర్తిగా సహజమైన వెలుతురు వచ్చే ఏర్పాట్లు, సెంట్రలైజ్డ్ ఏసీ… అంతేకాదు, ఫ్రీ వైఫై… అనేక రంగాలకు చెందిన లక్షల పుస్తకాలతోపాటు పలు డిజిటల్ వ్యాసాల సాఫ్ట్ కాపీలు, జిరాక్సులు, ఆన్లైన్ మ్యాగజైన్లు, పలురకాల సాంకేతిక పరికరాలతో డిజిటల్ రీడింగ్ సౌకర్యం కూడా ఉంటుంది…
Ads
బ్లయిండ్, డెఫ్ రీడర్ల కోసం ఆడియో విజువల్ హాళ్లు, శిక్షణ పొందిన సిబ్బంది, సహాయకులు ఉంటారు… విద్యావేత్తలు, విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు, ఉద్యోగార్థులు, మహిళలు, పిల్లలకు, మిగతా పాఠకులకు అద్భుతంగా ఉపయోగపడగల ఈ నిర్మాణం కదా అసలైన దివ్యక్షేత్రం…’’ ఇవీ ఆ పోస్టుల సారాంశం… అంతా నిజమే…
ఇంకొన్ని వివరాలు చూద్దాం… స్టాలిన్ తండ్రి కరుణానిధి చెన్నైలో అన్నా సెంటినరీ లైబ్రరీని దాదాపు ఈ స్థాయిలోనే నిర్మించాడు, తన అడుగుజాడల్లో దక్షిణ తమిళ జిల్లాల ప్రజలకు ఉపయోగపడేలా ఇప్పుడు మధురైలో నిర్మిస్తున్నారు… బహుశా దీని వెనుక తమిళ ఆర్థికమంత్రి త్యాగరాజన్ ఆలోచన ఉండవచ్చు… 2.57 లక్షల పుస్తకాల్ని ఇక్కడ ఉంచబోతున్నారు… గత జూన్‌లోనే దీని నిర్మాణ ప్రకటన వెలువడింది… దాదాపు ఈ 3 ఎకరాల స్థలం మీద రాజకీయ వివాదం కూడా తలెత్తింది…
ప్రఖ్యాత నీటి ప్రాజెక్టు ముళ్లపెరియార్ డ్యామ్ నిర్మాణ సూత్రధారి Colonel John Pennycuick నివసించిన పీడబ్ల్యూడీ క్వార్టర్లు అవి, వాటిని ధ్వంసం చేస్తున్నారు అని అన్నాడీఎంకే ఆందోళన… ఎహె, ఆయన 1911లోనే మరణించాడు, ఈ క్వార్టర్లేమో 1912 -1915 మధ్యకాలంలో కట్టారు అంటూ స్టాలిన్ ప్రభుత్వం ఆ విమర్శల్ని కొట్టిపారేసి, ఆ క్వార్టర్లు కూలగొట్టి, ఆల్ రెడీ నిర్మాణం ప్రారంభించేసింది…
ఇంటి నుంచి పుస్తకాలు తీసుకెళ్లి కూడా అక్కడ చదువుకోవచ్చు, ఫుడ్ కూడా తీసుకుపోవచ్చు, డైనింగ్ హాల్స్ కడుతున్నారు… ఒక కాఫీ షాపు, ఒక రెస్టారెంటు కూడా…! ఇంకా చాలా విశేషాలున్నయ్… అయితే విజ్ఞుల సలహాల్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేదు… ఒక మాన్యుమెంట్ నిర్మాణం వేరు, దాన్ని విస్తృత ఉపయోగంలోకి తెచ్చుకోవడం వేరు… ఆ లక్షల పుస్తకాల్ని భద్రపరిచే వేదిక, అందుబాటులో ఉండే స్థలం… గుడ్… అయితే రాను రాను వాటిని భద్రంగా ఉంచడం కష్టం… అందుకని మొత్తం ఆ పుస్తకాల్ని డిజిటలైజ్ చేయాలనే సూచనలు వచ్చినయ్… అది మరింత మంచి మార్గం… అనేక తరాల వరకూ ఈ పుస్తకాల్ని ప్రిజర్వ్ చేయడానికి అదే మార్గం… అంతేకాదు, ఇళ్లల్లో కూర్చునే లక్షల మంది అవి చదువుకునే వెసులుబాటు కూడా తీసుకురావచ్చు క్రమేపీ…!!
Share this Article