ఒక వార్త… మళ్లీ టోల్ ఛార్జీలు పెరగబోతున్నాయి… ఇప్పటికే టోల్ తీస్తున్నారు ప్రతిచోటా… మరి గడ్కరీ నాయకత్వమా మజాకా..? వాయింపు, వడ్డింపు మాత్రమే తనకు తెలిసిన విద్యలు… సగటున 5 శాతమే అని మళ్లీ ఏదో బుకాయింపు, సమర్థింపు… అసలు ఏ రోడ్డుకు ఎంత ఖర్చయింది, ఇప్పటికి ఎంత వసూలైందనే లెక్కలు చూసే అధికారి ఒక్కడూ లేడని అనిపిస్తుంది…
సరే, అది కాదు అసలు వార్త… హైాదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద టోల్ చార్జీలు పెంచుతున్నట్టు ఒక ప్రకటన పత్రికల్లో కనిపించింది… ఇది టోల్ తీయడం కాదు, తోలు వలవడం… ఒక్కసారి ఆ ప్రకటన చూడండి…
Ads
చూశారు కదా… కారుకు, జీపుకు, వ్యానుకు కిలోమీటర్‌కు 2.34 రుసుం ఉంటుందట ఇకపై… మినీ బస్ అయితే 3.77, బస్సయితే 6.69, త్రీ యాగ్జిల్ కమర్షియల్ వెహికిల్ అయితే 8.63 చొప్పున వాయించేస్తారట… ఇది ఎవరు ప్రకటించారు..? ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేటు లిమిటెడ్…
ఇదెక్కడి అనకండి… ఆమధ్య బీఆర్ఎస్ ప్రభుత్వం ‘అడ్డగోలు కంట్రాక్టు’ కుదుర్చుకుని, ఏళ్ల తరబడీ ఓఆర్ఆర్ మీద గుత్తాధిపత్య హక్కుల్ని ధారాదత్తం చేసింది కదా… అదే ఇది… అసలు ఆ కంట్రాక్టు కుదిరిన వెంటనే రుసుం పెంచేసింది… పైగా దానికి లెక్కాపత్రమూ ఉండదు, పద్ధతి అసలే లేదు…
సపోజ్, మీరు శామీర్‌పేట నుంచి ఘట్కేసర్ వరకు వస్తే 50 రూపాయలు, అదే ఘట్కేసర్ నుంచి శామీర్‌పేట వెళ్తే 60 రూపాయలు… అదేమంటే..? అడిగేదెవరిని..? అడిగితే చెప్పేవాడెవడు..? అప్పట్లో రేవంత్ రెడ్డి కూడా ఈ కంట్రాక్టును విమర్శించాడు… అధికారంలోకి వచ్చాక దాని మతలబు ఏమిటో తేలుస్తాననీ అన్నట్టు గుర్తుంది…
ఏం జరిగింది..? ఏమీ జరగలేదు… పైగా మళ్లీ తోలు తీస్తామని ఆల్రెడీ ఓఆర్ఆర్ నిర్వహణ కంట్రాక్టు పొందిన సంస్థ బాహటంగానే ప్రకటించింది… ఇక ఆచరణలో ఎంత తోలు వలుస్తారో తెలియదు… నగరంలో ట్రాఫిక్ పెరిగింది, కాలుష్యం పెరిగింది… వైఎస్ పుణ్యమాని దక్కిన ఈ ఓఆర్ఆర్ ఇప్పుడు ఓ తప్పనిసరి అవసరం అయిపోయింది…
ఓఆర్ఆర్ మీద ట్రాఫిక్ పెరిగింది, వాహనాల రాకపోకలు పెరిగాయి… ఇంకా పెరుగుతాయి… మరి ఏం ఆశించి బంగారు తెలంగాణ ఉద్దారకులు దాన్ని ఏదో ప్రైవేటు సంస్థకు అప్పగించారు..? అందులో మతలబు ఏమిటి..? ఈ ప్రభుత్వం కూడా కిమ్మనకుండా ప్రేక్షకపాత్ర పోషించడం దేనికి..? అంతా ఆ పైవాడికే ఎరుక..!!
Share this Article