(రమణ కొంటికర్ల)….. అబ్ తో హై తుమ్సే హర్ ఖుషీ అప్నీ.. ఇప్పుడు నా ప్రతి సంతోషమూ ఇక నీతోనే అనే 1973లో విడుదలైన అభిమాన్ సినిమాలో పాటతో పెళ్లిచూపుల్లో ఆయన మనసు కొల్లగొట్టింది. ఇప్పుడు నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా వచ్చేత్తపా డుగ్గుడుగ్గని పాడుతూ… పారాహుషార్ పారాహుషార్ తూరుపమ్మ దక్షిణమ్మ పడమటమ్మ ఉత్తరమ్మ అంటూ నలుదిక్కుల రైడ్ చేస్తున్న భర్తతో కలిసి దేశ, విదేశాల్లో పర్యటిస్తూ తన జ్ఞాపకాలను పంచుకుంటోంది. 70వ పడిలోనూ నవ దంపతుల్లా మేఘాలలో తేలిపోతున్న ఓ వృద్ధజంట సూదూర ప్రయాణ ప్రస్థాన ఆసక్తికర కథనమిది.
పెళ్లయ్యేంతవరకూ ప్రేమ పేరుతో జరిగే ఆకర్షణలు.. పెళ్లాయ్యక మొహం మొత్తి వికర్షణలై.. భిన్నధృవాలుగా మారి ఎందరివో విడాకుల కేసులు చూస్తున్న రోజుల్లో.. పెళ్లైన్నాట్నుంచీ మొదలైన జీవన ప్రయాణంలో… ఇప్పటికీ అరవైల్లో ప్యారాగ్లైడింగ్… డెబ్బైల్లో ట్రెక్కింగ్ చేస్తూనే… ఇంకా ప్రేమించుకుంటున్న జంట యోగి అండ్ సుశీ. ఢిల్లీకి చెందిన యోగేశ్వర్… ఆయన సహధర్మచారిణి సుష్మాభల్లా.. ఉరప్ యోగీ అండ్ సుశీ… ఈ ఇద్దరూ ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టివస్తున్న నిత్యయవ్వన పర్యాటకులు. ఇండియానే కాదు.. ప్రపంచదేశాల్నీ పర్యటిస్తున్న ఈ దంపతుల జంట…
70 ఏళ్లు పైబడ్డా అడ్వంచర్సంటే ముందుండటమనేది వీరి విల్ పవర్ నూ.. అలాంటి సాహసోపేత అంశాల పట్ల వీరి ఆసక్తినీ కనబర్చేవే మరి! అయితే వీరిద్దరినీ మరింత పెనవేసుకునేలా చేసింది రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బండి. పెళ్లైన నలభై ఏళ్ల నాటి నుంచీ ఈ జంట ఈ బండిపై తిరుగుతూ… ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకుని ప్రేమకు చిరునామాగా మారారు. 1976 అక్టోబర్ 3వ తేదీన వీళ్ల పెళ్లి అలా జరిగిందో, లేదో… అక్టోబర్ 5 నాడే తమ హనీమూన్ కు ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు రాయల్ ఎన్ ఫీల్డ్ పై బయల్దేరింది ఈ జంట. అలా వారి జీవితంలో అత్యంత మరపురాని ప్రయాణంగా ప్రారంభమైన ఆ జర్నీ… ఇప్పటికీ వివాహమై నాల్గు దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా కొనసాగుతూనే ఉండటం విశేషం.
Ads
ప్రేమ వివాహలంటే వేరుగానీ… అరెంజ్డ్ మ్యారేజెస్ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవాలన్నా, ఒకరి ఆచారాలు ఇంకొకరు ఒంటపట్టించుకోవాలన్నా, ఒకరి పద్ధతులను ఇంకొకరు ఫాలో కావాలన్నా.. కాస్తా సమయం పడుతుంది. అయితే ఆ సమయాన్ని తమ ట్రావెలింగుకుపయోగించుకుని నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా మరింత పెనవేసుకునేలా సాగింది నలభై ఏళ్ల కింద పెళ్లైన ఈ ప్రేమ జంట జర్నీ. 1976లో పెళ్లైన్నాట్నుండి.. తన శ్రీమతి భల్లానే.. తన నావిగేటరని.. అంతకుమించిన మోటివేటరంటాడు యోగి. అందుకే ఆమెను జానేమన్ గుల్ ఏ గుల్జార్ గా… ఓ పువ్వులతోటగా అభివర్ణిస్తుంటాడు.
ఈ జంట వేల కిలోమీటర్ల దూరం రాయల్ ఎన్ ఫీల్డ్ పై ప్రయాణిస్తున్న సమయంలో కేవలం వారికి కావల్సిన నిత్యవసరాలు, ఓ నాల్గు జతల బట్టలతో పాటు… ఆహారానికి కావల్సిన సరకులతో కేవలం రెండంటే రెండే బ్యాగులతో బయల్దేరుతుంది. దీంతో వీరి ప్రయాణంలో ఎక్కువ ఆగాల్సిన పని లేకుండా.. తమ బుల్లెట్ పైనే సమయాన్ని వెచ్చిస్తుంటారు. 15 ఏళ్ల వయస్సులో తన అన్న బుల్లెట్ నడిపిన నాటి నుంచి మనసు పారేసుకున్న యోగి… తన మొదటి ఉద్యోగంతో వచ్చిన జీతానికి మరి కొంత కలిపి బుల్లెట్ కొనేశాడు.
అప్పుడు మొదలైన బుల్లెట్ షికారు.. ఇంకా 70వ పడిలోనూ కొనసాగుతూనే ఉంది. పిల్లలు పుట్టాక కూడా అబ్బాయిని ముందు.. అమ్మాయిని తన భార్య సుశీ ఒడిలో కూర్చోబెట్టుకునే తమ సుదీర్ఘ ప్రయాణాలను కొనసాగించింది ఈ జంట. అలా ఇప్పటివరకూ.. 22 దేశాలకు పైగా సందర్శించిందీ ఈ సాహసోపేత జంట. రోడ్డుపై గడిపిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించడంతో… తమ ప్రయాణాలు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలయ్యాయంటుంది ఈ దంపతుల జోడి.
2011లో, 58 ఏళ్ళ వయసులోనే యోగి, సుశీ ఇద్దరూ కూడా వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇక ఈ జంటకు ప్రయాణాలే జీవితంలో ప్రధానాంశంగా మారాయి. అలా భూటాన్, నేపాల్, లేహ్, లడఖ్ మీదుగా ప్రయాణించారు. ముదిమి వయస్సులో సన్నగిల్లుతున్న వీరి ఆత్మవిశ్వాసానికి ఆ ప్రయాణాలే ఆయువుపట్టాయాయి. ఇప్పుడీ జంట తాజాగా తమ ఐరోపా పర్యటనకు నడుం బిగించింది. స్విస్ ఆల్ప్స్ పర్వతాల్లో ఐకానిక్ బాలీవుడ్ చలనచిత్ర నటుల భంగిమలను గీయడం నుంచి క్యాండిల్ లైట్ డిన్నర్‌లను ఆస్వాదించే వరకు.. ఎన్నో వండర్ ఫుల్ ట్రావెల్ మెమరీస్ వీరి సొంతమిప్పుడు.
అలా బెల్జియం, భూటాన్, దుబాయ్, ఫ్రాన్స్, ఖతార్, రోమ్, సింగపూర్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, టర్కీ, వెనిస్ వంటి దేశాలను చుట్టివచ్చింది ఈ జంట. వెనిస్‌ను సందర్శించాలనేది సుశీ కల. అమితాబ్, జీనత్ అమన్ పాడిన దో లఫ్జోన్ కీ హై దిల్ కి కహానీ పాటను చేతులు జోడించి పాడుతూ.. వీరు వెనిస్ వీధుల్లో స్టెప్పులు వేసిన యాది ఈ జంట మధురానుభూతులకు ఓ రూపు. అయితే వీరి ఈ సుదీర్ఘ పర్యాటకమేమంత సులభంగా జరిగిందేంకాదు. ఎన్నో సవాళ్లెదురైనాయి. భాష రాని ప్రాంతాల్లో.. రోడ్డుపై ఉన్న వివిధ సూచికలు కూడా స్థానిక భాషలోనే ఉండటం.. మొదట్లో చాలా కష్టంగా ఉండేది.
2021మార్చిలో యోగి మోకాలి మార్పిడి శస్త్రచికిత్సతో.. విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. డాక్టర్లు తనను వాకింగ్ స్టిక్ ఉపయోగించమన్నా దానికి నిరాకరించిన వ్యక్తి యోగి. ఎందుకంటే తన సహచరిణితో పాటు.. యోగీకి వయస్సు ఓ సంఖ్య మాత్రమే! అందుకే ఇప్పుడు మళ్లీ బుల్లెట్ ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. హమ్ రుఖ్నే వాలే నహీ హై అంటున్న భార్య సుశీతో కలిసి.. ఇప్పటికీ అరవైల్లో ప్యారాగ్లైడింగ్.. 70ల్లో హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ వార్తల్లో వ్యక్తులయ్యారు ఈ దంపతులు
Share this Article