సామాజిక మాధ్యమాల్లో “ఫేక్” అన్న మాట తరచుగా వినపడుతూ ఉంటుంది. అంటే అభూత కల్పన; నిజం కానిది. వినోద పరిశ్రమలో “డీప్ ఫేక్” అని మరో పారిభాషిక పదం వాడుకలోకి వచ్చింది. అంటే ఫేక్ కు ముత్తాతలాంటి ఫేక్. సులభంగా అర్థం కావడానికి కొన్ని వీడియో ప్రకటనల గురించి మాట్లాడుకోవాలి. బాలీవుడ్ ప్రఖ్యాత హీరో సల్మాన్ ఖాన్ వయసు ఆరు పదులకు దగ్గర పడుతోంది. ఆయనతో ఇప్పుడొక ప్రకటన షూట్ చేసి…దాన్ని కృత్రిమ మేధ మిక్సీలో వేసి…రుబ్బి…బయటికి తీస్తే…పాతికేళ్ల పడుచు ప్రాయపు సల్మాన్ వస్తాడు.
యాభై ఏళ్ల సచిన్ టెండూల్కర్ ను కృత్రిమ మేధతో మంత్రించగానే పదహారేళ్ల సచిన్ వచ్చేస్తాడు. కొత్తగా షూట్ చేయాల్సిన అవసరం లేని సాఫ్ట్ వేర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత ప్రకటనను కృత్రిమ మేధ కొత్త సీసాలో పోస్తే…ఎంత వెనక్కయినా వయసును మళ్లించవచ్చు. ఫైటింగ్ సీన్లో డూప్ ను పెట్టినట్లు ఎవరో ఒకరిని పెట్టి ఏ హీరో యిన్ లేదా హీరోనయినా సృష్టించుకోవచ్చు. ఇలా లెక్కలేనన్ని అప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి.
Ads
ఇందులో ప్రధానంగా రాయల్టీ చెల్లింపు, నైతిక సంబంధమయిన సమస్యలున్నాయి. ఒక హీరో లేదా సెలెబ్రిటీ చిన్నప్పుడు ఎలా ఉన్నాడో అలాంటి రూపంతో ప్రకటన వాడుకుంటే ఎంత పరిహారం చెల్లించాలి? మనిషి షూటింగ్ కే రానప్పుడు అసలు పరిహారంతో పనేముంది? వయసును అంగీకరించనిది మనమా? ఆ సెలెబ్రిటీనా? కంపెనీలా?
కాపీరైట్ చట్టాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాలు వీటిని అధికారికంగా అనుమతిస్తాయా? సెలెబ్రిటీ అనుమతి ఉన్నా…నైతికంగా అతడే అతడి వయసును అంగీకరించక…మనకు మొహం చూపించలేక…మరో ముసుగు తొడుక్కున్నట్లు కాదా? అనుమతించకపోయినా ఎవరు ఏ మొహాన్ని ఎలా అయినా సృష్టించి వాడుకుంటే ఇప్పుడున్న కాపీరైట్ చట్టాలు అడ్డుకోగలవా?
మనలో మన మాట-
వినోద పరిశ్రమ అంటేనే వయస్సు వెనక్కు వెళ్లే…డెబ్బయ్ ఏళ్ల హీరో తాత పదహారేళ్ల హీరోయిన్ కోసం తహతహలాడుతూ యుగళగీతాలకు గంతులేసే సందర్భం. ఇందులో అసందర్భానికి, అప్రస్తుతానికి తావే లేదు. సింపుల్ ఫేక్, డీప్ ఫేక్, పరమ డీప్ ఫేక్, యాంటీ ఏజింగ్ రివర్స్ డీపెస్ట్ ఫేక్…అన్నీ అంగీకారమే!….. – పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article