.
ఒక దరిద్రపు టీవీ… 60, 70 రకరకాల పేర్లలో యూబ్యూబ్ ప్రేక్షకుల్లో టన్నుల కొద్దీ మూఢవిశ్వసాల్ని, అజ్ఞానాన్ని, చీకటిని నింపుతూ ఉంది… జనం పిచ్చి లేచినట్టు చూస్తున్నారు… కోట్ల వ్యూస్, కోట్ల సంపాదన… తీరా ఒరిగేది ఏమిటి..? తిమిరం వైపు జనాన్ని నడిపించడం…
సమాజం మీద బాధ్యత కలిగిన మెయిన్ స్ట్రీమ్ మీడియా, కోర్టులు, బ్యూరోక్రాట్లు, వ్యవస్థలు… అన్నింటికీ మించి చటాక్ గుజ్జు లేని నాయకులు… చోద్యం చూస్తున్నారు… అదొక విషాదం… సేమ్… అదో, వాడో తెలియదు గానీ… ఒక అఘోరి అట… జంటనగరాల్లో ప్రవేశించింది… యండమూరి నవల్లోని దార్కా, కాద్రా, కాష్మోరా టైపులో…
Ads
అక్షరాలా జనం వెర్రెత్తి చూస్తున్నారు ఆ వీడియోలు… ఏ చిన్న వీడియో చూసినా లక్షల్లో వ్యూస్… యూట్యూబర్లు కూడా పిచ్చెక్కినట్టుగా ఆ వీడియోలు చేయడానికి పరుగులు తీస్తున్నారు… అది అదేనా..? వాడా..? మగదా..? ఆడోడా..? అని నిరూపించే ప్రయత్నం ఒకడిది… మీకూ సంభోగ వాంఛలుంటాయా..? నెలనెలా రుతుక్రమం క్రమం తప్పకుండా వస్తుంటుందా అనడుగుతుంది ఒకత్తి… ఈ సకలజీవరాశుల మనుగడ ఇంకెన్నాళ్లు, ఏమైనా విపత్తులు రానున్నాయా చెప్పు అంటాడు మరొకడు…
పుర్రెల్లో తింటారట, శవాల్ని తింటారట… అలా తినబుద్దవుతుందా అనే ప్రశ్న ఇంకొకడిది… దిక్కుమాలిన ఉన్మాదం ఇది… ఎస్, అక్షరాలా ఓ ఉన్మాదమే… యూట్యూబ్ చానెళ్లతో జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు… నిజానికి తప్పు వాళ్లది కాదు, వాటిని అంతే ఉన్మాదంతో చూస్తూ కోట్లకుకోట్లు సంపాదించి పెడుతున్న ప్రేక్షకుల అజ్ఙానానిది… ఒక్కసారి ఆలోచించండి…
నిజంగా ఏ హిమాలయల్లానో మెయిన్ స్ట్రీమ్ ప్రపంచానికి దూరంగా భిన్నంగా బతికే ఓ రకం జాతి అది… తపస్సుల్లేవు, యోగసాధనల్లేవు… అంతా హంబగ్… చేస్తే శివుడి పూజలు చేస్తారు కావచ్చు… కానీ అఘోర అనగానే ఒంటినిండా ఖచ్చితంగా బూడిద రాసుకోవాలి, బరిబాతల మాత్రమే తిరగాలి అనే ప్రోటోకాల్ డ్రెస్ కోడ్స్ ఏమీ ఉండవు… శవాల్ని తినడం వాళ్ల ఫుడ్ కోడ్ అస్సలు కాదు… అసలు జనజీవన స్రవంతిలో కనిపించడానికే ఇష్టపడరు…
మరీ ఈ ఆడోడు, ఈ మగది ఎందుకొచ్చింది..? ఈ ఇంటర్వ్యూలు ఏమిటి..? ఈ సమాజోద్ధారక ప్రయాస ఏమిటి..? నిజానికి ఆ వింతజీవిని పట్టుకుని లోపలేసి నాలుగు తోమితే అన్ని బూడిదలూ తొలగిపోయి, అసలు స్వరూపాలు బయటపడతాయి… పెద్ద న్యూసెన్స్… సరే, మన పోలీసులకు హెల్మెట్లు, సీటు బెల్టులు, లైన్ క్రాసులు, డ్రంకెన్ డ్రైవులు వంటి చాలా ముఖ్యమైన డ్యూటీలు ఉంటాయి కదా… ఈ సోషల్ ఉన్మాదాల జోలికి పోరు ఫాఫం…
ఈ వీడియోల పైత్యంకన్నా ఒడిశాలోని ఏ మారుమూల స్మశానంలోనో సాగే చేతబడి, చిల్లంగి టైపు క్షుద్రపూజలు నయం… కాకపోతే మనమెవరూ ఈ వీడియోల్ని రిపోర్ట్ చేయడం లేదు… ఇంకా నయం, ఈ పైత్యంలోనూ కొందరికి కొంత సంస్కారం ఏడ్చింది… ఛాతీ భాగం, ఇతరత్రా పార్టులు కనిపించకుండా బ్లర్ చేస్తున్నారు… అదీ స్మశాన సంస్కారం అంటే..!
అఘోర అంటే వాళ్లకేదో మహత్తులు ఉంటాయనేదే పిచ్చితనం… పైగా ఈ లేడీ అఘోరిలు మరీ అసాధారణం… ఇవి లిప్ స్టిక్ పూసుకుంటాయి… పద్ధతి ప్రకారం చెవులకు డిజైన్డ్ దుద్దులుంటాయి… ముక్కు పుడకలుంటాయి… ఓ లెక్క ప్రకారమే రుద్రాక్ష మాలలుంటాయి… కార్లలో తిరుగుతాయి… వాడెవడో చెప్పినట్లు కోట్ల విలువైన విల్లాలూ ఉంటాయి…
ఒకటి మాత్రం నిజం… రీల్స్, షార్ట్స్ కొంత నయం… వాటి పిచ్చిలో పడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా సరే, అవి వినోదాన్ని ఇస్తాయి తప్ప ఇదుగో ఈ అఘోరి వీడియోల్లాగా మనిషిని మళ్లీ చీకటి యుగాల వైపు తరమవు… ఒక మనిషికి ఏదైనా మానసిక వైకల్యం ఉంటే చికిత్స ఉంటుంది… సొసైటీయే ఓరకమైన ఉన్మాదంలో పడి కొట్టుకుపోతుంటే, యూట్యూబ్ చానెళ్లే మార్గదర్శనం చేస్తుంటే… ఏమిటీ దీనికి చికిత్స..!! థాంక్ గాడ్… మెయిన్ స్ట్రీమ్ టీవీలు సంయమనం పాటిస్తున్నాయి… వాళ్ల కంకాళాల్లో ఇంకాస్త గుజ్జు మిగిలే ఉంది..!!
Share this Article