.
చూడబోతే తెలంగాణలో అధికారులందరూ హైడ్రా రంగనాథ్‌నే ఆదర్శంగా తీసుకుంటున్నట్టున్నారు… రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ పాల శీతలీకరణ కేంద్రం మూసివేతలో ఉన్నతాధికారుల దుందుడుకు నిర్ణయాలే కారణమని అనిపిస్తోంది…
అసలే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికార యంత్రాంగం మీద పట్టు చిక్కలేదు ఇప్పటికీ..! ఒకరిద్దరిపై కొరడా ఝలిపించి ఉంటే గాడిన పడేదేమో… మరోవైపు రైతుల్లో వ్యతిరేకత కూడా కనిపిస్తోంది ఊళ్లల్లో… కారణాలు అనేకం ఉండవచ్చుగాక…
Ads
కానీ, ప్రభుత్వం మీద, పార్టీ మీద మరింత వ్యతిరేకతకు కారణమయ్యే సున్నితమైన అంశాల్లో జాగరూకత, విచక్షణ అవసరం… అదీ కనిపించడం లేదు… అగ్రహారంలో ఓ పాలశీతలీకరణ కేంద్రం ఉంది… దాదాపు 20 వేల మంది 145 గ్రామాల నుంచి పాలు పోస్తారని ఓ వార్త… కొత్తదేమీ కాదు… హఠాత్తుగా దాన్ని సీజ్ చేశారు…
అనుమతులు లేవని ఏదో సాకు… అనుమతుల్లేకుండా ఇన్నేళ్లుగా నడుస్తున్నదా అది..? పోనీ, ల్యాప్స్ ఉన్నాయనే అనుకుందాం… రోజూ కొన్ని వేల మంది పాలు పోస్తారు కదా, అకస్మాత్తుగా మూసేస్తే ఆ రైతులు ఏం చేయాలి..? సరే, నిజంగానే ఆ కేంద్రాన్ని మూసివేయడం కరెక్ట్ నిర్ణయమే అయినా సరే…
ముందుగా నోటీసులు ఇవ్వడం సరైన పద్దతి… ఫలానా రోజు నుంచి ఆ కేంద్రం పనిచేయదనే విషయం పత్రికలకు వార్తగా పంపించినా బాగుండేది… సరే, ఆ కేంద్రం కోర్టుకు వెళ్తుందా..? స్టే తెచ్చుకుంటుందా..? వేరే విషయం… పాలు పోసేది చిన్న రైతులే కదా… రాజకీయంగా సున్నితమైన అంశమే కదా… మరి ఈమాత్రం ఎందుకు ఆలోచించలేకపోయారు..?
నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజీలో కనిపించింది ఈ వార్త… అధికార పార్టీ చేయించిందని… దాని లొల్లి దానిది… దొరికింది కదా అధికార పార్టీకి వ్యతిరేక వార్త అనుకుని, అంతా కాంగ్రెసోళ్ల దుర్మార్గం అని రాసిపారేసింది… కారకులు ఎవరో, కారణాలు ఏమిటో కాసేపు వదిలేస్తే… అక్కడ కాంగ్రెస్ పార్టీ గానీ, అధికార యంత్రాంగం గానీ విజ్ఞత ప్రదర్శించలేదు అనేది కఠిన వాస్తవం…
మూసివేయగానే జరిగింది ఏమిటి..? జిల్లాలో ప్రతిచోటా రైతుల ఆందోళన, నిరసనలు, బైఠాయింపులు… ఇక్కడ ఎవరో వాళ్లను రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు… వాళ్ల కడుపు మంట అది… ఎట్టకేలకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రాజకీయంగా జరుగుతున్న నష్టం అర్థమైనట్టుంది… దగ్గరుండి రాత్రి పూట సెంటర్ తాళాలు తీయించాడు… సరైన చర్య…
కానీ ఈ దుందుడుకు నిర్ణయం తీసుకున్న అధికారులు ఎవరు..? అదుగో అది ఆలోచిస్తే, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అలాంటి అధికారులపై ఏమైనా చర్యలు తీసుకోగలిగితేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, పార్టీకి మేలు… ఎందుకంటే..? పార్టీల సమరం వేరు… నడుమ రైతుల్ని సతాయిస్తే అంతిమంగా నష్టం సర్కారుకే… ఎక్కడ చాన్స్ దొరికినా సరే వదలని, చాన్స్ క్రియేట్ చేసుకుని మరీ బదనాం చేసే బీఆర్ఎస్‌కు చేజేతులా బలం టానిక్కులు తాగిస్తున్నట్టే..! అవునూ, సోకాల్డ్ పే-ద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఈ పాడిరైతుల ఆందోళన ఓ సమస్యగా కూడా కనిపించలేదా..?
Share this Article