Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చీకటి పడితే సీతారాం అట, రాతిరికొస్తే రాధేశ్యామ్ అట… వామ్మో సుమలత..!!

May 17, 2025 by M S R

.

Subramanyam Dogiparthi….. 1984 లోకి వచ్చాం . అక్షరక్రమంలో ఈ సంవత్సరంలో మొదటి సినిమా చిరంజీవి- క్రాంతికుమార్ల కాంబినేషన్లో వచ్చిన ఈ అగ్నిగుండం సినిమా . చట్టానికి కళ్ళు లేవు సినిమాలో ఎలా అయితే అక్కాతమ్ముళ్ళ అనుబంధం చూపబడిందో అంతకన్నా గొప్పగా సుజాత , చిరంజీవిల మధ్య అక్కాతమ్ముళ్ళ ప్రేమను , ఆప్యాయతను చూపారు క్రాంతికుమార్ .

సుజాత , చిరంజీవిలు అక్కాతమ్ముళ్ళుగా బాగా నటించారు . చిరంజీవి ఫుల్ ఫాంలోకి వచ్చేసారు 1983 నుండి . నటనలో పక్వత వచ్చేసింది . క్రాంతికుమార్ దర్శకత్వంలో ఈ సినిమాలో చిరంంజీవికి చాలా షేడ్స్ ఉంటాయి .

Ads

ప్రారంభంలో హాయిహాయిగా ఫ్రెండ్సుతో చెట్టాపట్టాలేసుకుని తిరిగే యువకుడిగా , అవినీతిని లంచగొండితనాన్ని ఎదిరించే అభ్యుదయ భావాలు కల ఎర్రబ్బాయిగా , జైలు నుండి తిరిగొచ్చి విలన్లను దండించే స్వధర్మ రక్షకుడిగా నటించారు .

డాన్సులు , ఫైట్స్ . రెండింటిలోనూ అతనికి అతనే సాటి . క్రాంతికుమార్ ఈ సినిమాలో రెండింటినీ చక్కగా ఉపయోగించుకున్నారు . సినిమాలో స్వధర్మ రక్షకుడిగా చాలా ఫైట్స్ చేస్తాడు . క్లైమాక్స్ ఫైటింగ్ ఏ జలపాతాల వద్ద షూట్ చేసారో కానీ అదిరిపోతుంది .

ఇంక డాన్సులు . సుమలత చేత కూడా చిరంజీవితో ధీటుగా క్రాంతికుమార్ డాన్సులు చేయించారు . డ్యూయెట్లు అన్నీ చాలా రొమాంటిగ్గా , కసికసిగా తీసారు . వాన పాట కూడా ఉందండోయ్ . వాన బొట్లన్నీ ఎక్కడ పడాలో అక్కడ రాఘవేంద్రరావు లాగా పడేయించారు క్రాంతికుమార్ . నృత్య దర్శకుడు సలీంను అభినందించవలసిందే .

ఇక్కడే మరోమాట… అందరూ ఆ తానులో ముక్కలే కానీ ఎక్స్‌పోజింగ్ విషయంలో సుమలత కాస్త వెనుక వరుసల్లోనే ఉండేది… విశ్వనాథ్ సినిమాల్లో ఆమె పాత్రలతో ఆమె పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండేది… అలాంటిది ఈ సినిమాలో వాన పాటతోపాటు ఎక్స్‌పోజింగ్ కుమ్మరించింది… కాదు, రించేలా చేశాడు దర్శకుడు… రాఘవేంద్రరావు ఆవహించినట్టుగా…

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో అన్ని పాటల చిత్రీకరణ చాలా బాగుంటుంది . పాటలన్నీ వేటూరి వారే వ్రాసారు . చెంపకు చారెడు కళ్ళమ్మా , చీకటి పడితే సీతారాం డ్యూయెట్లలో చీకటి పడితే సీతారాం పాట చాలా రొమాంటిగ్గా తీసారు .

చీకటి పడితే సీతారాం, రాత్రికి వస్తే రాధేశ్యామ్… అనే పల్లవి ఇప్పుడయితే వివాదం అయ్యేది . సీతారాం అనే మాటని అలాంటి రొమాంటిక్ డ్యూయెట్లో ఉపయోగిస్తారా ? అంటూ సనాతన ధర్మ పరిరక్షకులు నోటీసులు కూడా ఇస్తారు . మనకో పాత సామెత ఉంది . గిట్టకపోతే , ఇష్టం లేకపోతే , మనోళ్ళు కాకపోతే రామ అన్నా బూతు లాగా వినిపిస్తుంది అని . (అసలు ఆ పల్లవికి అర్థమేమిటో వేటూరికే తెలియాలి…)

మళ్ళీ సినిమాలోకి వద్దాం . చిరంజీవి , సిల్క్ స్మితల రుంబా రుంబా హో క్లబ్ సాంగ్ ఇద్దరూ విజృంభించి డాన్సించారు . చిరంజీవి , స్మిత వంటి డాన్సర్లయితే నృత్య దర్శకుడు కూడా బాగా సాన పెడతాడు . చిరంజీవి , స్మిత అభిమానులు పొరపాటున కూడా మిస్ కాకండి ఈ డాన్స్ వీడియోని .

రావు గోపాలరావు డైలాగులను సత్యానంద్ ప్రేక్షకులు మరచిపోనట్లుగా వ్రాసారు . తెలుగు పదాలకు ఇంగ్లీషు తగిలించి , రెండింటినీ మిక్సింగ్ చేసి విభిన్నంగా మాట్లాడుతుంటాడు రావు గోపాలరావు . ఇతర ప్రధాన పాత్రల్లో ఉదయకుమార్ , శరత్ బాబు , నూతన్ ప్రసాద్ , రాళ్ళపల్లి , సుత్తి జంట , ప్రభృతులు నటించారు .

కధ రొటీన్ పగ సాధింపు మీదే అయినా బిర్రయిన స్క్రీన్ ప్లే , దర్శకత్వం , చిరంజీవి పెర్ఫార్మెన్స్ , పాటలు ఆటలు , సుజాత నటన సినిమాను కమర్షియల్గా కూడా సక్సెస్ చేసాయి . సినిమా యూట్యూబులో ఉంది . చిరంజీవి అభిమానులు తప్పక మరోసారి చూడతగ్గ సినిమా . A movie full of sentiment , emotion , action and romance . A watchable entertainer #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…
  • అల్పపీడనాలు… అవి ప్రకృతి జారీ చేస్తున్న ప్రమాద హెచ్చరికలు…
  • జగన్ మానసిక వైకల్యం సరేగానీ… నార్సిసిస్ట్ కానివారెవ్వరు ఇప్పుడు..?!
  • ఇదుగో గ్రహాంతర జీవులు… వస్తున్నాయి, పోతున్నాయి, గమనిస్తున్నాయి…
  • సో వాట్..? ఈ కెప్టెన్ కూడా ఆటలో పదే పదే ప్రార్థిస్తూ కనిపించింది..!
  • ఎవల్యూషన్, ట్రాన్స్‌ఫార్మేషన్… ఓ psychological angle లో చూద్దాం…
  • లెజెండ్ సచిన్ టెండూల్కర్ క్రికెటరా..? యాక్టరా..? ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ..!!
  • క్రికెట్‌లోకి ఈ ఆల్‌రౌండర్ ఎంట్రీకి దారివేసింది ఓ పర్‌ఫెక్ట్ థ్రో..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions