.
దావోస్… అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అక్కడ జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ప్రతి ఏటా వెళ్తాడు… నిజానికి అక్కడి నుంచి కొత్తగా వచ్చే పెట్టుబడులు ఏమీ ఉండవు… ఏవో ఎంవోయూలు అంటారు, చివరకు ఎన్ని వర్కవుట్ అయ్యాయో ఎవరికీ పట్టదు…
దావోస్‌లో మనం ఏదో చెప్పగానే, వినేసి, తలాడించేసి, గుడ్డిగా ఎవరూ సంతకాలు చేయరు… రాష్ట్రానికి ఓ టీమ్ పంపించి, ప్రభుత్వ ముఖ్యులతో మంచీచెడూ నెగోషియేట్ చేసుకుని, ఉచితంగా ఏమేం ఇస్తారో హామీ తీసుకున్నాక, అనేక అనుమతుల అడ్డంకులు దాటితే తప్ప ఒక్కో ప్రాజెక్టు సాకారం కాదు…
Ads
ఐనా సరే, రేవంత్ రెడ్డి కూడా ఎందుకు వెళ్తున్నాడు..? తెలియదు..! అప్పట్లో పరకాల ప్రభాకర్ చంద్రబాబు దగ్గర మీడియా ప్రముఖుడిగా ఉన్నప్పుడు భలే ప్రమోషన్ వార్తలు వచ్చేవి… కొత్తిమీర అన్నం, పాలకూర పప్పు, బెండకాయ వేపుడు పులుసు ఎట్సెట్రా ఆంధ్రా డిషెస్‌తో ఏకంగా ఓ ఆంధ్రా పెవిలియన్ ఓపెన్ చేశారు, సమీప రెస్టారెంటులో…
మైనస్ 7 డిగ్రీల సెంటీగ్రేట్ చలిలో కూడా లోకేష్ కాలినడకన నాలుగు కిలోమీటర్లు నడిచి ఏదో సదస్సుకు వెళ్లాడంటూ ఫోటో వార్తలు… ప్రమోషన్… అంతకుముందు చంద్రబాబు మీద ఇలాగే వార్తలు వచ్చేవి… అందరూ గజగజ వణుకుతూ నాలుగు అంచెల డ్రెస్సులు వేసుకుంటే అరవై దాటిన చంద్రబాబు జస్ట్, రెండు అంచెల డ్రెస్సుతో ఫిట్‌గా నడుస్తూ సదస్సులకు వెళ్లేవాడు అని…
ఇప్పుడు కోటి సభ్యత్వాల దగ్గర నుంచి మొదలై కాబోయే సీఎం అనే కీర్తనల దాకా లోకేష్‌ను ప్రమోట్ చేస్తున్నారు… సరే, వాళ్ల పార్టీ వాళ్లిష్టం… నిన్నటి వార్త… తెలంగాణలో 15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి మేఘా ఇంజనీరింగ్‌తో రేవంత్ రెడ్డి ఒప్పందాలు అట…
మేఘాతో దావోస్ వెళ్లి మరీ ఎంవోయూలు అవసరమా..? ఇక్కడే ఏ నోవాటెల్‌లోనో, ఏ పార్క్ హయాత్‌లోనో కూర్చుని రాసుకుంటే సరిపోదా..? మేఘా కృష్ణారెడ్డికి తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కొత్తా..? తనకు తెలియని రాజకీయాలు, పరిస్థితులు ఉన్నాయా..? వివాదాలు కూడా ఉన్నవే కదా…
బీఆర్ఎస్ తనను అరెస్టు చేయాలని, బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తోంది కదా… తనతో అక్కడెక్కడో ఒప్పందాలు… ఇక ఏపీ చంద్రబాబు కూడా అంతే కదా… గ్రీన్‌కోతో దావోస్‌లో ఒప్పందాలు, తెలుగువాడే కదా… ఆల్రెడీ లక్షల కోట్ల గ్రీన్ పవర్ పెట్టుబడులు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రశంసల్లో ముంచెత్తాడు కదా (చలమలశెట్టి సునీల్‌ను)…
కేటీయార్ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి ఈడీ ఎదుట కూడా మొన్న హాజరై వెళ్లాడు కదా… ఇదుగో దావోస్ ఒప్పందాలు ఇలా ఉంటాయి… జస్ట్, ఇవి రెండు ఉదాహరణలు… మరి కోట్లు ఖర్చుపెట్టి టీమ్స్ ఎందుకు పోతాయి..? ఏమో… ఎవరికీ అంతుపట్టదు..!!
Share this Article