1980-81… ఓ శీతాకాలం సాయంత్రం… పార్లమెంటు సభ్యుల నడుమ ఓ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది… గుజరాత్, భరూచ్ నుంచి వచ్చిన యువ ఎంపీ అహ్మద్ పటేల్ బ్యాటింగులో ఇరగదీసేస్తున్నాడు… సెంచరీకి దగ్గరయ్యాడు… మరోవైపు మాధవరావు సింధియా… అహ్మద్ పటేల్ బ్యాటింగు చేస్తుంటే ఇక వేరే ప్లేయర్లకు ఆడటానికి ఏమీ ఉండదు… సింధియా సరదాగా నవ్వుతూ మొత్తం నువ్వే ఆడితే మరి మేమేం చేయాలి భయ్యా అన్నాడు… ఆ తరువాత బంతికే పటేల్ బౌల్డ్ అయ్యాడు… కావాలనే… సింధియాకు ‘ఇక ఆట నీదే భయ్యా’ అంటూ సైగ చేసి క్రీజు వదిలాడు…
అంతేమరి… రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే ఎదుగుతాడు… ప్రత్యేకించి కాంగ్రెస్ రాజకీయాల్లో… ఆమధ్య ఓ పాత్రికేయుడు తనకు ఆ క్రికెట్ మ్యాచ్ గుర్తుచేసి, ఎందుకలా కావాలనే ఔటయ్యారు, ఆ సెంచరీ పూర్తిచేసి, వదిలేస్తే బాగుండేదిగా అనడిగాడు… ‘అది అంతే… అసలు ఢిల్లీలో సింధియా మహారాజ్ ప్రభ ఎక్కడ..? అప్పట్లో నేను ఎక్కడ..? సెంచరీది ఏముంది..? సింధియా చెప్పడం, నేను కాదనడమా..? ఏదేమైనా ఆయన మాటను మన్నించడమే అప్పుడు నాకు ముఖ్యం’ అని బదులిచ్చాడు నవ్వుతూ…
Ads
అదే అహ్మద్ పటేల్… పక్కాగా నేల మీద నడిచే మనిషి… కృత్రిమ హైపులతో మబ్బుల్లో ప్రయాణం చేసే వ్యక్తి కాదు తను… ఎవరితో ఎలా మెలగాలో బాగా తెలుసు… ఎవరినీ నొప్పించడు, అందరినీ కలుపుకుపోతాడు… అంతిమంగా తనకు కావల్సిన రిజల్ట్ పట్టేస్తాడు… అందుకే మరి సోనియా కాంగ్రెస్‌కు రాజకీయ కార్యదర్శి అయ్యాడు, కోశాధికారి అయ్యాడు… క్రైసిస్ మేనేజర్‌గా తనే సెంటర్ పాయింట్ అయ్యాడు… మంచి వ్యూహకర్త… 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌కు తెర వెనుక అన్నీ తానే…
ఎఐసీసీ, సీడబ్ల్యూసీ, యూపీయే నిర్ణయాలు ఏమైనా ఉండనీ… ప్రభుత్వ నిర్ణయాలు ఏవైనా జరగనీ… అంతిమంగా అహ్మద్ పటేల్ ఓ మాట చెబితేనే సోనియాగాంధీ ఆమోదముద్ర పడేది… చివరకు ఆమె ఎవరిని కలవాలో, ఏం చెప్పాలో కూడా బ్రీఫ్ చేసేవాడు… రాజీవ్ గాంధీకి, తరువాత సోనియా గాంధీకి నమ్మినబంటు… ఇంత కీలకమైన బోల్టో అయినా సరే… ఎక్కడా తను కనిపించేవాడు కాదు… ఇరకడు, దొరకడు, కొరుకుడుపడడు… యూపీయే హయాంలో అనేక అవినీతి బాగోతాలు చోటుచేసుకున్నా సరే, ఆ మకిలి సోనియా కుటుంబం మీద పడకుండా చూసేవాడు…
కాంగ్రెస్ నాయకులు తనను హోమియా డాక్టర్ అనేవాళ్లు… ఢిల్లీలోని 23, మదర్ థెరిసా క్రెసెంట్ తన నివాసం… పెద్ద అట్టహాసాలేమీ ఉండవు… మొన్నమొన్నటివరకూ ఓ పాత మారుతి ఎస్టీమ్లోనే తిరిగేవాడు… కాకపోతే చీకటైందంటే చాలు… ఆ ఇంటికి వచ్చే కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, బడా లీడర్లతో బోలెడన్ని చర్చలు… రాత్రి పొద్దుపోయేదాకా సందడే… పగటిపూట అంతా సైలెన్స్… ఎవరు ఏ సమస్యను తీసుకుపోయినా సరే, నవ్వుతూ ఆ ఇంటి నుంచి బయటికి రావల్సిందే… అందరికీ హోమియా డాక్టర్లాగే స్వీట్ పిల్స్ ఇచ్చేవాడు… వెయిట్ చేయాలి, సమస్య సాల్వ్ అవుతుంది అనేవాడు…
ఆశావాదాన్ని వదిలేవాడు కాదు… ఓ జర్నలిస్టు కష్టమ్మీద తన అపాయింట్మెంట్ సంపాదించి, ఈ అవినీతి యవ్వారాలు ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తాయా అనడిగాడు సగం ఆఫ్‌దిరికార్డు, సగం ఆన్‌రికార్డు… అంతకుముందే ఎవరో ఇండస్ట్రియలిస్టు తనకు ఇచ్చి వెళ్లిన తిరుపతి ప్రసాదాన్ని ఆ జర్నలిస్టుకు ఇచ్చి, వీడ్కోలు చెబుతూ… ‘‘ప్రభుత్వానికి ఏమీ కాదు, పార్టీకి ఏమీకాదు… అన్నిచోట్లా ప్రార్థనలు జరుగుతూనే ఉన్నయ్, ఇదుగో ప్రసాదాలు అందుతూనే ఉన్నయ్’’ అన్నాడు చిరు మందహాసంతో…
నెవ్వర్… టెన్షన్ పడటం తన స్టయిల్ కానేకాదు… తెర వెనుక జరిగే అనేకానేక పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలు సజావుగా సాగేలా చూడటం, అప్పుడప్పుడూ తలెత్తే సంక్షోభాల్ని టాకిల్ చేయడం తన పని… తను ఏది చెబితే అదే దాదాపు ఫైనల్… కానీ రాహుల్ గాంధీ హయాం వచ్చాక… అహ్మద్ పటేల్ తిరోగమనం ఆరంభమైంది… సీనియర్లందరినీ ఇంటికి పంపించడమే కాంగ్రెస్ రోగానికి చికిత్స అనే మూఢనమ్మకంలో పడ్డ రాహుల్ ఈయన్ని కూడా ఇగ్నోర్ చేయడం స్టార్టయింది…
తను పక్కకు తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని భావించిన పటేల్ ఎక్కువగా గుజరాత్‌లోని తన సొంత నియోజకవర్గానికే పరిమితం కాసాగాడు… పార్లమెంటు సమావేశాలప్పుడు మాత్రమే ఢిల్లీలో కనిపించేవాడు… కానీ రోజురోజుకూ కాంగ్రెస్ భవనం శిథిలం అవుతూ ఉండటంతో సోనియా తిరిగి అహ్మద్ పటేల్‌ను యాక్టివేట్ చేసింది… కోశాధికారిని చేసింది… కాంగ్రెస్ పడవ పూర్తిగా మునిగిపోకుండా కాపాడాలని ఆమె కోరిన సీనియర్లలో పటేల్ కూడా ఉన్నాడు…
కానీ పరిస్థితులు వేగంగా మారిపోయినయ్… సోనియా అనారోగ్యం, రాహుల్ కోటరీ పెత్తనం, సీనియర్లపై అకారణ ద్వేషం పార్టీని ఇంకా ఇంకా పతనం చేయసాగాయి… ఆ అసంతృప్తిని కూడా తను ఎప్పుడూ ఇతర సీనియర్లలాగా మాటమాత్రంగానైనా బయటపెట్టలేదు… ఎందుకంటే… తను కొన్ని దశాబ్దాలుగా ఆ కుటుంబానికి పరమవిధేయుడు… ఎటొచ్చీ ఆ విధేయత పనికిరాకుండా పోయింది తన చివరిరోజుల్లో…!!
(దిప్రింట్లో డాక్టర్ కె.సింగ్ రాసిన ఓ వ్యాసానికి తెలుగు స్వేచ్చానువాదం ఇది…)
Share this Article