.
చిన్న చిన్న ఉదాహరణతో చెప్పుకోవాలంటే…. గతంలో చాలా ఫోన్ నంబర్లు గుర్తుండేవి… బ్యాంకు అకవుంట్ల నంబర్లు కూడా… కిరాణా షాపుకి వెళ్తే తీసుకున్న పలు సరుకులకు చకచకా బిల్లును మనస్సులోనే గుణించుకునేవాళ్లం…
మార్కెట్‌కు వెళ్తే ఏమేం సరుకులు తెచ్చుకోవాలో గుర్తుండేది… స్మార్ట్ ఫోన్ వచ్చాక నంబర్లు గుర్తుండటం లేదు… కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు కూడా ఫోన్‌లో చూసుకోవాల్సిందే… ఐనా అసలు నంబర్లు చూసే పనేమిటి..? బోలెడు పాస్‌వర్డులు ఇప్పుడు… యాప్స్‌కు, అకౌంట్లకు… గుర్తుండి చావవు, అన్నీ ఓ ఫైల్‌లో రాసి, డ్రైవ్‌లో పెట్టుకుని, దానికీ ఓ పాస్‌వర్డ్ పెట్టుకుంటే, ఇప్పుడదీ సరిగ్గా గుర్తుండటం లేదు… అదో చావు…
Ads
ఏదీ ఎవరినీ అడగడం లేదు ఇప్పుడు… గూగుల్ సెర్చ్… యూట్యూబ్ పాఠాలు… ఇలా చెబుతూ పోతే బోలెడు… టెక్నాలజీ మీద ఎంతగా ఆధారపడుతున్నామో చెప్పడానికే కాదు… క్రమేపీ నిత్య జీవనాంశాల్లో టెక్నాలజీ అధికవాడకంతో మన మెదళ్ల అసలు పనితీరు ఎలా కుంచించుకుపోతున్నదో చెప్పుకోవడం…
ఇక ఇప్పుడు ఎఐ… ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్… అన్ని పనులూ అదే చేసి పెడుతోంది… మొన్నామధ్య చాట్ జీపీటీ సలహాలు వాడి ఒకామె లక్షల అప్పులు తీర్చిందట… మన పనుల్ని సులభతరం చేస్తోంది… ఓ సౌకర్యం… మరి నాణేనికి మరోకోణం… మన మెదడు క్రమేపీ మొద్దుబారుతుండటం… నిజం…
ఎంఐటీ తాజాగా చాట్ జీపీటీ వాడకంతో మెదడుపై ప్రభావం గురించి చిన్న అధ్యయనం చేసింది… బ్రెయిన్ స్కాన్ అధ్యయనం… తేలింది ఏమిటయ్యా అంటే… చాట్ జీపీటీ (ఎఐ ప్లాట్‌ఫామ్ ఏదయినా సరే) మన మేధో సామర్థ్యాన్ని క్షీణింపచేస్తోంది అని…
అధ్యయన వివరాలు…
- MIT బృందం చాట్ జీపీటీ వాడకందార్లపై 4 నెలలపాటు EEG బ్రెయిన్ స్కాన్‌లు నిర్వహించింది.
- వారు ఆల్ఫా తరంగాలు (సృజనాత్మకత), బీటా తరంగాలు (క్రియాత్మక ఆలోచన), న్యూరల్ కనెక్టివిటీ నమూనాలను ట్రాక్ చేశారు…
- ఫలితం: AI అతిగా వాడటం వల్ల మెదడు దెబ్బతింటోంది…
వివిధ అంశాలను ఎఐ వాడుతూ, ఎఐ వాడకుండా వేర్వేరుగా రాయమని అడిగారు… 83.3% ChatGPT వినియోగదారులు తాము కొద్ది నిమిషాల క్రితం వ్రాసిన వ్యాసాల నుండి ఒక్క వాక్యం కూడా మళ్లీ గుర్తు తెచ్చుకోలేకపోయారు. AI ఆలోచనలను స్వాధీనం చేసుకున్నందున, మన మెదడు వాటిని మరచిపోతోంది…
బ్రెయిన్ స్కాన్ ఫలితాలు: న్యూరల్ కనెక్షన్లు 79 నుండి 42కి పడిపోయాయి— అంటే 47% తగ్గుదల. అంటే మన కంప్యూటర్ బుర్ర సగం ప్రాసెసింగ్ శక్తిని కోల్పోయినట్లే…
ఉపాధ్యాయుల అభిప్రాయం: పలువురు ఉపాధ్యాయులతో వాళ్లు రాసిన అంశాల్ని పరిశీలింపచేశారు… AI ఉపయోగించి రాసిన వ్యాసాలు “ఆత్మలేనివి”, “ఉత్త డొల్ల”, “క్రియేటివిటీ రాహిత్యం’’ అని తేల్చేశారు వాళ్లు…
భయంకరమైన వాస్తవం: ChatGPT వినియోగదారులను AI లేకుండా రాయాలని అడిగితే, వారు AI ఎప్పుడూ వాడని వారి కంటే దారుణంగా పనిచేశారు… ఇది కేవలం ఆధారపడటం కాదు— ఇది ఓరకం మానసిక క్షీణత (cognitive atrophy), ఉపయోగించని కండరంలా మెదడు పనితీరును మరచిపోతోంది…
.
ChatGPT వాడకం వల్ల పనులు 60% వేగంగా పూర్తవుతాయి, కానీ నేర్చుకోవడానికి అవసరమైన “germane cognitive load” 32% తగ్గుతుంది.
వెరసి ఆ అధ్యయనం వెలిబుచ్చిన ఆందోళన ఏమిటంటే… ఈ రోజు అమెరికాలో, 12- 25 సంవత్సరాల వయస్సు గల 65% విద్యార్థులు సొంతంగా రాయగల సామర్థ్యాన్ని కోల్పోయారు. 80% గృహాలు కిరాణా జాబితా తయారు చేయడం కూడా మరచిపోయాయి… మన ఆలోచనల్ని, మన బుర్రల్ని ఎఐ ప్లాట్‌ఫామ్స్ స్వాధీనం చేసుకుంటున్నాయి…
Share this Article