.
2005… ఆమె పేరు రంజని… కేరళలోని ఓ ఊరు… దివిల్ అని ఆ ఊరివాడే… యవ్వనం, ఆకర్షణ… వాడేవో మాయమాటలు చెప్పాడు… లొంగదీసుకున్నాడు… అనుభవించాడు…
ఆమెకు గర్భం… ఇది తెలియగానే దివిల్ ఆ ఊరు వదిలేశాడు… పఠాన్‌కోట్ ఆర్మీ ఏరియాలో తేలాడు… ఆమె గర్భానికీ నాకూ ఏ సంబంధమూ లేదని బుకాయించాడు గ్రామస్థులు వెళ్లి అడిగితే… ఆమెకు ఏం తోచాలో తెలియడం లేదు… ఈలోపు రాజేష్ అనే మరో వ్యక్తి అనిల్ కుమార్ పేరుతో పరిచయం అయ్యాడు…
Ads
నీకు అండగా నేనుంటాను, నీ తోడుంటాను అన్నాడు… సేమ్, అవే మాయమాటలు… 2006… ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది రంజని… ఆమె తల్లి శాంతమ్మ దివిల్‌ను వదిలిపెట్టదలచుకోలేదు… ఊరుకోలేదు… మహిళ కమిషన్‌ను ఆశ్రయించింది…
కమిషన్ డీఎన్ఏ టెస్టులకు ఆదేశించింది… దివిల్ తండ్రా కాదా అని తేల్చాలని..! రంజనికి గానీ, తల్లి శాంతమ్మకు గానీ తెలియని విషయం ఏమిటంటే..? ఆ దివిల్, కొత్తగా పరిచయమైన రాజేష్ ఇద్దరూ ఆర్మీలో కలిసి పనిచేసేవారని… స్నేహితులేనని…
ఎప్పుడైతే డీఎన్ఏ టెస్టుల దాకా వచ్చిందో ఇక ఆమెను లోకంలో లేకుండా చేయడమే ఈ సమస్యకు పరిష్కారం అనుకున్నారు ఆ ఇద్దరూ జంట మోసగాళ్లు… ఓరోజు శాంతమ్మ పంచాయతీ ఆఫీసుకు వెళ్లేలా ఏదో ఇష్యూ క్రియేట్ చేశారు…
ఆమె అటు వెళ్లగానే ఇంట్లోకి వెళ్లి రంజనిని, ఆమెతోపాటు 17 రోజుల వయస్సున్న ఆ కవల పిల్లల్ని మెడలు కోసి హతమార్చారు… ఆ ఊరి నుంచి పరార్… శాంతమ్మ పోలీసు కేసు పెట్టింది… వాళ్లే చంపారని ఆరోపించింది… ఆమె ఇంటి దగ్గర కనిపించిన ఓ పాత మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను బట్టి దర్యాప్తు చేస్తే అది పఠాన్‌కోట్ మిలిటరీ ఏరియాకు దారి తీసింది… కానీ ఆ ఇద్దరూ అక్కడ ఉంటే కదా…
కేసు అక్కడే ఆగిపోయింది… ఫైల్ అటకెక్కింది… ఏళ్లు… అలా దాదాపు 19, 20 ఏళ్లు… శాంతమ్మ ఏడ్చింది, మొత్తుకుంది… పలుసార్లు పోలీసుల దగ్గరకు తిరిగింది… కాలం గడిచిపోయింది… సీన్ కట్ చేస్తే…
ఇలాంటి ఏజ్ ఓల్డ్, కోల్డ్ స్టోరేజీ కేసుల ఫైళ్లు దులుపుతున్నారు… డిస్పోజ్ చేస్తున్నారు కేరళ పోలీసులు కొంతకాలంగా… ఈ కేసుకు సంబంధించిన నిందితుల ఆచూకీ గురించిన ఏ క్లూ దొరకడం లేదు… కానీ వాళ్లకు ఆ ఇద్దరూ పాల్గొన్న ఓ పెళ్లి ఫోటో దొరికింది…
ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయం తీసుకున్నారు… ఆ ఫోటోలో వ్యక్తుల రూపాల్ని బట్టి 19 ఏళ్ల తరువాత ఆ వ్యక్తులు ఎలా కనిపిస్తారో రఫ్ అంచనాతో కొత్త రూపాల్ని క్రియేట్ చేశారు… పలు ప్రాంతాల పోలీసులకు పంపించారు… ఆచూకీ కనిపెట్టేందుకు తమదైన మార్గాల్ని ఆశ్రయించారు… సోషల్ మీడియాను కూడా జల్లెడ పట్టారు…
ఆ రూపాలతో సరిపోలే వ్యక్తుల ఫోటోల కోసం… అది ఫలించింది… అనుకోకుండా ఆ రూపురేఖల్లో ఉన్న ఇద్దరు పుదుచ్చేరిలో కనిపించారు… పట్టుకొచ్చారు… ఎఐ క్రియేట్ చేసిన కొత్తరూపాలతో 90 శాతం సరిపోలారు ఇద్దరూ… ‘గట్టిగా’ అడిగితే నిజం బయటికొచ్చింది… అరెస్టు చేశారు… ఇన్నేళ్లూ ఆ ఇద్దరూ విష్ణు, ప్రవీణ్ పేర్లతో ఇంటీరియర్ డిజైనర్లుగా బతుకుతున్నారు..!
ఈ కేసులో ఆసక్తికరం ఏమిటంటే..? 1) కోల్డ్ స్టోరేజీ కేసుల్ని పునఃదర్యాప్తు చేస్తుండటం… 2) నేర దర్యాప్తులో కొత్త టెక్నాలజీని, కొత్త మార్గాల్ని ఆశ్రయించడం… 3) ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తోపాటు సోషల్ మీడియా డేటాను మిక్స్ చేసి చూడటం… 4) 20 ఏళ్ల అనంతరం నిందితులు పట్టుబడటం… 5) పోలీసులు కమిటెడ్‌గా ప్రయత్నించడం..!
( ఇది కథ కాదు… వార్త… హిందుస్థాన్ టైమ్స్‌లో నిన్న కనిపించిన వార్తకు ఇది ముచ్చటీకరణ..)
Share this Article