డజన్… పన్నెండు మంది ముఖ్య నాయకులు టీఆర్ఎస్ కోవర్టులుగా పనిచేస్తున్నారనీ, ఈమేరకు ఎఐసీసీకి ఓ రిపోర్టు పంపించబడిందనే ప్రచారం కాస్త ఆసక్తికరంగా ఉంది… తనకు ప్రధాన ప్రత్యర్థిగా భావించిన కాంగ్రెస్ పార్టీని కేసీయార్ ఏడేళ్లుగా తొక్కీ తొక్కీ నలిపేస్తున్నాడు… అది అందరికీ తెలిసిందే… ఇన్నేళ్లుగా ఎఐసీసీకి సోయిలేదు, టీపీసీసీ వ్యవహారాల మీద కాన్సంట్రేషన్ లేదు… పార్టీ ముఖ్యనేతలే కేసీయార్ చెప్పినట్టు నడుస్తున్నారనీ ప్రచారాన్ని పట్టించుకున్నదీ లేదు… అన్నీ వరుస ఓటములు, ఉద్యమాల్లేవ్, ప్రతిపక్ష పాత్ర లేదు… సరైన అంశాల్లో జనంలోకి పోయింది లేదు… మరీ ఉత్తమ కుమార్ రెడ్డి నాయకత్వం ఉత్తర కుమార చందమే అనే ఎన్ని విమర్శలు వచ్చినా ఢిల్లీకి కదలిక లేదు, చక్కదిద్దుకున్నదీ లేదు… ఈరోజుకూ గ్రామస్థాయిలో మంచి కేడర్ బలాన్ని కలిగి ఉన్న కాంగ్రెస్ ఏడేళ్ల కాలాన్ని వృథా చేసింది… తీరా ఇప్పుడు ఎలా కళ్లు తెరిచిందో, ఎందుకు నిర్ణయం తీసుకున్నదో… రేవంతుడికి పగ్గాలు ఇచ్చింది… అది హైకమాండ్ నిర్ణయం…
అంతర్గత ప్రజాస్వామ్యం మరీ పరిమితులు దాటి వెర్రితలలు వేసే పార్టీ కదా… రేవంత్ అనగానే మొదలైంది… ప్రత్యర్థి పార్టీలకన్నా సొంత పార్టీలోనే అంతర్గతంగా మొరాయింపులు, సతాయింపులు… పనికిరాని ఈగో సమస్యలు… ‘‘నేను’’ అనే భావనే తప్ప ‘‘పార్టీ’’ అనే దృష్టే లేదు చాలామందికి… ప్రత్యేకించి సీనియర్లకు…!! రేవంత్ కాళ్లల్లో కట్టెలు పెట్టసాగారు… రేవంత్ నచ్చలేదు సరే, హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరించాలి కదా… సరే, అదీ నచ్చలేదు అనుకుందాం, పార్టీని వీడి ప్రగతిభవన్‌లో పాదాభివందనాలు చేసి, రైట్ రాయల్‌గా పార్టీని విడిచిపెట్టొచ్చు కదా… అలాగైనా కాంగ్రెస్ ప్రక్షాళన జరిగి, అధికార పార్టీని నిజాయితీగా ఎదుర్కొనే ప్రతిపక్షం ఒకటి నిర్మితమవుతుంది… అదీ లేదు…
ఇంతకీ రాహుల్ నిర్ణయాన్ని ధిక్కరించి, రేవంతుడికి ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న ఆ డజన్ ముఖ్యులెవరు..? ఉత్తమ్… ఇంకా ఏం ఆశిస్తున్నాడు..? ఏడేళ్లలో పార్టీ భ్రష్టుపట్టిపోయింది చాల్లేదా..? కోమటిరెడ్డి బ్రదర్స్… మీకు పీసీసీ దక్కకపోతే ఇక పార్టీ శంకరగిరి మాన్యాలు పట్టిపోవాలా..? జానారెడ్డి… సన్యాసం స్వీకరించే వయస్సులో ఇంకేం ఆశిస్తున్నారు సార్ తమరు..? జగ్గారెడ్డి… నోటికి అడ్డూఅదుపూ లేదా సారూ..? గజ్వెల్ సభ మీద నీ పెత్తనం ఏమిటి..? నువ్వు చెప్పినట్టే నడిస్తే ఇక పీసీసీ అధ్యక్ష పదవి దేనికి..? చివరకు రేవంత్ గ్రూపుగా జనం భ్రమపడే నేతలతోపాటు మొత్తం డజన్ మంది తెలంగాణ కాంగ్రెస్‌కు, రేవంత్‌కు వ్యతిరేకంగా వ్యవహారాలు నడిపిస్తున్నారనేది ప్రచారం… సహజంగానే వీళ్లందరికీ కేసీయార్ తోడ్పాటు అనేది మరో ప్రచారం… నిజమేనా..? ఏమో… తెలంగాణ పార్టీ ఇన్‌చార్జి మాణిక్యం ఠాకూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మాత్రమే సరిగ్గా చెప్పగలరు… ఇక్కడ పొన్నాల వంటి నేతల్ని అభినందించాలి… ఒక్కసారి హైకమాండ్ నిర్ణయం తీసుకోగానే… ఇష్టమున్నా లేకున్నా రేవంత్ నాయకత్వాన్ని అంగీకరించడం… అది ఇతర సీనియర్లను ఎందుకు చేతకాదు… పాత రెడ్లకు చేతకాలేదు కాబట్టే కదా బయటి నుంచి మరో రెడ్డి వచ్చాడు…!
Ads
కానీ గతం వేరు, గాంధీభవన్‌ను తగులబెట్టినా సరే, క్షమించేసి మళ్లీ పార్టీలో చేర్చుకున్న రోజులున్నయ్… కానీ ఇప్పుడలా కాదు… ఒక్కసారిగా జగ్గారెడ్డిపై భగ్గుమంది… దాంతో జగ్గారెడ్డి తొవ్వకు వచ్చాడు… సారీ చెప్పాడు… మరి ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి ఎట్సెట్రా నేతల మాటేమిటి..? రేవంత్ కాళ్లల్లో కట్టెలు పెట్టే బ్యాచ్ మీద చర్యలేమిటి..? ఒక్కసారి అందరినీ వదిలించుకుని చూడు రాహుల్… కొత్తతరం వస్తుంది, కొత్త రక్తం ఉరకలెత్తుతుంది.., అదే కేసీయార్ మీద పోరాడగలిగేది… ఈ సీనియర్లతో ఒరిగేది లేదు, ఇలా ఎన్నేళ్లయినా పార్టీకి అధికారం వచ్చేదీ లేదు… లేదు, లేదు, కాంగ్రెస్ అంటే ఇలాగే ఉంటుంది, ఇలాగే అందరినీ ఉపేక్షిస్తాం అంటే… కేసీయార్ నెత్తిన పాలుపోసినట్టే… అసలే టీఆర్ఎస్ ఓడ బీజేపీ వైపు కదులుతోందని టాక్… జనంలో కేసీయార్ ప్రభుత్వం మీద, టీఆర్ఎస్ పాలన మీద వ్యతిరేకత బలంగా ఉంది… ఈ స్థితిని వాడుకునే దశలో కాంగ్రెస్ కనిపించడం లేదు… కనీసం ఓ బలమైన ప్రతిపక్ష పాత్ర కోసమైనా ఆలోచన లేదు… రాహుల్, ఓ పెద్ద కొరడా పట్టుకుని హైదరాబాద్ రావచ్చుగా… పదీపన్నెండు మందిని మళ్లీ పార్టీలోకి వచ్చే చాన్స్ లేకుండా తరిమెయ్… పార్టీ ఎందుకు బాగుపడదో చూద్దాం… ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా కొత్త నేతలు పుట్టుకొస్తారు… కాకపోతే వాళ్లు కేసీయార్‌కు అమ్ముడుబోకుండా ఎలా కట్టడి అనేదే అసలు ప్రశ్న..!!
Share this Article