ఒకాయన అయితే మరీ రెచ్చిపోయి ట్యూబ్ వీడియో పెట్టేశాడు… చిటికెడు వాముతో వంద రోగాలు మటుమాయం అట… (వామును ఓమ అని కూడా పిలుస్తారు)… ఇంకొకాయన అయితే రోజూ వాము నీళ్లను వారంపాటు తాగండి, అసలు మిమ్మల్ని మీరే పోల్చుకోలేరు గ్యారంటీ అన్నాడు… మరొకాయన వామును మించిన ఔషధం ఆయుర్వేదంలో మరొకటి లేదని తేల్చిపడేశాడు… కాసింత వాము మూటగట్టి దిండు కింద పెట్టుకుని పడుకుంటే సర్వ అరిష్టాలూ పోతాయని ఒకామె బల్లగుద్ది చెబుతోంది… నిజమా..? కాస్త క్లారిటీ అవసరం… ఎందుకంటే… ఈ యూట్యూబ్ వీడియోల ప్రభావం బాగా పడుతోంది కాబట్టి…
నిజం… ఇంతకుమించిన ఔషధం మరొకటి లేదనేది అబద్ధం కానీ… వాము ప్రాశస్త్యం తక్కువేమీ కాదు… అయితే వాడాల్సిన పద్ధతిలో, మోతాదులో ఔషధంగా వాడితేనే ఆ ఆరోగ్య ప్రయోజనాలు… జీర్ణశక్తికి, గ్యాస్ తగ్గడానికి, చనుబాలు పెరగడానికి, మలబద్ధకానికి, రుతుచక్ర అస్తవ్యస్తత నివారణకు, బరువు తగ్గడానికి, జలుబు-దగ్గు-ఉబ్బసం నివారణకు… ఇది బ్లడ్ థిన్నర్ కూడా… అయితే జాగ్రత్త… వాముకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి… ఎక్కువ వాడితే మంచిది కాదు…
దీనికి గర్భస్రావ లక్షణాలున్నయ్… అందుకే గర్భిణులు వాము జోలికి పోవద్దంటారు… వేడి శరీరం కలిగినవారికీ వాము మంచిది కాదట… రోజుకు రెండు మూడు గ్రాముల మేరకు వోకే… కడుపులో అజీర్తి వేధిస్తుంటే, గ్యాస్ తన్నుకొస్తుంటే మాత్రం కొందరు వాము నీళ్లు వాడతారు… మరీ కొందరైతే సోంపులాగా వాము కసాపిసా నమిలేస్తారు… అది పెద్ద రిలీఫ్…
Ads
అసలు వాము ప్రాధాన్యం ఆయుర్వేదంకన్నా మన కిచెన్‌లో ఎక్కువ… ఇది అద్భుతమైన మసాలా దినుసు… ఎంతోకాలంగా ఇండియన్ కిచెన్‌లో దీనికి కూడా స్థానం ఉంది… మరీ ప్రత్యేకించి స్నాక్స్‌లో వీటి వాడకం అధికం… కారణం, దీని ఘాటుదనం… వాము తగిలితే ఆ వంట టేస్టే మారుతుంది… మిర్చి బజ్జీలు చేసుకున్నప్పుడు అందులో కూరే మసాలాలో వాము తప్పనిసరి… వాము లేకపోతే అవి అసలు మిర్చి బజ్జీలే కాదు… మసాలా లేకపోతే వేయించిన వాము పొడిని కాస్త చల్లేసి, శెనిగెపిండిలో ముంచి అలా నూనెలో వేసేయండి…
ఇవేకాదు, మురుకులు, పకోడీ, బజ్జీలు, రిబ్బన్ పకోడీ, కారప్పూస, శెగోడీలు ఎట్సెట్రా… వాము ఉంటేనే ఓ మజా… గసగసాలు ఓ మత్తు… వాము ఓ ఘాటు… అదీ తేడా… ఈమధ్య వాము అన్నం, వాము జావ, వాము టీ, వాము వాటర్ వంటివి పాపులర్ చేస్తున్నారు… మరీ వాటి లోతుల్లోకి వెళ్లి ఇక్కడ చర్చ పెట్టడం లేదు కానీ… వాము అన్నం గురించి ఓసారి చెప్పుకుందాం… ఎందుకంటే ఈజీ మెథడ్… డైజెషన్‌కు యూజ్‌ఫుల్…
అయితే ఒరిజినల్ వాము ఘాటుతోపాటు దాని ఆరోగ్య ప్రయోజనం దక్కాలంటే… ఏది పడితే అవి అందులో వేసేయకండి… చాలా సింపుల్‌గా చేసుకొండి… కాస్త నూనె, అందులో నిలువునా చీల్చిన పచ్చి మిరప, సరిపడా ఉప్పు, కలర్ కోసం కాస్త పసుపు… కరివేపలు, కొత్తిమీరలు, మసాలా పొడులు, ఇతర దినుసులు, ఉల్లిపాయ సహా ఏవీ వద్దు… మరీ ఉప్పూకారం కలిపి అన్నంలా ఉంటుంది అనుకుంటే కాసిన్ని పల్లీలు, కొద్దిగా శెనిగె పప్పు తగిలించండి… వాము ఘాటు ఎటూ పోదు, కల్తీ కాదు… అందులో అన్నం వేసి మంచిగా కలపండి… ప్లేటులోకి తీసుకొండి… పిల్లలకు కూడా మంచిదే… అజీర్తికి భలే ఆహారమందు..!!
Share this Article