.
Subramanyam Dogiparthi …… ఇది శ్రీశ్రీ సినిమా . అందరూ బాలచందర్ సినిమా అనవచ్చు . నావరకు ఈ సినిమా శ్రీశ్రీ సినిమాగానే ముద్ర పడిపోయింది . 1970s , 1980s కుర్రాళ్ళు మహాప్రస్థానాన్ని కంఠస్థం చేసిన రోజులు .
రాష్ట్ర స్థాయి డిబేటింగ్ పోటీలను ఎన్నో నిర్వహించాను . మహాప్రస్థానం కొటేషన్లతో వేదికలు ఆవేశంతో ఊగిపోయేవి . గత పాతికేళ్ళలో ఏదా ఆవేశం ?! సమాజం గురించి ఆలోచన ఏది ?! ఎవడి పొట్ట గోల వాడిదే . లేచామా తిన్నామా పడుకున్నామా !! ఇదే యావ !!!
Ads
1981 సంక్రాంతి సీజనుకు వచ్చిన ఈ ఆకలిరాజ్యం సినిమా ఒక ఊపు ఊపింది . మరో చరిత్రకు ఓ చరిత్ర సృష్టించిన కుర్రాళ్ళు ఈ ఆకలిరాజ్యానికి కూడా ఓ చరిత్ర సృష్టించారు . ఆనాటి నిరుద్యోగ యువత కష్టాలు , ఏదో సాధిద్దామనే తపనతో ఢిల్లీ , హైదరాబాద్ , మద్రాసులు తరలి వెళ్ళటం , చిన్నాచితకా పనులతో ఆకలితో యుధ్ధం చేయటం ఈ సినిమా కధాంశం .
బాలచందర్ని మెచ్చుకోవలసింది ఒక విషయం ఉందీ సినిమాలో . Dignity of labour గురించి కుర్రాళ్ళకు పరిచయం చేసారు . అమెరికాలో మనోళ్ళు అమలు చేసే ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని ఇండియాలో చేయరు . ఆ భావనను హీరో ద్వారా అద్భుతంగా చెప్పారు బాలచందర్ .
నటనపరంగా ప్రేక్షకులకు గుర్తుండిపోయేది ఆవేశం , ఆత్మాభిమానం కల పాత్రలో కమల్ హాసన్ . ఆ తర్వాత తండ్రి పాత్రలో రమణమూర్తి . చాలా బాగా నటించారు . శ్రీదేవిది గ్లామర్ పాత్ర కాదు . అయిననూ అందంగానే ఉంటుంది .
The beauty of a woman lies in the eyes of beholder . కావాలంటే రాం గోపాల్ వర్మని అడగండి . తెలుగులో మొదటిసారిగా నటించిన ప్రతాప్ పోతన్ బ్రహ్మాండంగా నటించారు . కచ్చబోతు ప్రేమికుడిగా అసహన పాత్రను బాగా పోషించారు .
ఈ సినిమా వీర సక్సెస్సుకు కారణం యం యస్ విశ్వనాథన్ మ్యూజిక్ మేజిక్ . ఆ తర్వాత ఆత్రేయ కలం , బాలసుబ్రమణ్యం యస్ జానకిల కంఠం . ఢిల్లీని రంగస్థలంగా ఎన్నుకోవడం బాలచందర్ మేధకు తార్కాణం . సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధీ వీధీ నాదే బ్రదరూ పాట సూపర్ హిట్ పాట . నిరుద్యోగుల స్టాక్ సాంగ్ . ఆకలి పాట ఆరోజుల్లో .
ఆత్రేయ వ్రాసిందే . కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే పాట మరో హిట్ సాంగ్ . గుస్సా రంగయ్య కొంచెం తగ్గయ్య కోపం మనిషికి ఎగ్గయ్య అంటూ హీరోయిన్ శ్రీదేవి కమల్ హాసన్ లోని ఆవేశాన్ని తగ్గించి ఆనందం వైపు మళ్ళించే ప్రయత్నపు పాట చాలా బాగుంటుంది . శ్రీదేవి చాలా బాగా నటించింది ఈ పాటలో .
పి బి శ్రీనివాస్ వ్రాసిన తూహీ రాజా మేహూ రాణి పాటను యస్ జానకి చాలా శ్రావ్యంగా పాడింది . ఇంక శ్రీశ్రీ తూటాల్లాంటి పదాలతో పాటు కూటి కోసం , ఓ మహాత్మా ఓ మహర్షి ఏది చీకటి ఏది వెలుతురు పాటలు ప్రేక్షకులను కదిలిస్తాయి . గణేష్ పాత్రో డైలాగులు చాలా పదును బాణాల్లాగా గుచ్చుకుంటాయి . మొత్తం మీద ఈ సినిమా ఆరోజుల్లో ఓ బ్లాక్ బస్టర్ . ఎనిమిది సెంటర్లలో వంద రోజులు ఆడింది . కమర్షియల్ గా వీర సక్సెస్ అయింది .
మా గుంటూరులో శేష్ మహల్లో ఆడింది . ఇప్పుడా థియేటర్ లేదు . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . మరో చరిత్ర సినిమాను ఎలా అయితే ప్రేక్షకులు మరచిపోరో అలాగే ఈ ఆకలిరాజ్యాన్ని కూడా మరచిపోలేరు . చూడనివారు తప్పక చూడవలసిన సినిమా . చూసినా మరోసారి చూడతగ్గ సినిమాయే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Share this Article