అవును, ఎందుకు మారాలి..? ఛట్, రోమ్‌లో రోమన్‌లా ఉండాలనేది ఉత్త దండుగ మాట… మనం ఎక్కడున్నా మనలాగే ఉంటాం… అంగారక గ్రహం మీదకు వెళ్లినా, అక్కడ సరికొత్త నాగరికతల్ని నిర్మించుకున్నా సరే… మనం మనమే… మన మూలాల్ని, మూల సంస్కృతిని కాపాడుకోవాలి… అంతేకదా… అక్కడా థియేటర్లు ఉండాలి… అక్కడ మన హీరోల సినిమాల్ని రిలీజ్ చేయాల్సిందే… ఎంత రేట్లయినా సరే పోయాల్సిందే… తెర ముందు డాన్సులు వేయాల్సిందే… కార్ల ర్యాలీలు, జెండాలు, హంగామా ఉండాల్సిందే… థియేటర్ ముందు వందల కొబ్బరికాయలు పగలాల్సిందే… కాగితపు ముక్కల్ని తెరపైకి విసిరేయాల్సిందే… అవును మరి, మనం మనలాగే ఉంటాం తప్ప మారిపోతామా ఏం..? మారిపోవాలా ఏం..? అమెరికా వెళ్లినా, సెంటినలీస్ దీవుల్లో ఉండాల్సి వచ్చినా మనం ఇలాగే ఉంటాం…
ఇది అమెరికాలో ఓ థియేటర్ ఎదుట కొబ్బరికాయలు కొట్టిన సీన్… మరోచోట సౌండ్ బాక్సుల విషయంలో అక్కడి పౌర అధికారుల హెచ్చరికలు… దిగువన ఉన్న వీడియోలో తెర మీద బాలయ్య ఎగురుతూ ఉంటే, దాని ముందే అభిమానుల డాన్సులు… నిజానికి ఇప్పుడు అఖండ సీజన్ కాబట్టి దీన్నితాజా ఉదాహరణగా తీసుకుంటున్నాం గానీ… ఒక్క బాలయ్య అభిమానులు మాత్రమే కాదు, ప్రతి హీరోకూ ఫ్యాన్స్ సేమ్… అది అమలాపురం థియేటరైనా ఒకటే, అమెరికా థియేటరైనా ఒకటే… ఆమధ్య ఏదో సినిమా, థియేటర్ అద్దాలు పగులగొట్టి మరీ లోపలకు జొరబడిన తీరు చూశాం కదా, ఒక హీరో సినిమాకైతే బలి ఇచ్చి, అక్కడే అభిమానులందరూ రక్తతిలకాలు దిద్దుకున్నారు… ఏమిటిది అనడిగితే ఎలా..? పండుగ… పూనకాలు… సింపుల్ ఆన్సర్ ఇదే…
Ads
అసలు ఈ హంగామా, ఈ అట్టహాసాలు, ఈ బీభత్సాల నడుమ ఎవరైనా సినిమా చూడటానికి ఏముంటుంది..? ఓ కథో కాకరకాయో, ఓ మంచి సీనో, ఓ మంచి పాటో, ఓ మంచి ఎమోషనో చూసే వీలేది..? వినే వీలేది..? నిజంగా ఎంజాయ్ చేసే చాన్స్ ఏది..? అవే స్టెప్పులు, అవే ఫైట్లు… అసలు తెర మీద హీరో కనిపిస్తూ ఉండాలి, అంతే… ఇటువైపు, తూర్పు దేశాల్లో కొన్నిచోట్ల రజినీకాంత్ జాతరలు కూడా సేమ్… సరే, తమిళుల అతి అదోరకం… అసలు ఇన్ని మాటలేల..? మొన్న ఎవరో మిత్రుడు చెప్పినట్టు… ఈ ప్రపంచంలో కులం ఉన్నన్నిరోజులూ… తెలుగు హీరో ఉంటాడు… ఫ్యాన్ ఉంటాడు… అంతే… ఈ పూనకాలు కూడా ఉంటయ్… హీరోల కటౌట్లకు దండలు, అభిషేకాలు, కొబ్బరికాయల మొక్కులు గట్రా ఉంటయ్… ఉంటయ్…!! ఇక పుష్ప, ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలకు ఇంకెన్ని జాతరలో…!! ఇది ఇలా ఉంటుంది కాబట్టే.., హీరోలకు ఓటీటీలు, టీవీ ప్రసారాలు పట్టవ్… థియేటర్లోనే రిలీజ్ ఉండాలి, బెనిఫిట్ షోలు అదరాలి… ఊరమాస్ ఫైట్లు పడాలి, సాంగులు పడాలి… తాము నయా దేవుళ్లయిపోవాలి… అవునూ, ఓ చిక్కు ప్రశ్న… అసలు ప్రపంచంలో థియేటర్లలో సినిమాల ప్రదర్శన అనేది నిషేధిస్తే..?!
Share this Article