బాలయ్య సినిమాకు ఓ నిర్ణీత ఫార్ములా ఉంటుంది… అది అందరికీ నప్పదు… అది బాలయ్యకే ప్రత్యేకం… వేరే హీరోలకు ఆ ‘అతి’ అస్సలు సూట్ కాదు… చేయలేరు కూడా… అభిమానులకు కూడా బాలయ్య అలా కనిపిస్తేనే పండుగ… కథానాయకుడు, మహానాయకుడు, శాతకర్ణి ఎవరికి కావాలి..? బాలయ్య అంటే ఓ సింహ, ఓ లెజెండ్… అంతే… తెర మీద బాలయ్య అలాగే కనిపించాలి… కథాకాకరకాయ జాన్తా నై… హీరోయిన్ ఎవరైనా పర్లేదు, విలన్ ఎవరున్నా డోన్ట్ కేర్… హీరో కన్నెర్ర చేసి, ఉరిమితే ఇక వెండితెర నిండా నెత్తుటి ధారలే… కత్తిపడితే ఒక్కొక్కడూ ఖైమాయే… ఇరగదన్నుడే… పగుల చీరుడే… దంచీ దంచీ ఉతికీ ఉతికీ ఒక్కొక్కడినీ నిలువునా పాతరేయడమే…
కాకపోతే కాస్త వైవిధ్యం కావాలి… ఓ కొత్తదనం కావాలి… అదేసమయంలో తనదైన ఫార్ములాలోనే ఇమిడిపోవాలి… సహజంగానే బాలయ్య రౌద్రరస పోషణలో దిట్ట… ఆ రేంజ్ రౌద్రాన్ని మరో హీరో పలికించలేడు… అందుకే అఘోరా తెర మీదకొచ్చాడు… రౌద్రాన్ని మరో మెట్టు పైకి ఎక్కించారు… అసలే బాలయ్య, ఆపై అఖండ పాత్ర… ఇంకేం కావాలి..? కాదు, కాదు, అసలే బాలయ్య, ఆపై అఖండ, అందులోనూ బోయపాటి… ఇలా సూపర్ హీరో పాత్రలంటే బోయపాటికి అమితమైన ప్రేమ… లాజిక్కులు, తొక్కాతోలు అక్కర్లేదు… బాలయ్యకు సరైన శృతి… ఇంకేముంది..? తెర చిరిగిపోయింది…
Ads
ఒక్కటి చెప్పుకోవచ్చు… ఒకటి కాస్త ఉదాత్తంగా సాగే పెద్దమనిషి పాత్ర, దానికి పూర్తి కంట్రాస్టుగా అఘోరా టైపు పాత్ర… బాలయ్య పెద్దమనిషి పాత్ర అయినా సరే, ఓ రేంజ్ ఉండాలి కదా… అందుకే ఊళ్లో తలలో నాలుక, ఓ కలెక్టరమ్మే ఢామ్మని తన ప్రేమలో పడిపోతుంది… ఒకే పాటకు బాలింత కూడా అయిపోతుంది… ఐనా బీభత్సమైన యాక్షన్ సీన్లు నడుమ ఈ రొమాన్స్, ఈ లవ్వు ఎవరికి కావాలి..? అందుకే బోయపాటి ఆ ట్రాక్ లైట్ తీసుకున్నాడు… కామెడీలు, రిలాక్స్ సీన్స్ గట్రా ఏమీ నడవ్వు… బాలయ్య విశ్వరూపమే కనిపిస్తూ ఉండాలి… మరి ఈ ‘అతిరసం ‘ అభిమానులకు సరే, మిగతా ప్రేక్షకులకు ఎక్కుతుందా..? ఈ నరికింగ్, ఈ నెత్తురు పారింగ్, ఈ సుదీర్ఘంగా తన్నింగ్ నచ్చుతాయా..?
ఈసారి శ్రీకాంత్‌ను తీసుకొచ్చి విలనీ అప్పగించారు… అబ్బే, బాలయ్య ముందు ఏం నిలబడతాడు..? తేలిపోయాడు… కాస్తోకూస్తో ఏ ఉద్వేగాలూ కుదరకపోయినా జగపతిబాబే నయమేమో… తన లుక్కు వేరు… ఇంకో విలన్ నితిన్ మెహతా ఉన్నాడు, పర్లేదు… మరి బాలయ్య, బోయపాటి, అఖండ కాంబినేషన్ అంటే బీజీఎం ఎలా ఉండాలి… డీజేకు కొన్నిరెట్లు మోతమోగిపోవాలి కదా… థమన్ ఆ పనేచేశాడు… సినిమాటోగ్రఫీ వోకే… డైలాగ్స్ బాలయ్య రేంజుకు తగినట్టు కుదిరాయి… బాలయ్య మొహంలో వృద్ధాప్య ఛాయలు బాగా కనిపిస్తున్నయ్, మేకప్ డిపార్ట్‌మెంట్ బాగానే కష్టపడింది… కాస్త యాక్షన్ సీన్లను కుదిస్తే బాగుండేదేమో… ప్చ్, బోయపాటి ఈవిషయంలో రాజీపడడు… బాలయ్యేమో దర్శకత్వంలో వేలుపెట్టడు…
ప్రజ్ఞా జైస్వాల్ అందంగా ఉంది, ప్లజెంటుగా కనిపించింది తెర మీద… పూర్ణ కూడా… కానీ వారి పాత్రలే పరిమితం… అసలు బాలయ్య సినిమా అంటేనే మిగతా వాళ్లంతా పరిమితం… ఈ సినిమాలో ఉన్న ఏకైక ఇంట్రస్టింగ్ పాయింట్… శివుడి అంశతో పుట్టాడని భావించే కవల సోదరుడు అఖండ పాత్రే… ఆ ఆహార్యం, ఆ లుక్కు, ఆ రౌద్రమే ప్రేక్షకుడిని థియేటర్ దాకా నడిపించాలి… ఇక మిగతా కథ, మిగతా పాత్రలు, పాటలు, స్టెప్పులు అన్నీ బాలయ్య ఫార్ములా ప్రకారమే… కాకపోతే దర్శకుడు బోయపాటి కదా… ఆ డోస్ డబుల్ అయిపోయింది… ఏమో, ఇంకాస్త ఎక్కువేమో అనాలేమో…
మొత్తానికి ఫస్టాఫ్ సోసోగా నడిపించి, అఖండ పాత్ర ఎప్పుడొస్తుందా అనే ఆసక్తిని ప్రేక్షకుడిలో క్రియేట్ చేశాడు దర్శకుడు… ఒక్కసారి అఖండ ఎంటరయ్యాక ఇక అంతా దబిడిదిబిడే… ఒక రజినీకాంత్ కబాలీ, కాలా తీస్తే జనం చూస్తారా..? అందుకే అన్నాత్తే అని తన పాత ఫార్ములాకు ఫిక్సయిపోయాడా..? అలాగే బాలయ్య కూడా… తనకు నప్పే, తన ఫార్ములాయే కరెక్ట్ అనుకున్నాడా..? అందుకేనా కసికసిగా నరికిపారేశాడు..?
వయస్సు మళ్లే కొద్దీ ఎలాంటి పాత్రల్లోకి ఇమిడిపోవచ్చో ఒక వెంకటేష్, ఒక మోహన్‌లాల్, ఒక మమ్ముట్టి తదితరులు చూపిస్తున్నారు… నో, నో, మాస్, కమర్షియల్, పాపులర్ సినిమా అంటే ఫార్ములా వదలొద్దు అని ఒక బాలయ్య, ఒక రజినీకాంత్ చూపిస్తున్నారు… వాళ్లకు ఇది ఒక సంధిదశ… ఈ అఖండుడు వాణిజ్యపరంగా నిలిస్తే బాలయ్య తరువాత సినిమాలూ ఇదే టైపు… మరి నిలవలేకపోతే..?!
Share this Article