.
సినిమా అంటేనే వినోద దందా… డబ్బే ఇండస్ట్రీని శాసించేది… అఖండ2 హీరో ఓ రాష్ట్ర సీఎం వియ్యంకుడు కావచ్చుగాక… స్టార్ హీరో కావచ్చుగాక… ఐతేనేం… డబ్బే వివాదాలకు కారణం, వివాదాలకు పరిష్కారం కూడా…
ఈ సినిమా రిలీజ్ ఎందుకు ఆగిపోయిందో అందరికీ తెలిసిందే కదా… కోర్టు స్టే ఇవ్వడంతో రిలీజ్ నిలిచిపోయింది… చివరకు కోర్టు బయట పరిష్కారంతో (డబ్బు, పాత బకాయిల చెల్లింపు సెటిల్మెంట్) ఈనెల 12న రిలీజ్‌కు మార్గం సుగమమైంది… 11న ప్రీమియర్లు…
Ads
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అత్యంత ఔదార్యంతో భారీగా టికెట్ల రేట్ల పెంపుకి అనుమతించిన సంగతి కూడా తెలిసిందే కదా… నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చొరవ తీసుకుని, సెటిల్మెంట్ చేశాడని వార్తలు… అలాగే బాలకృష్ణ, బోయపాటి కూడా తమ రెమ్యునరేషన్లను తగ్గించుకుని, ఆమేరకు నిర్మాతకు సాయం చేశారనీ సమాచారం…

ఇంకాస్త లోపలకు వెళ్దాం… ఇది ఇప్పటి పంచాయితీ కాదు… మహేశ్ బాబు నటించిన నేనొక్కడినే, ఆగడు సినిమాల నాటి తగాదా… (దూకుడు కూడా వీళ్లు నిర్మించిందే, అందులోనూ మహేశ్ బాబే హీరో…)
అఖండ 2 సినిమాను నిర్మించిన 14 రీల్స్ ప్లస్ (14 Reels Plus LLP) బ్యానర్ ఇంతకుముందు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (14 Reels Entertainment Private Limited) అనే పేరుతో ఉండేది… ఆ పాత బకాయిలు మెడకు చుట్టుకోకుండా ఉండటానికి ఇలా బ్యానర్ పేరు మార్చారు ప్రమోటర్లు రామ్ ఆచంట, గోపి ఆచంట తదితరులు…

నేనొక్కడినే, ఆగడు సినిమాల కోసం 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థకు ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఫైనాన్స్ చేసింది… ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో భారీ నష్టాలు వచ్చాయి… ఈ నష్టాల సెటిల్‌మెంట్ విషయంలోనే 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్‌కు దాదాపు ₹28 కోట్ల వరకు బకాయి పడింది…
అయితే, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ చెల్లించాల్సిన బకాయిలను వసూలు చేయడానికి ఎరోస్ ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయించింది… సరిగ్గా సమయం కోసం నిరీక్షించి… అఖండ2 రిలీజు సమయానికి మెడపై కత్తి పెట్టింది… దాంతో అఖండ నిర్మాతలకు ఇక అనివార్యంగా పంచాయితీ తెంపుకోవాల్సిన స్థితిని క్రియేట్ చేసింది… దీనికితోడు బాలయ్య నుంచి కూడా త్వరగా కేసు సెటిల్ చేసుకోవాలని నిర్మాతలపై తీవ్ర ఆగ్రహం, ఒత్తిడి… సినిమా ఆగిపోతే తనకు అప్రతిష్ట కదా… తన బిడ్డ పేరు కూడా ప్రజెంటర్‌గా ఉంది…

అంతేమరి… డబ్బు వసూలు చేసుకోవాల్సిందే కదా… 14 రీల్స్ ప్లస్ అనేది పాత సంస్థకు కొనసాగింపు (alter ego) అని వాదించి, ఆ బకాయిలు చెల్లించే వరకు కొత్త సినిమా విడుదలపై స్టే విధించాలని కోరింది… మద్రాస్ హైకోర్టు స్టే ఇవ్వడంతోనే అఖండ 2 విడుదల వాయిదా పడింది… ఇదీ కథ…
తప్పనిసరై ఈ అఖండ 2 సినిమా విడుదల వివాదం కోర్టు బయట (out-of-court) సెటిల్మెంట్ ద్వారా పరిష్కరించుకోవడంతో అఖండ2 ఇక రిలీజ్ కాబోతోంది… నిర్మాణ సంస్థ ఎరోస్ సంస్థకు చెల్లించాల్సిన బకాయిల్లో కొంత మొత్తాన్ని సెటిల్మెంట్ మొత్తంగా చెల్లించడానికి అంగీకరించింది, తద్వారా న్యాయపరమైన అడ్డంకులను తొలగించింది…

ఒక సినిమా ప్రెస్ మీట్‌లో సురేష్ బాబు మాట్లాడుతూ, “నేను కూడా ఆ ఇష్యూని క్లియర్ చేయడానికి వెళ్లాను… త్వరలోనే అఖండ 2 సమస్య పరిష్కారమవుతుంది…” అన్నాడు… నిన్న ఉదయం నుంచే ప్రాబ్లం సాల్వ్ అయిందనీ, కోర్టు క్లియరెన్స్ ఇవ్వగానే రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి, అలాగే జరిగింది…
సో, ఇంకేం... బాలయ్య ఫ్యాన్స్‌కు పండుగ... జై బాలయ్యా..! సరికొత్త సనాతన ధర్మరక్షక బాలయ్యా జయహో..!!
.
సినిమా ప్రమోషన్ల సందర్భంగా బోయపాటి హిందీ… బాలయ్య మాటతీరు…. అన్నింటికీ మించి అమ్మ కడుపులో ఉన్నప్పుడే జైబాలయ్య అనే మంత్రాన్ని విన్న వైనం… ఇవి మాత్రం ఈ వారం రోజులపాటు బాగా వైరల్..!!
Share this Article