.
Subramanyam Dogiparthi …….. శ్రీవారి ముచ్చట్లు సినిమాలో హీరోయిన్లు ఇద్దరినీ చంపిన పాప పరిహారార్ధం ఈ యువరాజు సినిమాలో ఇద్దరు హీరోయిన్లను బతికించి ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడిని చేసేసారు దాసరి నారాయణరావు . కధ , స్క్రీన్ ప్లే , మాటలు , పాటలు , దర్శకత్వం అన్నీ ఆయనే . మల్టీ టాస్కింగ్ సినిమా కార్ఖానా !
అన్నపూర్ణ బేనరుపై అక్కినేని వెంకట్ , నాగార్జునలు నిర్మాతలుగా వ్యవహరించిన అక్కినేని కుటుంబ సినిమా . డిసెంబర్ 1982 లో వచ్చింది . కానీ , అక్కినేని- దాసరి కాంబో లెవెల్లో ఆడలేదు . అలవాటైన పక్కా రొటీన్ ఫార్ములాతో ఏదో తీశాం అన్నట్టుగా తీశారు…
Ads
1971లో వచ్చిన అక్కినేని పవిత్ర బంధం సినిమా రివర్స్ మేక్ ఈ యువరాజు . పవిత్ర బంధంలో హీరోకి గత స్మృతి పోయి వస్తూ ఉంటుంది . యువరాజు సినిమాలో హీరోయిన్ జయసుధకు గత స్మృతి పోయి వస్తూ ఉంటుంది . ఈ రెండు సినిమాలకు తేడా ఏంటంటే పవిత్ర బంధంలో ఒక హీరోయిన్ కాంచనను లేపేస్తారు . యువరాజు సినిమాలో ఇద్దరూ సర్దుకుంటారు . 1+2 సినిమాలలో ఇలాంటి సర్దుబాట్లు తప్పవు .
హీరో అక్కినేని నిజంగా యువరాజులాగే పైలాపచ్చీసుగా వెలిగిపోతుంటాడు . అతని తండ్రి ప్రభాకరరెడ్డి , ఒక హీరోయిన్ సుజాత తండ్రి అల్లు రామలింగయ్యలు ప్రాణమిత్రులు . వియ్యంకులు అవటానికి ఉవ్విళ్ళూరుతుంటారు . అనుకోకుండా మరో హీరోయిన్ జయసుధ గత స్మృతిని కోల్పోయి హీరోతో కాపురం చేసేస్తుంది . హీరోయిన్ల ఐడెంటిటీలలో పొరపాటు పడి సుజాతను పెళ్లి చేసుకోవటానికి అంగీకరిస్తాడు . పెళ్లి పీటల మీద ఈ అమ్మాయి కాదని చెప్పటంతో పెళ్లి ఆగిపోతుంది .
జయసుధ తప్పిపోయిందని పేపర్లో ప్రకటన చూసిన హీరో అసలు విషయం తెలుసుకుని వెతికి హాస్పిటల్లో జాయిన్ చేసి తిరిగి ఆరోగ్యం వచ్చేలా తిప్పలు పడతాడు . గత స్మృతి వచ్చాక తన తమ్ముడు మురళీమోహనుతో పెళ్లి చేయిస్తుంది జయసుధ వదిన కె విజయ . మొదటి రాత్రే గర్భవతి అని తెలుస్తుంది .
హీరో వద్దకు వెళ్ళేటప్పటికి సుజాతతో పెళ్లి అయిపోతుంది . హీరో గారు ఓ విప్లవాత్మక పాట పాడి ఇద్దరూ భార్యలుగా సర్దుకుపోయేలా సెటిల్మెంట్ చేస్తాడు . శ్రీవారి ముచ్చట్లులో రెండు ఉయ్యాలలు ఒక హీరో . యువరాజు సినిమాలో ఒక ఉయ్యాల ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు . ఇదీ కధ .
దాసరికి ఆ టైమ్‌కు ఏది తోస్తే అది కథ… ఇదీ అదే… అక్కినేనికి , శోభన్ బాబుకి ఇలాంటి 1+2 సినిమాలు రొటీనే కదా ! అక్కినేని యువరాజు పాత్రను ఎడం చేత్తో చేసేసాడు . ఇద్దరు బొంబాయి డాన్సర్లతో డాన్స్ బ్రహ్మాండంగా చేస్తాడు . చెప్పుకోవలసింది సుజాత గురించే . చాలా బాగా నటించింది . జయసుధకు కూడా ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . హుషారుగా , చలాకీగా బాగా నటించింది . ఇతర పాత్రల్లో పద్మనాభం , శ్రీధర్ , బౌనా , పుష్పలత , మమత , ప్రభృతులు నటించారు .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు బాగుంటాయి . నారీ నారీ నడుమ మురారి నీదీ నాదీ వేరే దారి క్లబ్ డాన్స్ బాగుంటుంది . ఎవరో చెప్పారు చిన్నప్పుడు , నీలాల నింగి ఒకసారి వంగి డ్యూయెట్లు చాలా శ్రావ్యంగా ఉంటాయి . ఎవరా నలుగురు అంటూ లోకాన్ని ప్రశ్నించే పాట క్లైమాక్సులో ముగింపుకు తోడ్పడుతుంది .
(దాసరి రాయించుకునే పాటల్లో, లేదా రాసే పాటల్లో చాలా వాక్యాలకు అర్థాలుండవు… ఏవో తోచిన తెలుగు పదాల్ని పేర్చేస్తుంటారు… ఎవరో చెప్పారు చిన్నప్పుడు పాటలో కృష్ణా కావేరి నడిబొడ్డులో అంటాడు హీరో ఓచోట… అంటే ఏమిటో దాసరికే తెలియాలి… సేమ్, సిరులున్న చిన్నోడు అంటే తిరుపతి శ్రీనివాస్ అనుకుంటుందట హీరోయిన్, కానీ కాదని తెలిసిందట… చిన్న ముక్కు అంటే చిత్రాంగి అనుకుంటాడు హీరో, చిత్రాలు లేవని తెలిసి కాదులే అనుకుంటాడట… రాతగాడి దయ, చూసేవాడి ఖర్మ…)
ప్రేమనగర్ , పవిత్ర బంధం , శ్రీవారి ముచ్చట్లు , వగైరా వగైరా సినిమాల సమ్మిళితం ఈ యువరాజు . రిచ్ గానే తీసినా , అన్నీ ఉన్నా అక్కినేని- దాసరి లెవెల్లో ఆడలేదు . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడని అక్కినేని అభిమానులు , సినిమా ప్రియులు చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article