సూయెజ్ కాలువలో ఓ భారీ ఓడ ఈమధ్య ఇరుక్కుపోవడం, ప్రపంచ వాణిజ్యానికి జరిగిన నష్టం కొద్దిరోజులుగా చదివాం కదా… చివరకు చంద్రుడు సహకరించి, సముద్రపు అలలు ఎగిసిపడి ఓడ బయటపడిందే తప్ప మన టెక్నాలజీ ఏమీ ఉపయోగపడలేదని కూడా ముక్తాయించాం కదా… అది మనిషి తవ్విన కాలువే… ప్రకృతి సిద్ధమైంది కాదు, పైగా వెడల్పుపై ఇప్పుడు మళ్లీ బోలెడు చర్చలు సాగుతాయి ఇక… ఇదెందుకు హఠాత్తుగా గుర్తొచ్చిందంటే… సముద్రంపై ఓడలకు అనువైన బాటలు వేయడం అంత వీజీ కాదు అని చెప్పడానికి..! అక్షయకుమార్ ఓ సినిమా తీస్తున్నాడు… దాని పేరు రామసేతు… అందులో తను ఓ ఆర్కియాలజిస్టు… కొంతకాలంగా నేషనలిస్టు అయిపోయాడు కదా, ఆ సినిమాలూ బాగానే వర్కవుట్ అవుతున్నాయి… సరే, తను రామసేతు విషయంలో కొత్తగా ఏం కనిపెడతాడు, సినిమాలో కథ ఏం చెప్పబోతున్నాడు అనేది పక్కనపెడితే… ఇంట్రస్టింగు టాపిక్… అనవసర వివాదాలకు భయపడి దాని జోలికి వెళ్లరు గానీ ఆసక్తికరమైన కథే అవుతుంది… రామసేతు అంటే తెలుసు కదా… ఇండియా-శ్రీలంకల నడుమ ఉన్న ఓ వారధి…
సీతను ఎత్తుకుపోయిన రావణుడి మీదకు యుద్ధానికి వెళ్లిన రాముడు… మధ్యలో అడ్డుగా నిలిచిన సముద్రం మీద ఈ వారధి కట్టించి, దానిపై నుంచి యుద్ధానికి వెళ్లాడు అనేది రామాయణం… దేశంలో కోట్ల మంది రామభక్తులు నమ్ముతారు… నో, నో, సముద్రంలో సహజసిద్ధంగా ఏర్పడిన పగడాలు, సున్నపురాళ్ల దిబ్బ మాత్రమే, అది మానవనిర్మితం కాదు అనేవాళ్లూ బోలెడుమంది… ఆ శాస్త్ర, పురాణ చర్చలోకి మనం వెళ్లడం లేదు గానీ… పదిహేను సంవత్సరాల క్రితం కావచ్చు… అప్పటి సీఎం కరుణానిధి ఈ వారధిని మధ్యలో తవ్వేసి, ఓడల రాకపోకలకు అనువుగా లోతును పెంచేసి, ఓ సముద్ర మార్గం ఏర్పాటు చేయాలనే ప్రాజెక్టుకు వోకే చెప్పాడు… అదే సేతుసముద్రం ప్రాజెక్టు… నిజానికి వాజపేయి ప్రభుత్వం అనుమతి ఇవ్వదు అనుకున్నారు కానీ ఆయన ఇచ్చాడు… భారీ ప్రాజెక్టు, కరుణానిధి బాగా ఆశించాడు పాపం… రాజకీయాలంటేనే ప్రాజెక్టులు, కమీషన్లు కదా… కానీ కథ సుప్రీంకోర్టు చేరింది, ప్రాజెక్టు ఆగింది… చివరకు తనే మరణించాడు… మొన్నామధ్య టూజీ స్కామర్ రాజా దీన్ని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు గానీ కేంద్రం లైట్ తీసుకుంది… అయితే..?
Ads
అప్పట్లో కరుణానిధి చేసిన వ్యాఖ్యలు ఓసారి గుర్తుకు చేసుకోవాలి… ‘‘ఈ వారధి కట్టింది రాముడా..? తనేమైనా ఇంజనీరింగు చదివాడా..? ఏ కాలేజీ..? రామాయణమే ఓ కల్పన, ఇక వారధి కట్టడం ఏమిటి..? నాన్సెన్స్, దాన్ని అడ్డంగా తవ్వాల్సిందే…’’ ఇలాంటి వ్యాఖ్యలు చాలా చేశాడు… తను నాస్తికుడు, హిందూ దేవుళ్లను నిందిస్తేనే వాళ్ల స్థానిక రాజకీయం… ఇప్పుడదే కరుణానిధి కొడుకు తన నాస్తికవారధిని మధ్యలోకి తవ్వేశాడు, ఆయన భార్య దుర్గ రోజుకు పది గుళ్లను దర్శిస్తోంది… అది వేరే కథ… అయితే నిజంగా మన పురాణాల ప్రకారమే ఆ వారధిని ఎవరు కట్టారు..? అదీ ఇంట్రస్టింగు… బాట ఇవ్వవయ్యా బాబూ అంటే సముద్రుడు వినడు, రాముడు కోపంతో బాణం తీస్తాడు, సముద్రుడు గడగడా వణికిపోయి నేను సహకరిస్తాను కానీ వారధి కట్టేవాళ్లను చూపించు అంటాడు, రాముడు సుగ్రీవుడి వైపు చూస్తాడు… సుగ్రీవుడు నలుడిని చూపిస్తాడు… ఈ నలుడు ఎవరయ్యా అంటే విశ్వకర్మ కొడుకు… అన్నిరకాల నిర్మాణాల్లోనూ దిట్ట… ఆ నలుడి సారథ్యంలోనే వారధి నిర్మాణం జరుగుతుంది… అదీ అయిదే రోజుల్లో… ఇదీ కథ… మరి అక్షయకుమారుడు ఏం కథ చెప్పనున్నాడో చూద్దాం…
Share this Article