అక్షయపాత్ర… మహాభారతంలో ద్రౌపది తన దగ్గరున్న అక్షయపాత్రతో ఎంతమంది అన్నార్తులు వచ్చినా సరే, భోజనాలు సమకూరుస్తుంది… ఓసారి కుయుక్తితో దుర్వాసుడు భోజనాలవేళ దాటాక, తన శిష్యగణంతో వచ్చి భోజనాలకై ఒత్తిడి తెస్తాడు… అప్పుడు కృష్ణుడు సమయానికి అరుదెంచి, అక్షయపాత్రలో మిగిలిన ఓ మెతుకు తిని, సాధుగణం ఏమీ తినకుండానే పొట్టలు పగిలిపోతూ వాపస్ వెళ్లిపోయేలా చేస్తాడు… ఇది పురాణ కథ…
సరే, వర్తమానానికి వద్దాం… ఇంటికి నలుగురు అతిథులు వస్తున్నారు, భోజనాలు చేసి వెళ్తారు అంటేనే గృహిణికి ఊపిరాడదు… మాట రాకుండా, ఎవరూ తప్పు పట్టకుండా అతిథుల కడుపులు నింపి పంపించడానికి టెన్షన్… శ్రమ… ప్రయాస… ఇక్కడ డబ్బు, సంబారాల గురించి పక్కన పెట్టండి, సమయానికి అన్నీ అనుకున్నట్టుగా సమకూర్చడం అనేదే పెద్ద టాస్క్…
మన దేశంలోనే ఓ లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థ రోజూ దాదాపు 20 లక్షల మందికి ఆహారాన్ని అందిస్తున్నదంటే మాటలా..? అదీ 24 సంవత్సరాలుగా… నిరాటంకంగా… ఇక్కడ మళ్లీ డబ్బు గురించి వదిలేయండి, విరాళాలు వస్తాయి, నిత్యాన్న పంపిణీ నడుస్తూనే ఉంటుంది… కానీ నిర్వహణ ఎంత కష్టమైన పని..? మధ్యాహ్నభోజన పథకానికి ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది…
Ads
ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్… ఈ సంస్థ పేరు అక్షయపాత్ర… ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఈరోజు పత్రికల్లో ఓ విశేష వార్త ఆకర్షించింది… మెయిన్ స్ట్రీమ్ మీడియాకు పెద్దగా పట్టలేదు సహజంగానే… రాజకీయ బురద వార్తల నడుమ దీనికి చోటులేకుండా పోయింది… (ఆంధ్రజ్యోతిలో ఓ సింగిల్ కాలమ్ మాత్రం కనిపించింది…)
వార్త ఏమిటంటే…? అక్షయపాత్ర ఇప్పటివరకూ పెట్టిన భోజనాల సంఖ్య అక్షరాలా 400 కోట్లు… ఆ సంఖ్య వింటేనే ఓ అబ్బురం అనిపిస్తుంది కదా… ఈ హిస్టారిక్ మైలురాయిని సాధించిన సందర్భాన్ని సెలబ్రేట్ చేసింది ఎవరో తెలుసా..? ఐక్యరాజ్యసమితి… అవును, న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది…
ఈ సందర్భంగా భారత శాశ్వత కమిషన్ ‘ఆహారభద్రతలో విజయాలు- సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా భారత్ ముందడుగు’ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది… దీనికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నారాయణమూర్తి, నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి, అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండిట్ దాస హాజరయ్యారు…
దీనికి ప్రధాని మోడీ కూడా ఓ అభినందన సందేశం పంపించాడు… ప్రస్తుతం ఈ సంస్థ దేశంలో 72 భారీ కిచెన్‌లను కలిగి ఉంది… 24 వేల పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తోంది… ఇదీ వార్త… ఇది అల్లాటప్పా ఘనత కాదు… దీని యాక్టివిటీస్ అధికంగా ఉండే కర్నాటకలో దీన్ని దెబ్బతీయడానికి బోలెడు ప్రయత్నాలు సాగాయి… గుడ్డు, అల్లం వెల్లుల్లి లేని సాత్విక భోజనం పిల్లలకు పెడుతున్నారనే రచ్చ… చేసేవాడిని చేయనివ్వరు, పైగా కాళ్లల్లో కట్టెలు పెడతారు…
ఇక్కడ సంస్థ తాలూకు కిచెన్ ఆటోమేషన్, హైజినిక్ వాతావరణం, స్పీడ్ రవాణా వంటి వివరాలు జోలికి పోవడం లేదు, బోలెడు వీడియోలున్నయ్ యూట్యూబులో… ప్రతి పిల్లవాడి కడుపు నింపడానికి శ్రమిస్తున్న సంస్థ బాధ్యులతోపాటు సిబ్బందిని మొదట అభినందించాలి… గ్రేట్…
Share this Article