.
Subramanyam Dogiparthi ……. 1983 లోకి వచ్చేసాం . చిరంజీవి మరింత పాపులర్ కావటానికి బాగా దోహదపడ్డ సంవత్సరం 1983 . ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ , మంత్రి గారి వియ్యంకుడు వంటి ఫీల్ గుడ్ సినిమాలు విడుదలయ్యాయి . కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ ఆలయ శిఖరం కూడా చిరంజీవికి మంచి పేరు తెచ్చింది . కమర్షియల్ సక్సెస్ కూడా .
ఓ పేద కుటుంబం . స్వార్ధంతో కూరుకుపోయి కుటుంబం పట్ల బాధ్యత లేని పెద్ద కొడుకు , బేవార్సుగా తిరిగే నికృష్టపు తండ్రి , నవలా లోకంలో కలల్లో ఓలలాడే కూతురు , సాగరం లాంటి సంసారాన్ని అప్పోసప్పో చేసి ఈడ్చుకొచ్చే తల్లి , వీళ్ళందరి కోసం రాత్రింబవళ్లు కష్టపడే హీరో చిన్న కొడుకు , అతనికి తమ్ముడు లాంటి గుర్రం .
Ads
దారి తప్పిన కుటుంబాన్ని నానా కష్టాలు పడి హీరో చిరంజీవి , అతని గుర్రం గాడిలోకి తెచ్చుకుంటారు . టూకీగా ఇదీ కధ . ఇలాంటి ఇతివృత్తాలతో చాలా సినిమాలు ఉన్నాయి మనకు . అయినా దేనికి దానికే కదా బాగుండేది , బాగుండనిది . 1983 మే ఏడవ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాగుంటుంది .
ఫక్తు ఫేమిలీ ఫార్ములా సినిమా . ఫేమిలీ సెంటిమెంట్ , ఎమోషన్స్ , ఏక్షన్ , మారువేషాల్లో యన్టీఆర్ సినిమాల్లోలాగా విలన్ గేంగుని బురిడీ కొట్టించడం , ఉరి ఆఖరి క్షణంలో గవర్నర్ గారి జోక్యంతో స్టాప్ సీన్లూ ఉంటాయి . విశేషం ఏమిటంటే గుర్రం సెంటిమెంట్ . ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రధారి గుర్రం . చివరకు క్లైమాక్సులో విలనేశ్వరుడిని చితగ్గొడుతుంది కూడా .
సినిమా అంతా ఆల్మోస్ట్ తిరుపతి , చంద్రగిరి ప్రాంతంలోనే తీసారు . కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం అన్నీ కోడి రామకృష్ణవే . సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . ముఖ్యంగా గుర్రబ్బండి మీద చిరంజీవి పాడే పాట ఇది ఆశలు రేపే లోకం అడియాసలు చేసే లోకం బాగా హిట్టయింది కూడా .ఉపద్రష్ట సాయి ఈ పాటను వ్రాసారు . పూలరంగడు సినిమాలో అక్కినేని గుర్రబ్బండి మీద పాటలాగా ఉంటుంది .
సి నారాయణరెడ్డి వ్రాసిన నీ హృదయం ఆలయశిఖరం , నీ రూపు మారింది గోపాలుడా , తప్పేముందిరా ఉన్నది చెబితే అప్పలసామి పాటలు బాగుంటాయి . మైలవరపు గోపి వ్రాసిన కొండలెక్కిన దేవుడా ఆ బండలలో ఏమున్నది పాట చిరంజీవి మీద బాగుంటుంది .
మారువేషాల్లో ఫేమిలీ అంతా వేసే డాన్స్ పాట ఓహో అమ్మకి చెల్లా దుమ్మరి సింధు అందం చందం చాలా స్పీడు స్పీడుగా హుషారుగా ఉంటుంది . చిరంజీవి సర్కస్ ఫీట్స్ వంటి స్టెప్స్ , డాన్స్ ప్రేక్షకులను , ముఖ్యంగా ఆయన అభిమానులను బాగా ఊగించాయి . గొల్లపూడి మారుతీరావు డైలాగ్స్ పదునుగా ఉంటాయి .
ఈ సినిమాలో సుమలత గొంతు కాస్త లెగుస్తుంది . గ్లామర్ స్పేసుని ఫిల్ చేయటానికి ప్రయత్నించింది . రంగనాధ్ పక్కన హీరోయినుగా వేసిన నటి రీనా . ఆమె మళయాళ నటి . అక్కడ నుండి తేవాల్సిన అందగత్తె కూడా కాదు . అంతగా అక్కడ నుండి ఎందుకు తెచ్చారో అర్థం కాదు .
స్వార్ధంతో ఫేమిలీకి ద్రోహం చేసే అన్నగా రంగనాధ్ , నికృష్టపు తండ్రిగా గొల్లపూడి మారుతీరావు , కలల్లో ఓలలాడే చెల్లెలుగా ముచ్చెర్ల అరుణ , తల్లిగా డబ్బింగ్ జానకి , విలనేశ్వరుడిగా సత్యనారాయణ నటించారు .
ఈ సినిమాలో చాకిరేవు పత్రిక ఓనరుగా , సంపాదకునిగా , అన్నీ తానేగా పి యల్ నారాయణ పాత్ర బాగుంటుంది .
పింగళి దశరధ్ రాంలాగానే ఖతం చేయబడతాడు . దశరధ రాం హత్య ఈ సినిమా తర్వాత అనుకోండి . మరో ముఖ్య పాత్ర రాళ్ళపల్లిది . వీళ్ళందరితో సమానమైన ప్రాముఖ్యత కలిగిన పాత్రధారి గుర్రం . టైటిల్సులో ఈ గుర్రబ్బండి ఓనర్ కొట్టు మూలయ్య పేరు కూడా వేసారు . కోడి రామకృష్ణ మంచోడు బండి ఓనర్ పేరు వేసాడు .
ఓవరాల్ మంచి సినిమా . చిరంజీవి అభిమానులకు బాగా నచ్చింది , నచ్చుతుంది . ఏక్షన్ సినిమాలే కాదు ఇలాంటి ఫేమిలీ ఓరియెంటెడ్ రాముడు మంచి బాలుడు పాత్రలను కూడా బ్రహ్మాండంగా వేయగలను అని తన సత్తాని చూపించాడు . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article