కమెడియన్ ఆలీ ఇంకా సీతాకోకచిలుక సినిమాలో లాగులో ఉచ్చ పోసుకున్న స్టేజ్ నుంచి ఈరోజుకూ ఎదగలేదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు… సరదాగానే అంటున్నాం లెండి సార్… నిజంగానే కొన్నిసార్లు తను ఏం మాట్లాడతాడో తనకే తెలియదేమో… తన తాజా షో చూశాక అదే చిరాకు కలిగింది… నిజమే… చిరాకే… అప్పుడెప్పుడో నలభై ఏళ్ల క్రితం వచ్చిన సప్తపది సినిమా గుర్తుందా..? బహుశా రెండుతరాల వాళ్లకు తెలిసి ఉండదు… విశ్వనాథ్ సినిమా అది… అందులో హీరోయిన్ సబిత… హీరో గిరీశ్…
వాళ్లిద్దరినీ ఆలీతో సరదాగా షోకు పట్టుకొచ్చాడు… అభినందనీయం… ఏనాడో మెరిసిన తారలను మళ్లీ బుల్లి తెర మీదకు తీసుకొచ్చి మాట్లాడింపజేయడం బాగుంది… ఆలీ షోకు అసలు లైఫ్ అదే… మిగతా టాక్ షోలకు భిన్నంగా ఉండటమే ఆలీ షో విశేషం… అయితే… వీళ్లిద్దరిలో సబిత హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది… శాస్త్రీయ నృత్యం తెలుసు… ఒక ప్రోగ్రాములో చూసి విశ్వనాథ్ ఆమెను ఎంపిక చేసుకున్నాడు… (సోమయాజులు మినహా ఈ సినిమాలో ముఖ్యపాత్రలన్నింటికీ కొత్తవారిని తీసుకోవాలని ఆయన అనుకున్నాడుట…) మీరు పైన చూసిన ఫోటో ఆ సినిమాలోనిదే… ఆ సినిమా కథ, దాని విశేషాల జోలికి వెళ్లడం లేదు మనం…
Ads
నిజానికి ఆమె సినిమా తారగా తళుక్కుమనే అందగత్తె ఏమీ కాదు… పైగా ఆ సినిమాలో పెద్దగా రాణించలేదు కూడా… హావభావాలు పెద్దగా పలకవు ఆమె మొహంలో… డాన్సులు కూడా మరీ గొప్పవేమీ కావు… కాకపోతే ఆ సినిమాలో పాటలు ఈరోజుకూ సూపర్ అనిపిస్తాయి… మరీ హేమమాలినిని రిజెక్ట్ చేసి, ఈమెను తీసుకున్నారనే మాట మరీ అతిశయోక్తి… ఆ ఒక్క సినిమాయే ఫస్ట్, లాస్ట్… మధ్యలో కొన్ని యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చింది… నలభయ్యేళ్ల తరువాత ఇదే తొలిసారి ఏమీకాదు… గిరీశ్ విషయానికి వద్దాం…
చిరంజీవి సమకాలీనుడు… మంచుపల్లకీలో నటించాడు… ఓసారి తన కాళ్లకు బూట్లు లేకపోతే, ఇద్దరమూ వాళ్లింటికి వెళ్లి, సురేఖ చేతివంట తిన్నాక తన ఇంట్లో ఉన్న కొత్త బూట్లు ఇచ్చాడని గుర్తుచేసుకున్నాడు… అప్పట్లో చిరు కూడా అవకాశాల కోసం డింకీలు కొడుతున్న రోజులేగా… సరే, ఆ జ్ఞాపకం బాగుంది… ఈ సినిమా కోసం ఫ్లూట్, తెలుగు నేర్చుకున్నాడు… బేసిక్‌గా కన్నడిగుడు… అందగాడే…
తన కొడుకు తమిళ ఇండస్ట్రీలో అవకాశాల్ని వెతుక్కుంటున్నాడు… ఏదో సినిమాలో ధనుష్ పక్కన విలన్‌గా లాంచయ్యాడు… పేరు అమితాశ్… తను అనుభవాలు చెబుతూ… ఓ అమ్మాయి తనను బాగా ఇష్టపడిందనీ, ఆమె పెద్ద అందగత్తె కాకపోయినా… ఆమె తండ్రి ఆమెను గనుక పెళ్లి చేసుకుంటే న్యూజిలాండ్‌లోని తన వ్యాపారాలన్నీ అప్పగిస్తానని ఆఫర్ ఇచ్చాడట… అప్పుడు కాస్త డైలమాలో పడ్డానని నవ్వుతూ గుర్తు చేసుకున్నాడు…
ఈ సందర్భంగా ఆలీ ‘‘ఆమెను పెళ్లిచేసుకుంటే ఎంచక్కా అందమైన న్యూజిలాండ్ వెళ్లేవాడివి… పెద్ద వ్యాపారాలకు ఓనర్ అయ్యేవాడివి, అంతేకాదు, ఆమె ఎవరో తెలుసా..? ఇప్పుడు అక్కడి ప్రెసిడెంట్ భార్య… చూశావా, ఎన్ని కోల్పోయావో’’ అన్నాడు… ఇక్కడ ఓసారి ఆగుదాం… న్యూజిలాండ్‌లో ప్రెసిడెంట్ భార్యకు మన ఇండియన్ రూట్సా..? ఎవరబ్బా..?
ఇదుగో ఇదే… ఇలాంటప్పుడే సీతాకోకచిలుక ఆలీ గుర్తొస్తాడు… న్యూజిలాండ్‌లో అసలు ప్రెసిడెంట్ ఉంటాడా..? ఉంటే గింటే ఆయన భార్యకు ఇండియన్ రూట్సా..? ఎంతగా వెతికినా అసలు ఆమె ఎవరో తెలియడం లేదు… పోనీ ప్రైమ్ మినిస్టర్ అనుకుందామా..? అదీ కరెక్టు కాదు… అక్కడి చట్టసభలకు ఎన్నికైనవాళ్ల పేర్లు జల్లెడపట్టినా ఈ సౌతిండియా రూట్స్ ఎవరికీ ఏమీ కనిపించలేదు… మరి ఇంకెవరబ్బా..?
మొన్నీమధ్య ఎర్నాకుళం మూలాలున్న ప్రియాంక రాధాకృష్ణన్ మంత్రిగా ప్రమాణం చేసింది… కానీ ఈ సప్తపది సినిమా తీసినప్పుడు, అంటే నలభై ఏళ్ల క్రితం ఆమె ఏడాది పాప మాత్రమే… ఆ దేశానికి పెబ్బ గవర్నర్ జనరల్… ఇండియన్ రూట్స్ ఉన్నవాళ్లెవరూ ఆ పోస్టు దరిదాపుల్లోకి కూడా పోలేదు… మరి ఇంకెవరబ్బా..? ఆలీ… ఇదే నీతో వచ్చిన చిక్కు… టాక్ షో చేసినప్పుడు ప్రేక్షకుడి బుర్రల్లో ప్రశ్నార్థకాలు మిగల్చకూడదు… పోనీ, నువ్వే చెప్పు… ఎవరామె…? ఆ గొప్ప లేడీ ఎవరో చెప్పాలి… ఏదో నోటికొచ్చింది అనేసి, అర్థంతరంగా వదిలేస్తే ఎలా..? ఆమె ఎవరో తెలియాలి కదా…!!
Share this Article