జాక్ మా కు చుక్కలు చూపిస్తున్న చైనా!
——————–
చైనాలో అంతే! కాకపోతే చైనాలో అంతే అనే విషయం ప్రపంచ కుబేరుల్లో ఒకడు, చైనాలో అత్యంత సంపన్నుడు అయిన జాక్ మాకు ఆలస్యంగా తెలిసివచ్చింది. స్టాన్ఫోర్డ్ లాంటి బిజినెస్ మేనేజ్మెంట్ ఆంతర్జాతీయ అత్యున్నత కాలేజి అరుగుల మీద జాక్ వ్యాపారం మెళకువలు చెబుతుంటే ప్రపంచమంతా చెవి ఒగ్గి, ఆరాధనగా, తాదాత్మ్యంతో విన్నది. ఆయన అలీబాబా ఆన్ లైన్ మార్కెటింగ్ విద్య ఏదో ఒకనాడు పద్నాలుగు భువన భాండాలు ఆక్రమిస్తుందని అంచనాలు వేశారు. ఏమీ లేని చోటు నుండి లక్షల కోట్ల ఆన్ లైన్ వ్యాపార సామ్రాజ్యం నిర్మించి, ఆపై అనేక రంగాలకు విస్తరించి, ప్రపంచమంతా పెట్టుబడులు పెట్టిన జాక్ విజయగాథ ఎవరికయినా స్ఫూర్తిదాయకమే. అతని దూరదృష్టి, వ్యాపారాల నిర్వహణా దక్షత నిజంగా బిజినెస్ మేనేజ్మెంట్ కు పాఠమే.
Ads
ఎటొచ్చి- ఏదో ఒక రంగంలో కీర్తి ప్రతిష్ఠలు, పేరు ప్రఖ్యాతులు, డబ్బు, హోదా రాగానే- వారు ప్రపంచానికి తమ అనుభవాలను చెప్పాలనుకుంటారు. తమ అభిప్రాయాలు ప్రపంచానికి అవసరమనుకుంటారు. అన్ని విషయాలకు స్పందించాలనుకుంటారు. ప్రపంచంలో జరిగే మంచి చెడుల మీద కనీసం చిట్టి పొట్టి మాటలతో ట్విట్టాలనుకుంటారు. అలా జాక్ కూడా మాట్లాడ్డం మొదలు పెట్టాడు. అది ఇండియా కాదు. రాష్ట్రపతి, ప్రధాని భార్య- పిల్లల వ్యక్తిగత విషయాలు కూడా ఇక్కడ డిబేటబుల్. అది చైనా. పేరుకే వామపక్ష పాలన. జెండా రంగులో ఎరుపు తప్ప- ఆ వామపక్ష వర్ణం ఇక్కడి మన వర్ణంలా ఉండదు. నియంతలకే చుక్కలు చూపే ఎరుపు రంగు పాలన అది. చైనా ప్రభుత్వ విధానాల మీద జాక్ అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడ్డం మొదలు పెట్టాడో లేదో అతని మీద, అతని వ్యాపారాల మీద చైనా ప్రభుత్వం అధికారికంగా నిఘా పెట్టింది. అంతే- దెబ్బకు ఆరునెలలు జాక్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఫేస్ బుక్ ఉలుకు లేదు. ట్విట్టర్ పలుకు లేదు. జాక్ కంపెనీల అంతర్జాతీయ పెట్టుబడుల చిట్టాలన్నీ చైనా పెట్టుబడుల చట్టం పరిధిలోనే ఉన్నాయా? లేవా? అని తవ్వకాలు మొదలయ్యాయి. భవిష్యత్తులో జాక్ అంత ఎత్తుకు ఎదగడానికి అవకాశమున్న మరో ముప్పయ్ అతిపెద్ద చైనా కంపెనీలను కూడా పనిలో పనిగా జల్లెడ పడుతున్నారు.
జాక్ అలీబాబా కంపెనీకి సెగ మొదలయ్యింది. పొమ్మనలేక పెట్టిన పొగ చుట్టుకుంటోంది. ఉంటే చైనాలో నోరు మూసుకుని ఉండు. పొతే చిప్ప చేతికిస్తాం- బయటెక్కడయినా అడుక్కు తిని బతుకు- అని చైనా స్పష్టంగా తన చేతలతో చెప్పింది. ఇప్పటికే కంపెనీల మార్కెట్ విలువ సగానికి సగం పడిపోయి జాక్ మాకు దిక్కు తోచడం లేదు. జాక్ కంపెనీల్లో చైనా అధికారిక డేటా మీద అనుమానాలను రేకెత్తించారు. మంచి కుక్కను చంపితే సమాజం ఒప్పుకోదు. అదే పిచ్చి కుక్కను చంపకపోయినా సమాజం ఒప్పుకోదు. కాబట్టి అనాదిగా పాలకులు మంచి కుక్కకు పిచ్చి ముద్ర వేస్తారు. లేదా పిచ్చి పట్టేటట్లు చేస్తారు. ఆపై జనమే రాళ్లు వేసి చంపేస్తారు. మన దగ్గర ఐటీ, ఈడి, సిబిఐ లాంటివి ఉన్నట్లే చైనాలో కూడా ఉంటాయి.
బాలగోపాల్ అన్నట్లు- “చట్టం తన పని తాను చేసుకుంటూ, తన యజమాని పని కూడా చేసి పెడుతూ ఉంటుంది!”……….. By….. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article