Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓరేయ్ పిచ్చోడా… పెళ్లి సరే, భరణ భారం ఏమిటో తెలుసా నీకు..?!

July 24, 2025 by M S R

.

పెళ్ళిళ్ళు- పెటాకులు- భరణ భారాలు

ఈమధ్య భారత సర్వోన్నత న్యాయస్థానానికి తరచుగా ఒక విషయంలో తల బొప్పి కడుతున్నట్లుంది. న్యాయస్థానమంటే ఇటుకలు, రాళ్ళు, గోడలు, పైకప్పు కాదు కదా! న్యాయం మూర్తీభవించిన లేదా మూర్తీభవించాల్సిన చోటు.

Ads

న్యాయం దానికదిగా జరగదు కదా! ఎవరో ఒకరు జరిపించాలి. న్యాయమూర్తులే ఆ పని చేస్తుంటారు. తమముందు విచారణకు వచ్చే విడాకులు, భరణాల వివాదాల్లో విడిపోయేప్పుడు వచ్చే సమస్యలను ఎన్నిటినో చూసి ఉంటారు.

ఒక పెద్ద మనిషికి భారత ఆదాయప్పన్ను శాఖ వారి లెక్కల ప్రకారం అయిదున్నర వేల కోట్ల సంపద ఉంది. మొదట ఒక పెళ్ళయ్యింది. కొంతకాలం కాపురం చేశాక మనస్పర్ధలొచ్చాయి. పరస్పర అంగీకారంతో గౌరవంగా, మర్యాదగా, ప్రశాంతంగా కోర్టు ద్వారా లీగల్ గా విడిపోయారు.

ఆ సందర్భంగా భరణంగా మాజీ భార్యకు మాజీ భర్త 500 కోట్లు మనస్ఫూర్తిగా ఇచ్చాడు. కొంతకాలం గడిచింది. ఇంత సంపద ఉన్నా ఏదో వెలితి అని… మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ఆయన కర్మ ఎందుకో బలంగా కాలి… రెండో పెళ్ళిలో వేసిన మూడు ముళ్ళు కూడా గట్టిగా నిలబడక వదులుగా జారిపోయాయి.

పూర్వానుభవం ఎలాగూ ఉంది కాబట్టి… అలాగే పరస్పర అంగీకారంతో గౌరవంగా, మర్యాదగా, ప్రశాంతంగా కోర్టు ద్వారా లీగల్ గా విడిపోదాం అన్నాడు. ఆమె అడ్డం తిరిగింది. మొదటామె అమాయకురాలు కాబట్టి నీ 5,500 కోట్లలో 500 కోట్లు భరణంగా ఇస్తే సరేనని మౌనంగా తలవంచుకుని విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టింది… నేనలా కాదు… అర్ధాంగిగా నాకు నీ ఆస్తిలో అర్ధభాగం అంటే 2,750కోట్లు ఇస్తేనే సంతకం పెడతాను అని పేచీ పెట్టింది. స్థానిక కోర్టు, హై కోర్టు దాటి కేసు సుప్రీం కోర్టు దాకా తెగ తీగసాగింది.

ఈ కేసు విన్న న్యాయమూర్తులకు చిర్రెత్తుకొచ్చింది. ఈమధ్య చాలామంది మహిళలు భరణంగా ఇలాగే సగం లెక్కలు వేసి అడుగుతున్న విషయం గుర్తొచ్చింది. ప్రత్యేకించి ఈ కేసులో మొదటామెకు ఇచ్చినట్లు 500 కోట్లు అడిగినా బహుశా న్యాయమూర్తులు ఇంత ఇదయి ఉండేవారు కాదేమో! 2,750 కోట్ల భరణమా! ఏం వేళాకోళంగా ఉందా? వేల కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో తెలుసా? అడగడానికయినా ఒక హద్దుండద్దా! అని క్లాసు తీసుకున్నారు.

విడిపోయిన తరువాత తన మానాన తను గౌరవంగా, ఆర్థికంగా ఇబ్బందిపడకుండా సహేతుకమైన జీవన ప్రమాణంతో బతకడానికి ఇచ్చేదే భరణం కానీ… మాజీ జీవిత భాగస్వామితో సమానంగా ఆర్థిక స్థితి కల్పించడం కాదని సర్వోన్నత న్యాయమూర్తులు కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టంగా చెప్పారు.

ఆమెకు భరణంగా 12 కోట్లు చెల్లిస్తే సరిపోతుందని తీర్పునిస్తూ… అతడిపై ఆమె పెట్టిన అన్ని క్రిమినల్ కేసులను కూడా కొట్టేశారు. (ఆమె కోర్టుకెక్కకపోయి ఉంటే 500 కోట్లు వచ్చేవేమో పెరుమాళ్ళకే ఎరుక!)

విడాకుల తరువాత మాజీ భర్త దివాలా తీస్తే… మాజీ భార్య పెద్ద మనసుతో ఏమన్నా పదిపైసలు ఇస్తుందా? అని కూడా న్యాయమూర్తులు ప్రశ్నించారు. మాజీ భర్త ప్రస్తుత ఆర్థిక స్థితి దృష్ట్యా మాజీ భార్యకు జీవితాంతం భరణాన్ని లెక్కకట్టాల్సిన పనిలేదన్నారు. వివాహం కుటుంబానికి పునాదే తప్ప, కమర్షియల్ వెంచర్ కాదని బల్లగుద్ది మరీ చెప్పారు.

alimony

తాజాగా ముంబయ్ లో ఒక జంట విడిపోయారు. విడిపోయినప్పుడు మాజీ భార్యకు మాజీ భర్త ఇచ్చిన ఇల్లూ వాకిలి, భరణం మాజీ భార్యకు సరిపోలేదు. అంతంత ఆస్తులున్నాయి… ఇంతేనా ఇచ్చేది? అని సుప్రీం కోర్టు దాకా వెళ్ళి న్యాయ (?) పోరాటం చేసింది.

ఏమమ్మా! ఎంబిఏ చేశావు… ఐటీ రంగంలో మంచి హోదాలో ఉద్యోగం చేస్తున్నావు… గర్వంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం మానేసి ఇలా కోర్టుల చుట్టూ తిరగడమేమిటి? అంటూ ప్రధాన న్యాయమూర్తి హితవు చెప్పారు.

18 నెలలే కలిసి ఉన్నారు. 18 కోట్ల భరణం అడుగుతున్నావు. నెలకో కోటి చొప్పున లెక్కకట్టావా? అంటూ సున్నితంగా మందలించారు. మాజీ భర్త ముంబయ్ లో ఇవ్వదలుచుకున్న ఒక ఇల్లు కానీ, 4 కోట్ల రూపాయల భరణంలో ఏదో ఒకటి తీసుకోమని ఆదేశించారు.

భారతదేశంలో విడాకుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వైవాహిక వివాదాల న్యాయ పరిష్కార వేదిక (ఎండిఎల్ఆర్ఎఫ్) కేంద్రప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది.

alimony
# కొంతమంది మహిళలు పెళ్ళి, అనంతరం వేధింపుల కేసులు, విడాకుల వివాదాలతో భర్తకు నరకం చూపిస్తున్నారు.
# అలవిమాలిన కోరికలతో భరణాన్ని లెక్కకట్టి… కోర్టులకెక్కుతున్నారు.
# భార్యల హక్కులను రక్షించడానికి 498ఏ ఉన్నట్లు… భర్తల హక్కులు రక్షించడానికి 498బి కొత్తగా ప్రవేశపెట్టాల్సిన అవసరముంది.

# మూడు ముళ్ళు, ఏడడుగుల తరువాత కనీసం ఏడేళ్ళు కాపురం చేస్తేనే … విడాకుల తరువాత భరణం అడగడానికి అర్హులయ్యేలా భారతీయ న్యాయ సంహితలో మార్పులు చేయాలి.
# విడిపోయినవారి పిల్లలను అవసరమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంరక్షణలో పెంచాలి. ఈ ఖర్చులను ఆ తల్లిదండ్రులనుండి సమానంగా వసూలు చేయాలి.
# విడిపోతే ఎదురయ్యే సమస్యలు ఇంత తీవ్రంగా ఉంటాయా? అనిపించేలా చర్యలు తీసుకోవాలి.

పెళ్ళి మంత్రాల్లో ధర్మేచ… అర్థేచ… అంటే ఆర్థికసంబంధ విషయాలనుకుంటున్నారేమో ఈ మాజీ భార్యలు!………. – పమిడికాల్వ మధుసూదన్   9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వ్యతిరేక గొంతులో పచ్చివెలక్కాయ… రేవంత్‌‌పై కాంగ్రెస్ హైకమాండ్ హేపీ…
  • గాంధీ వారసుడా..? నిమిష రక్షణపై మన దేశ పరిమితులు తెలియవా..?!
  • రామోజీరావు టేస్టున్న మూవీస్ నిర్మిస్తున్న ఆ కాలంలో… ఓ ముత్యం..!!
  • ఎమోజి..! అదొక ఎమోషన్ సింబల్… అదుపు తప్పితే మర్డర్లే మరి..!!
  • ఇక్కడే కాదు, ప్రపంచమంతా ఇదే సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ల బురద…
  • ఓ శివుడి గుడి కోసం రెండు దేశాల యుద్ధం… అసలు కథ ఏమిటంటే..?!
  • ఓరేయ్ పిచ్చోడా… పెళ్లి సరే, భరణ భారం ఏమిటో తెలుసా నీకు..?!
  • ఓ ప్రాచీన శివాలయం కోసం రెండు బౌద్ధ దేశాల సాయుధ ఘర్షణ..!!
  • ధర్మం, చట్టం, న్యాయం… ముగ్గురు మిత్రులు అంటే ఇవే…!
  • సీఎం చెబుతున్నట్టు ఫోన్‌ట్యాపింగ్ చట్టబద్ధమే… కానీ షరతులు వర్తిస్తాయి..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions