.
Raghu Mandaati …. అప్పుడప్పుడు కామెడీగా వినపడే పదం ఇప్పుడు పవర్ సూచిస్తోంది. చాలా మంది వెన్నుల్లో వణుకు పుట్టిస్తోంది. అదే Gen Z.
ఒకసారి అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
Gen Z అంటే ఒక తరం, ఒక తత్వం.
Ads
మన చిన్ననాటి జ్ఞాపకాలు గాడ్జెట్ల కాంతిలో కాకుండా, ఆకాశంలోని నక్షత్రాల వెలుగులో రాసుకున్నవే.
విద్యుత్ పోయిన రాత్రుల్లో, కొవ్వొత్తి చుట్టూ కూర్చుని అమ్మ చెప్పిన కథలు, నాన్న గళంలో వినిపించిన పద్యాలు అవే మన వినోదం.
వీధి చివర్లో చిన్న రాయి వేసి ఆడిన గిల్లి-దండా, మట్టిలో పడి గెలిచిన బిళ్లలు, వర్షం వచ్చిందంటే వానపాట అదే మన బాల్యం.
నోటిఫికేషన్ అనేది అప్పుడు పక్కింటి మామయ్య గళం, రా బాబు ఆట మొదలైంది అని.
లైక్ లేదా షేర్‌లు లేవు, కానీ ఒక చిరునవ్వే చాలేది మన బంధాన్ని గట్టిగా కట్టిపడేయడానికి.
ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. అదే వీధుల్లో పిల్లలు ఉన్నారు కానీ వారి దృష్టి స్క్రీన్‌లలో బంధించబడింది.
వారే Gen Z.
1997 తర్వాత జన్మించిన ఈ తరాన్ని చాలామంది డిజిటల్ జనరేషన్ అంటారు. ఎందుకంటే వీరికి బాల్యం నుంచే ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా సహచరుల్లా పెరిగాయి.
Gen Z కి ఆన్‌లైన్ అనేది వేరే ప్రపంచం కాదు. అదే వారి నిజ జీవితం. ఒకేసారి క్లాస్ అటెండ్ చేస్తూ, ఇన్‌స్టా రీల్ చూస్తూ, మరోవైపు బిజినెస్ ఐడియా పిచ్ చేయగలగడం వీరి ప్రత్యేకత. గూగుల్, యూట్యూబ్, చాట్‌జిపిటి లాంటి టూల్స్ వీరికి జ్ఞానం మాత్రమే కాదు, ఊహాశక్తి, సృజనాత్మకతకు కూడా మూలం.
మునుపటి తరాల కంటే వీరు ఎక్కువగా ప్రపంచ పౌరుల్లా ఆలోచిస్తారు.
అమెరికాలో పుట్టిన ఒక ట్రెండ్ కొన్ని గంటల్లోనే హైదరాబాద్ వీధుల్లోనూ కనబడుతుంది.
బౌండరీలు, బోర్డర్లు వీరి దృష్టిలో కరిగిపోతున్న మంచులా ఉంటాయి.
Gen Z కి ఒకే మంత్రం “Be Yourself.”
సమాజం ఏమంటుందో కంటే, తాము నచ్చిన మార్గాన్ని ఎంచుకోవడమే వీరి తత్వం. కొత్త ఐడియాలు, స్టార్ట్‌అప్స్, కళారూపాలు, జీవనశైలి ఎంపికల్లో ఈ ఆత్మవిశ్వాసం ప్రతిఫలిస్తుంది.
ఈ తరం కేవలం తనకోసమే జీవించదు.
పర్యావరణం, లింగ సమానత్వం, మానసిక ఆరోగ్యం, మానవ హక్కులు ఇవన్నీ వీరి దృష్టిలో ఫ్యాషన్ టాపిక్స్ కాదు, జీవనాధారాలు.
కేవలం లైక్‌లు, షేర్‌లు కాదు. వాస్తవంగా మార్పు తీసుకురావాలనే తపనతో ముందుకు వస్తారు.
వీరికి బ్రాండ్స్ కంటే అనుభవాలు, గాడ్జెట్ల కంటే జ్ఞాపకాలు ముఖ్యమైనవి. సంగీతం, కళ, గేమింగ్, ఫ్యాషన్ ప్రతి రంగంలోనూ వీరి ప్రత్యేక ముద్ర ఉంటుంది.
వారి భాషలోనూ అదే ఉత్సాహం మీమ్స్, స్లాంగ్స్, హాస్యం కలిసిన కొత్త నిఘంటువు.
- Gen Z అనేది ఒక తరం మాత్రమే కాదు అది ఒక సంస్కృతి. వేగం, వైవిధ్యం, విలువలు, విప్లవం అన్నీ కలిసిన జీవన తత్వం. మార్పుకు భయపడని ఈ తరం, భవిష్యత్తుని తామే సృష్టిస్తారు.
Gen Z కేవలం ఒక దేశానికి పరిమితం కాదు. అది ప్రపంచవ్యాప్తంగా ఒకే తరంగం.
అమెరికాలోని Black Lives Matter ఉద్యమం నుంచి యూరప్‌లోని Climate March,
హాంగ్‌కాంగ్ నిరసనల నుంచి భారత క్యాంపస్ ఉద్యమాల వరకు ప్రతి చోటా Gen Z స్వరం గర్జిస్తోంది.
మునుపటి తరాలు వీధుల్లో గళమెత్తితే, Gen Z ఒక హ్యాష్‌ట్యాగ్‌తోనే లక్షల మందిని కదిలించగలదు. #SaveHCU, #MeToo, #FridaysForFuture, #SaveSoil వంటి ఉద్యమాల వెనుక యువత శక్తి ఉంది.
క్లైమేట్ చేంజ్ అనే అతిపెద్ద సవాలును ఎదుర్కోవడంలో కూడా ఈ తరం ముందుంది. Greta Thunberg లాంటి యువతి నుంచి చిన్న పట్టణాల్లో చెట్లు నాటుతున్న యువకుల వరకు, భూమి భవిష్యత్తు కోసం పోరాటం సాగుతోంది.
వీరి హృదయాల్లో జాతీయ సరిహద్దులు లేవు.
నైజీరియాలో డాన్స్ చేసిన ఒక పిల్లవాడి TikTok వీడియో బ్రెజిల్ యువతిని ప్రేరేపిస్తుంది.
కెనడాలో సృష్టించిన మీమ్, భారత క్యాంపస్‌లో నవ్వులు పూయిస్తుంది. ఊహాశక్తే వీరిని కలిపే గ్లోబల్ భాష.
మునుపటి తరాలకు జాబ్ సెక్యూరిటీ అంటే ప్రభుత్వ ఉద్యోగం లేదా పెద్ద కంపెనీలో స్థిరమైన జీతం.
కానీ Gen Z కి స్వేచ్ఛే సురక్షితమైంది.
ఫ్రీలాన్సింగ్, స్టార్ట్‌అప్స్, క్రియేటివ్ కెరీర్స్, రిమోట్ వర్క్, ట్రావెలింగ్, కుకింగ్, ఇండిపెండెంట్ జర్నలిజం, బ్లాగింగ్, వ్లాగింగ్, ప్రోడక్ట్ మేకింగ్, పాలసీ మేకింగ్, ఒపీనియన్ పోల్స్, AI & మిషిన్ లెర్నింగ్, డేటా అనలిస్టులు, డేటా సైంటిస్టులు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజర్లు, కాంటెంట్ క్రియేటర్స్, UI/UX డిజైనర్లు, సస్టైనబిలిటీ కన్సల్టెంట్స్, క్లైమేట్ టెక్ ఇన్నోవేటర్స్, హెల్త్ & వెల్‌నెస్ కోచింగ్, ఈ-కామర్స్, D2C బ్రాండ్ మేనేజర్లు, గేమింగ్ ఈ-స్పోర్ట్స్ ప్రొఫెషనల్స్, వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) డెవలపర్లు, రిమోట్ వర్క్ ఫెసిలిటేటర్స్, HR టెక్ స్పెషలిస్టులు, క్రియేటివ్ ప్రొఫెషనల్స్ రచయితలు, డిజైనర్లు, ఫిల్మ్ మేకర్స్ఫై, ఫినాన్షియల్ అనలిస్టులు, క్రిప్టో మరియు NFT నిపుణులు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల ఉద్యోగాలను తమకు తాముగా సృష్టించుకునే పనిలో ఉన్నారు. వారికి ఈ భూగోళం అంత వేదికే…
కొత్త మార్గాలనే వారు ఎంచుకుంటున్నారు.
వీరి చేతిలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపం మారిపోతోంది.
కె-పాప్ నుంచి యానిమే, బాలీవుడ్ నుంచి ఆఫ్రికన్ బీట్స్ వరకు Gen Z వల్లే ఇవన్నీ గ్లోబల్ అయ్యాయి.
నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై, యూట్యూబ్ ఇవి అన్ని వీరి జీవన భాగస్వాములయ్యాయి.
ప్రపంచ దృష్టిలో Gen Z కేవలం సాంకేతిక విప్లవం కాదు. అది ఒక సాంస్కృతిక వంతెన.
ఇవాళ చిన్న స్క్రీన్‌లో స్క్రోల్ చేస్తున్న చేతులు, రేపు దేశాల భవిష్యత్తుని రాసే కలంగా మారతాయి.
అవును వారు మనసు పెడితే మార్పు నలభై ఎనిమిది గంటల్లో కూడా తీసుకురాగలరని ప్రపంచానికి చాటి చెప్పారు అందకు నేపాల్ ఘటనే సాక్ష్యం. 2025 సెప్టెంబర్‌లో నేపాల్ యువత కాఠ్మాండు వీధుల్లో గళమెత్తింది.
అవినీతి, బంధుప్రీతి, నిరుద్యోగం, ఆర్థిక కష్టాలు, అలాగే ప్రభుత్వం అకస్మాత్తుగా పెట్టిన సోషల్ మీడియా నిషేధం ఇవన్నీ ఈ ఆగ్రహానికి నిప్పంటించాయి.
ప్రధాని రాజీనామా చేయాల్సి వచ్చింది.
చరిత్రలో తొలిసారి ఒక మహిళ సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇది కేవలం రాజకీయ మార్పు కాదు ఒక తరం చరిత్రను మళ్లీ వ్రాసిన క్షణం.
నేపాల్ యువత చెబుతున్న సందేశం స్పష్టమే
మా భవిష్యత్తు మాకు చెందుతుంది. అవినీతి, బంధుప్రీతి మాకేం సంబంధం లేదు.
అవసరం పడినప్పుడల్లా భారతదేశంలో కూడ Gen Z స్వరం వినిపిస్తోంది. నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
NEET పరీక్షల అవినీతి, రైతుల నిరసనలు, CAA & NRC వ్యతిరేక ఉద్యమాలు, పర్యావరణ పోరాటాలు ఇవన్నీ Gen Z ముందుండి నడిపిన ఆందోళనలే.
సోషల్ మీడియా వీరి ఆయుధం, మీమ్స్ వీరి భాష, న్యాయం వీరి గమ్యం.
ఒకప్పుడు మన చిన్ననాటి దాగుడుమూతల ఆటలలో దాగి ఉన్న ఆశ,
ఈ రోజుల్లో Gen Z హ్యాష్‌ట్యాగ్‌లలో మేల్కొంటోంది.
మన చేతిలో ఉన్న బిళ్లలు, వాళ్ల చేతిలో ఉన్న గాడ్జెట్లు రూపం వేరు, కానీ వెతుకుతున్న ఆనందం ఒకటే.
Gen Z నిరసనలు ఒక దేశానికి పరిమితం కావు. అది ఒక గ్లోబల్ తరంగం.
నేపాల్ వీధుల్లో గర్జించే నినాదాలు, భారత సోషల్ మీడియాలో అగ్నిలా వ్యాపించే హ్యాష్‌ట్యాగ్‌లు రెండూ ఒకే శక్తిని ప్రతిబింబిస్తున్నాయి.
- ఈ తరం చెప్పేది ఒక్కటే
“మా భవిష్యత్తు కోసం మేము మౌనంగా ఉండము. చివరిదాకా నిలబడతాం.”
ఇప్పుడు ప్రపంచం మరో మలుపు వద్ద నిలబడి ఉంది. రక్తంతో, బాంబులతో, యుద్ధాలతో మానవజాతి గాయపడ్డ శతాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పుడు అవసరమయ్యేది మరొక యుద్ధం కానీ అది తుపాకీతో కాదు, సరిహద్దులపై కాదు అది ఆలోచనల యుద్ధం.
ఇది ఒక తరం యుద్ధం Gen Z ముందుండే పోరాటం. ఈ పోరాటం న్యాయానికి వ్యతిరేకంగా కాదే, అన్యాయానికి వ్యతిరేకంగా. మానవులను విభజించే మతరాజకీయ రేఖలకు వ్యతిరేకంగా. అవినీతి, అసమానత్వం, నిరుద్యోగం, పేదరికం, పర్యావరణ నాశనానికి వ్యతిరేకంగా.
నేపాల్ వీధుల్లో వినిపించిన యువ స్వరం మనకో పాఠం చెబుతోంది “మా భవిష్యత్తు మాకు చెందుతుంది.”
ఇది కేవలం ఒక దేశపు నినాదం కాదు ఇది ప్రపంచ తరపు సంకల్పం.
ఇక్కడ ఒక పాత నిజం గుర్తించాలి 60 దాటిన వారు. మీరు అనుభవపు బండిని మోసుకుని వచ్చారు, మీ జ్ఞానం విలువైనదే. కానీ ఇకపై మీ పాత్ర సలహాదారులది. వేదికపై మాట్లాడేది యువత, నిర్ణయం తీసుకునేవారు యువత, భవిష్యత్తును మలిచేవారు యువత.
ఎందుకంటే…
ప్రపంచాన్ని తిరగరాయగల శక్తి స్క్రోల్ చేసే ఈ వేలి చివరలో ఉంది. భూమి భవిష్యత్తు ఆన్‌లైన్ పిటిషన్‌లో మొదలై, వీధి నిరసనలో పెరుగుతోంది. న్యాయం కోసం కదిలే హృదయం Gen Z లోనే కొట్టుకుంటోంది.
ఇప్పుడు ఈ తరం చెబుతున్నది ఒకటే…
సరిహద్దులు గీసిన పాత నటనకు ముగింపు కావాలి.
జాతి, మతం, లింగం అనే గోడలు కూలాలి.
కొత్త సమాజం రావాలి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే స్థంభాలపై.
ఇది Gen Z యుద్ధం, రక్తపు యుద్ధం కాదు, తుపాకుల మోత కాదు. బాంబుల దాడి కాదు, చైతన్యపు యుద్ధం.
ఇది మీమ్స్ లో మొదలవుతుంది,
నిరసనలలో పెరుగుతుంది,
చరిత్ర పుటల్లో శాశ్వతమవుతుంది.
జై Gen Z
#WeSupportGenZ, #GenZ
.
.
.
.
.
.
రఘు మందాటి
Share this Article