Bharadwaja Rangavajhala……… హీరో కాదు విలనూ కాదు నటుడు… కారక్టర్ ఆర్టిస్ట్ గిరిబాబు బర్త్ డే ఈ రోజు. హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చి విలనై, ఆ తర్వాత నిర్మాతై, దర్శకుడై, కారక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయి, ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్న గిరిబాబుకు ముందుగా బర్త్ డే విషెస్ చెప్పేసి … ఈ మాటంటే ఆయన ఒప్పుకోరు … కారక్టర్ ఇస్తే ఎందుకు చేయనూ అంటారనుకోండి … ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఓ పాలి సినిమా ప్రయాణాన్ని ఓ సారి గుర్తు చేసుకుందారి అనిపించింది …
తెలుగు తెర మీద కొత్త తరహా చిత్రాలు రావాలని తపన పడే నటుడుగా మాత్రం గిరిబాబు గుర్తుండిపోతారు. గిరిబాబు మంచి నటుడు. చక్కటి టైమింగ్ ఉన్న కమేడియన్ కూడా. రంగస్థలానుభవం ఉండడంతో ఏ పాత్రైనా తను జీవించేయగలడు. అందుకే తను ఆ రోజుల్లో కెఎస్ఆర్ దాస్ లాంటి డైరక్టర్లకు నచ్చాడు. ఈ రోజుల్లో కృష్ణవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి డైరక్టర్లకూ నచ్చుతున్నాడు. వయసు మీద పడి కాస్త నటన తగ్గించినా ఇప్పటికీ ఆయన వైపు ఆశగా చూసే డైరెక్టర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
డెబ్బై దశకం మధ్య నాటికి అప్పటికి పాపులర్ విలన్ సత్యనారాయణ విలనీ తగ్గించుకుని కారక్టర్ రోల్స్ వైపుగా మళ్లుతున్న సందర్భం. ఇండస్ట్రీకి కొత్త కుర్ర విలన్ల అవసరం బలంగా ఉన్న టైమ్ కూడా అది. సరిగ్గా అలాంటి సమయంలో ఎంట్రీ ఇచ్చాడు గిరిబాబు. తొలి చిత్రంలోనే విలన్ గా నటించాడు. ఆ నటించడం కూడా చాలా కాన్ఫిడెన్సుగా నటించాడు. అంతే … వరసపెట్టి ఏడెనిమిది సినిమాల్లో విలన్ పాత్రలు అతని కోసం క్యూకట్టాయి. వాటిలో బంగారు కలలు భారీ సినిమా. అందులో విలన్ వేషం అక్కినేనికి ఆపోజిట్ లో చేసి రక్తి కట్టించడంతో ఇక వెనుతిరిగి చూడలేదు.
Ads
తెలుగుతెరకు ఆర్.నాగేశ్వరరావు తర్వాత గ్లామరస్ విలనీని పరిచయం చేసిన వాడు గిరిబాబు. రాజనాల సత్యనారాయణలు కాస్త క్రూయల్ గానే అనిపించేవారు. గిరిబాబు తర్వాత వచ్చిన మోహన్ బాబు కూడా కొంతలో కొంత గ్లామర్ , క్రూయాలిటీ మిక్స్ చేసి నడిపించేవాడు. గిరిబాబు మాత్రం చివరి వరకూ గ్లామరస్ విలనీతోనే రాణించాడు. అది కూడా తెలుగు తెరమీద గిరిబాబు సాధించిన ప్రత్యేకతే.
గిరిబాబు విలన్ గా అడుగుపెట్టినప్పుడు పాపులర్ మాస్ హీరోలు ఎన్టీఆర్ కృష్ణలు. ఎన్టీఆర్ సినిమాల్లో సాధ్యమైనంత వరకు సత్యనారాయణ విలన్ వేసేవారు. ఆప్షనల్ గా మాత్రం గిరిబాబుకు అవకాశం వచ్చేది. కానీ కృష్ణ సినిమాల్లో మాత్రం విలన్ గానో విలన్ కొడుకుగానో గిరిబాబు తప్పనిసరిగా ఉండాల్సిందే అన్నట్టుండేది పరిస్థితి. మోహన్ బాబు విలనీలో సెటిలయ్యే వరకు పోటీలేని కుర్ర విలన్ గిరిబాబు.
గిరిబాబు అసలు పేరు శేషారావు. ఊరు ప్రకాశం జిల్లా రావినూతల. ఒక్కగానొక్క కొడుకు కావడంతో చిన్నతనమంతా పిల్లజమిందార్ లా గడిచిపోయింది. ఏ బాధ్యతా లేకుండానే ఇరవై ఏళ్లు వచ్చేశాయి. చదువు కూడా పియుసిని మించి నడవలేదు. ధారా రామనాధశాస్త్రిగారి పుణ్యాన నటనానుభవం వచ్చింది. దాంతో ఊళ్లోనే సొంతంగా నాటక సమాజం పెట్టి కథ నడిపించడం మొదలెట్టారు.
నాటకాలను డైరక్ట్ చేసిన అనుభవంతోనే సినిమా రంగంలోనూ దర్శకుడనిపించుకున్నారు గిరిబాబు. గిరిబాబు సినీనటుడు కావాలనే ప్రయత్నాలు ప్రారంభించింది ఆదుర్తి సుబ్బారావుగారి తేనెమనసులు రోజులలోనే. కానీ అవి సాకారం కాలేదు. ఆ తర్వాత కూడా జి.వరలక్ష్మి, ఎస్.డిలాల్ లాంటి ఉద్దండుల చిత్రాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి పోయాయి.
మన నొసట సినిమా రాత లేదనుకుని వెనక్కొచ్చేసిన సమయంలో అట్లూరి పూర్ణచంద్రరావు నుంచీ హీరో పాత్ర కోసం పిలుపొచ్చింది. అది పాక్షికంగానే గిరిబాబు కోరికను నెరవేర్చినా … జనం తనకి హీరోగా బ్రహ్మ రథం పట్టిన చిత్రం మాత్రం దేవతలారా దీవించండి. గిరిబాబు సీరియస్ గా సినిమా ప్రయత్నాలు ప్రారంభించేనాటికే ఆయనకి ముగ్గురు పిల్లలు.
అనేక ప్రయత్నాలు అనంతరం … తల్లిదండ్రులతో భారీగా గొడవ పడేలా పరిస్థితి దిగజారిన తర్వాత…. సినిమా అనే మాట వింటేనే ఒళ్లు మండిపోయేంత ఎవర్షను వచ్చేసిన తర్వాత వచ్చిన అవకాశం జగమేమాయ. 1972 జై ఆంధ్ర ఉద్యమం రోజుల్లో అట్లూరి పూర్ణచంద్రరావు తీసిన సినిమా జగమేమాయలో హీరోగా గిరిబాబుకు పిలుపు వచ్చింది. అయితే ఆఖరి నిమిషంలో ఆ పాత్ర మురళీమోహన్ కు వెళ్లి తనకు శ్రీకాంత్ అనే తమిళ నటుడు చేయాల్సిన విలన్ వేషం వచ్చింది.
అప్పటి తన పరిస్థితిలో ఏదో ఒక వేషం వేసేయాలని నిర్ణయించుకున్నారు గిరిబాబు. జగమేమాయ సినిమా గిరిబాబుకు తొలి చిత్రమే అయినా తనలో ఎక్కడా ఆ కొత్తదనం కనిపించదు. చాలా అనుభవం ఉన్న నటుడులాగానే విలనీ పండించారాయన. హీరోగా మురళీమోహన్ అయినా తడబడ్డట్టు కనిపించాడేమోగానీ గిరిబాబు మాత్రం సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించారు. అలా తన సినీకెరీర్ కు వచ్చిన అవకాశం ద్వారా బంగారుబాటను వేసుకున్నారు.
తను విలన్ అయిన కొత్తలోనే మోహన్ బాబు నుంచీ గట్టి పోటీ ఎదుర్కొన్నారు గిరిబాబు. అయితే ఆ తర్వాత మోహన్ బాబు కూడా హీరోగా టర్న్ అయిన తర్వాత మళ్లీ గిరిబాబుకు విలన్ గా గిరాకీ పెరిగింది. అప్పటికి సత్యనారాయణ పూర్తిగా విలన్ వేషాల నుంచీ నిష్క్రమించడంతో రావుగోపాల్రావు అల్లు రామలింగయ్యలతో కలసి గిరిబాబు విలనీ షేర్ చేసుకున్నారు.
నిజానికి గిరిబాబూ మోహన్ బాబూ ఇద్దరూ తొలి రోజుల్లో ఒకే గది షేర్ చేసుకున్నారు కూడా. చిరంజీవి హీరోగా నిలదొక్కుకునే క్రమంలో కూడా గిరిబాబే విలన్. ఇలా ఎన్టీఆర్ నుంచీ ప్రారంభించి చిరంజీవి , నాగార్జున, వెంకటేశ్ ల వరకు హీరోలతో తన్నులు తినే విలన్ గా గిరిబాబే నటించారు.
విలన్ గా సత్యనారాయణ తర్వాత లాంగెస్ట్ కెరీర్ నడిపించింది గిరిబాబే. చిరంజీవి సూపర్ హిట్ చిత్రాలు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, దొంగమొగుడు చిత్రాల్లో గిరిబాబు చేసిన పాత్రలు కాస్త డిఫరెంట్ గా అనిపిస్తాయి. తొలి రోజుల నాటి డిజప్పాయింట్ మెంట్లను గిరిబాబు ఎన్నడూ మరచిపోలేదు. అందుకే తన దగ్గరకు వచ్చిన ఏ పాత్రనూ కాదనలేదు. దాని పొడుగెంత? వెడల్పెంత అనే కొలతల జోలికి పోకుండా తన మీద ఏ నమ్మకంతో అయితే వచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోడానికి తానేం చేయాలని మాత్రమే ఆలోచించేవారు. అందుకే లిటిల్ సోల్జర్స్ తదితర చిత్రాల్లో సైతం హాయిగా నటించేశారు.
నటుడుగా బిజీగా ఉన్న రోజుల్లోనే నిర్మాత కావాలనే కోరిక కలిగింది గిరిబాబుకి. దీనికి కారణం దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు చెప్పిన ఓ లైను నచ్చడమే. నటుడుగా ఎంట్రీ ఇచ్చిన నాలుగేళ్లలోనే నిర్మాతగా మారడం ఓ సంచలనమే. చిన్నతనంలో తనకు బాగా నచ్చిన అక్కినేని చిత్రం జయభేరి. ఆ చిత్రం టైటిల్ నే తన బ్యానర్ మకుటంగా మార్చుకున్నారు.
తన మిత్రులు మాగంటి వెంకటేశ్వరరావు తదితరుల మద్దత్తుతో నిర్మాతగా తొలి చిత్రం దేవతలారా దీవించండి ప్రారంభించారు గిరిబాబు. అప్పటికి విలన్ గా నలభై తొమ్మిది చిత్రాలు కంప్లీట్ చేశారు. తన యాభయ్యవ చిత్రంగా స్వీయ నిర్మాణసారధ్యంలో హీరోగా టర్న్ అవుతూ తీసిన సినిమా అది. గిరిబాబు ప్రత్యేక పాత్ర పోషించిన ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. బ్లాక్ అండ్ వైట్ లో స్కోప్ లో తీయడం ఈ చిత్ర విశేషాల్లో ఒకటి.
పంపిణీ దారులు కాదన్నా కొమ్మినేని శేషగిరివావునే దర్శకుడుగా పెట్టి దేవతలారా దీవించండి తీసి విజయం సాధించిన గిరిబాబు ఆ వెంటనే ఓ భారీ చిత్ర నిర్మాణానికి నడుం బిగించారు. సినిమా పేరు సింహ గర్జన. కథ గిరిబాబుదే. ఇద్దరు హీరోల ఈ సినిమాలో ఒక హీరోగా తనే నటించారు. ప్రదాన హీరో పాత్రకు కృష్ణను తీసుకున్నారు. సింహబలుడు చిత్రానికి పోటీగా విడుదలైన సింహగర్జన మంచి విజయాన్నే సాదించింది. ఆర్ధికంగా లాభాలను తెచ్చింది.
సింహగర్జన టైమ్ లో ఎవరో చెప్పిన మాటలు విని ఆగ్రహించిన ఎన్టీఆర్ ను మొహమాటం లేకుండా కలిసి తన సినిమా కథ చెప్పి మీ సినిమాకూ మా సినిమాకూ ఎటువంటి పోలికా లేదని చెప్పగానే ఆయన వెంటనే కన్విన్స్ అయిపోయి వెళ్లి హ్యాపీగా సినిమా చేసుకోండనేశారు. ఎన్టీఆర్ తో అది మరచిపోలేని అనుభవం అంటారు గిరిబాబు.
జయభేరి సంస్ధ మురళీమోహన్ కు అప్పగించి తాను మాధవీ పేరుతో మరో బ్యానర్ ప్రారంభించారు గిరిబాబు. ఆ బ్యానర్ మీద ముద్దుముచ్చట, సంధ్యారాగం లాంటి సినిమాలు తీశారు. కుమారుడు బోస్ బాబును హీరోగా పరిచయం చేస్తూ తీసిన ఇంద్రజిత్ సినిమా నిర్మాతగా గిరిబాబు చివరి చిత్రం అని చెప్పాలి. ఆ సినిమా యాభై రోజుల పాటు నడిచినా కమర్షియల్ గా పెట్టిన ఖర్చు రాబట్టడంలో మాత్రం విఫలమయ్యింది.
విచిత్రంగా హీరోను చేయాలనుకున్న చిన్న కొడుకు తగిన విజయం ఇవ్వకపోయినా … పెద్ద కొడుకు రఘుబాబు మాత్రం కారక్టర్ ఆర్టిస్టుగా చాలా పెద్ద సక్సస్ కొట్టాడు. తండ్రి పేరు నిలబెట్టాడు. తండ్రిగా ఇది గిరిబాబును సంతోషపెట్టే విషయం. గిరిబాబు కారక్టర్ రోల్స్ వైపు కామెడీ వేషాల వైపూ టర్న్ ఇచ్చాక తనను బాగా ఉపయోగించుకున్న దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. నిన్నే పెళ్లాడుతాలో పెళ్లికాని బాబాయ్ పాత్రలో గిరిబాబు అద్భుతంగా ఇమిడిపోయారు.
ఆ తర్వాత కృష్ణవంశీ తీసిన చాలా సినిమాల్లో ఆయన స్పార్క్ ఉన్న వేషాలే వేశారు. ముఖ్యంగా ఖడ్గంలో సినిమా నిర్మాతగా హీరోలతో విసిగివేసారే సన్నివేశంలో ఆయన నటన అత్యంత సహజంగా ఉంటుంది. ఎనిమిది పదుల వయసులోనూ యాక్టివ్ గా ఉండే గిరిబాబు ఇప్పటికీ ఎవరైనా పిలిస్తే నటించడానికి ఉత్సాహం చూపిస్తారు . అలాగే ఎవరు వచ్చి ఇంటర్యూ అడిగినా ఇచ్చేస్తూ ఉంటారు … అనేక విషయాలు చెప్పేస్తూ ఉంటారు గిరిబాబు…
Share this Article