మనం నారీశక్తి అని అప్పుప్పుడూ కొందరి గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా… ఈమె గురించి ఓసారి చదవాలి… ఈమె పేరు టెస్సీ థామస్… కేరళ, అలప్పుజలోని ఓ మలబార్ క్యాథలిక్ కుటుంబంలో పుట్టింది… నలుగురు అక్కచెల్లెళ్లు, ఒక సోదరుడు… పెరట్లో పారే బ్యాక్ వాటర్స్… ప్రకృతి ఒడిలో పెరిగింది… ఆరుగురు పిల్లలైనా సరే, అందరికీ మంచి చదువు చెప్పించాలని తల్లి ప్రయత్నం…
మదర్ థెరిస్సా పేరు ధ్వనించేలా టెస్సీ అని పెట్టుకుంది ఈ బిడ్డకు… చిన్నప్పటి నుంచే చదువులో చురుకు… బీటెక్‌లో చేరాక ఎస్‌బీఐ ఆమెకు నెలకు 100 రూపాయల చొప్పున లోన్ ఇచ్చింది… స్కాలర్ షిప్ డబ్బు హాస్టల్ ఖర్చులకు సరిపోయేవి… తరువాత ఎంటెక్… తరువాత ఎంబీఏ… డీఆర్‌డీవోలో చేరాక క్షిపణుల ప్రోగ్రాంలో సైంటిస్టుగా కొలువు… త్వరత్వరగా రాకెట్, మిసైల్ పరిజ్ఞానంలో ఆరితేరింది…
Ads
ఆమె మెరిట్ చూశాక మన రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం ఓసారి ఆమెకు ఓ లక్ష్యాన్ని నిర్దేశించాడు… ఒకేసారి పలు న్యూక్లియర్ హెడ్స్ మోసుకుపోయి, టార్గట్లను ఛేదించగల మిసైల్ రూపొందించాలనేది ఆ లక్ష్యం… MIRV… నువ్వుయితేనే సాధించగలవు అని మోటివేట్ చేశాడు… ఆమె చేరేనాటికే అగ్ని మిసైల్ ప్రయోగాలు సాగుతున్నాయి… మొదట్లో అసోసియేట్ ప్రాజెక్టు డైరెక్టర్… తరువాత అగ్ని-4 వచ్చేసరికి ఆమే ప్రాజెక్టు డైరెక్టర్… 2011లో సక్సెస్ ఫుల్…
తరువాత అగ్ని-5… 2012లోనే తొలి పరీక్ష… నేడు సక్సెస్ ఫుల్ లాంచింగ్… ఈ ఆగ్నేయాస్త్రమే కలాం కలలు గన్న దివ్యాస్త్రం… అదీ స్వదేశీ పరిజ్ఞానంతో… స్వదేశంలోనే తయారీ… ఆత్మ నిర్భర భారత్ కింద… ఇప్పుడు చైనా సహా యావత్ ఆసియా మన అణ్వస్త్రాల పరిధిలోకి వచ్చింది… ఇప్పటికి నాలుగైదు అగ్రదేశాల చేతుల్లో మాత్రమే ఉన్న ఈ పరిజ్ఞానం మనకూ సొంతం…
ఆరేడు వేల కిలోమీటర్ల పరిధి… భూకక్ష్యలోకి రీఎంట్రీ పరిజ్ఞానం… ఒకేసారి పలు వార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం… జస్ట్ ఫైర్ ఇట్, ఫర్ గెట్ ఇట్… దాని ప్రాజెక్టు డైరెక్టర్‌గా టెస్సీ తన గురువు కలాం పెట్టిన లక్ష్యాన్ని చేధించింది… ఇప్పుడామె డీఆర్డీవో ఏరోనాటికల్ సిస్టమ్స్‌కు డైరెక్టర్ జనరల్… ఇండియన్ నేవీలో కమాండర్ సూరజ్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది, కొడుకు పేరు తేజస్ అని పెట్టుకుంది… తేజస్ అంటే తెలుసు కదా, మన యుద్ధవిమానం… అసలు ఇలాంటివాళ్లకు ఇస్తేనే కదా, పద్మ పురస్కారాలకు వెలుగు, సార్థకత..!! డాక్టర్ టెస్సీ థామస్… మీకు ‘ముచ్చట’ అభినందనలు..!!
Share this Article