టాటా అంటే నాణ్యత… టాటా అంటే నమ్మకం… టాటా అంటే ఔదార్యం… టాటా అంటే ఉపాధి… టాటా అంటే భారతీయం… టాటా అంటే విశ్వసనీయత… ఎన్నెన్నో పర్యాయపదాలు… సింపుల్‌గా చెప్పాలంటే టాటా అంటే ఇండియా పారిశ్రామిక ముఖచిత్రం… ఆ గ్రూపును అలా తీర్చిదిద్దినవాడు రతన్ టాటా…
మన వ్యవస్థ విషాదం ఏమిటంటే..? మనం ఎంతో గొప్పగా చెప్పుకోదగిన పరిపూర్ణ జీవితం గడిపిన రతన్ టాటాకు పద్మవిభూషణే తప్ప భారత రత్న ఇవ్వలేకపోయాం… పలుసార్లు రాష్ట్రపతి పదవికి ఈ సర్వ ఆమోదయోగ్య వ్యక్తిని ఎందుకు ఆలోచించకూడదు అనే వాదనలు, అభిప్రాయాలు కూడా వినవచ్చాయి… దటీజ్ టాటా…
Ads
అవును, ఆయనది పార్శి కుటుంబం… తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోతే బామ్మ దత్తత తీసుకుని మరీ పెంచింది… వ్యాపారిగా తన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఓ కుటుంబ వ్యాపారంలా నడిచే ఆ గ్రూపులో ఓ దిగువ స్థాయి పోస్టులో చేరాడు… క్రమేపీ పలు హోదాలకు ఎదిగి, గ్రూపును అనేక రంగాల్లోకి విస్తరించి, ఓ పటిష్టమైన గ్లోబల్ వ్యాపార సంస్థలా మార్చింది తనే… టాటా అంటే కేవలం వ్యాపారమే కాదు… తన ఆదాయంలో ఎక్కువ శాతం సామాజికసేవకు, దాతృత్వానికి వెచ్చించే గొప్ప వితరణశీలి…
సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు… గుండుసూది నుంచి విమానాల వరకు… టాటాలు అడుగుపెట్టని రంగం లేదు… ఇండియన్ ఇండస్ట్రీ అంటేనే టాటా… అంతే… బోలెడు మంది ఆదానీలు, అంబానీలు వ్యాపారరంగంలో ఉండవచ్చుగాక… కానీ రతన్ టాటా ఒక్కడే… తనొక భిన్నమైన వ్యక్తి… ప్రస్తుతం ఈ గ్రూపు సంస్థల మార్కెట్ క్యాప్ 34 లక్షల కోట్ల రూపాయలని ఓ అంచనా…
తను బ్రహ్మచారి… పెళ్లి లేదు, పిల్లల్లేరు… అపారమైన ఆస్తులున్న ఆ గ్రూపు వారసత్వ పగ్గాలు ఎవరు చేపడతారనేది ఆసక్తికరమైన ప్రశ్న… ఆయన సవతి సోదరుడు నోయల్ నావెల్‌కు ముగ్గురు పిల్లలు…లియా, మాయా, నెవిల్లే… వీరిలో లియా, మాయా ఆడపిల్లలు, నెవిల్లే పురుషుడు… ప్రస్తుతం టాటా గ్రూపులోనే వివిధ బాధ్యతల్లో ఉన్నారు… టాటా వీలునామాలో ఏముందో చూడాలిక… బిజినెస్ సర్కిళ్లలో మాయా టాటా పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది…
నిజానికి టాటా గ్రూపులో అధికశాతం షేర్లు ఆ గ్రూపుకి చెందిన చారిటబుల్ ట్రస్టుల పేర్లతో ఉన్నాయి… ఆయన పేరిట ఉన్న షేర్లకు వారసులు ఎవరనేదే ప్రశ్న… తను పెళ్లెందుకు చేసుకోలేదు..? చాన్నాళ్లుగా చాలామంది చాలా రాశారు… ఓసారి తనే చెప్పాడు… నాలుగుసార్లు పెళ్లి దాకా వచ్చి, ఏదో ఓ కారణంతో అనివార్యంగా వెనక్కి వచ్చాడుట…
అమెరికాలో ఒకామెను ప్రేమించాడు… 1961-62 నాటి ముచ్చట… పెళ్లి అనే సమయానికి ఇండో-చైనా యుద్ధం… ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇండియాకు పంపించడానికి ససేమిరా అన్నారు… మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయమై, పెళ్లి పత్రికలు ముద్రించే దశ దాకా వెళ్లింది… కానీ అదీ ఆగిపోయింది… అంతే, ఇక తను పెళ్లి మాటే ఎత్తలేదు… 2017 లోనే తను గ్రూపు చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుని నటరాజన్ చంద్రశేఖరన్‌కు అప్పగించాడు…
ఫిజిక్స్ అంటే ఇష్టం… ఇంట్రావర్ట్… ఏ ఆట మీదా ఆసక్తి ఉండేది కాదు… ఎక్సట్రా క్లరికల్ యాక్టివిటీల్లోనూ పాల్గొనేవాడు కాదు… అసలు అమెరికాలో ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేయగలనా అనుకునేవాడట చాలాసార్లు… ఇండియాకు కూడా తిరిగి రావాలని అనుకోలేదు… కానీ పెంచిన బామ్మ అనారోగ్యం కారణంగా ఇండియాకు వచ్చి, అనివార్యంగా కుటుంబ వ్యాపారాన్ని చేపట్టాల్సి వచ్చింది… ఈ విశిష్ట వ్యక్తి 86 సంవత్సరాల వయస్సులో నేడు కన్నుమూశాడు..! భారతీయ పారిశ్రామిక చరిత్రలో ఖచ్చితంగా తనదో బంగారు అధ్యాయం..!!
Share this Article