మూడు కోట్ల జనాభా ఉన్న పంజాబ్‌లో తొలి దళిత (ఎస్సీ–రాందాసియా–చమార్) సిక్కు చరణ్ జీత్ సింగ్ చన్నీ సోమవారం ప్రమాణం చేస్తున్నారు. అది కూడా కాంగ్రెస్ తరఫున, ఇంకా ఈ పదవిలో ఆరు నెలలు ఉండడానికి మాత్రమే. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు సీఎంను మార్చి జనాన్ని మాయ చేయాలని ప్రయత్నించి విఫలం కావడంలో– దేశంలో గొప్ప ముదుసలి పార్టీగా (గ్రాండ్ ఓల్డ్ పార్టీ–జీఓపీ) పేరు మోసిన కాంగ్రెస్‌కు విస్తృత అనుభవం ఉంది. పంజాబ్ జనాభాలో దాదాపు 30 శాతం అనుసూచిత కులాలవారే. (ఈ ఎస్సీల్లో సిక్కులూ, హిందువులూ ఉంటారు). కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన బడా దళిత–చమార్ సిక్కు బూటాసింగ్ అప్పట్లో కాంగ్రెస్ తరఫున సీఎం కాలేకపోయారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరించిన పదేళ్లకు ఉమ్మడి పంజాబ్ చీలిపోయి పంజాబీ మాట్లాడేవారితో ప్రస్తుత చిన్న పంజాబ్ (కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌తో కలిసి 14 లోక్‌సభ సీట్లే) ఉనికిలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అంటే దాదాపు ఈ 55 ఏళ్లలో 11 మందీ సిక్కులే ముఖ్యమంత్రులయ్యారు. వారిలో ముగ్గురు అకాలీదళ్‌కు చెందిన నేతలు గుర్నామ్‌సింగ్, ప్రకాశ్‌సింగ్ బాదల్, సుర్జీత్‌సింగ్ బర్నాలా. అకాలీ సీఎంలు ముగ్గురూ జాట్ సిక్కులే. మిగిలిన 9 మంది కాంగ్రెస్ సీఎంలలో ఇద్దరు (మొదటి సీఎం గ్యానీ గుర్ముఖ్‌సింగ్ ముసాఫిర్, గ్యానీ జైల్‌సింగ్) మాత్రమే జాట్ కులానికి చెందని సిక్కులు. ముసాఫిర్ ఖత్రీ (క్షత్రియ) సిక్కు కాగా, జైల్‌సింగ్ రామ్‌గఢియా సిక్కు (ఓబీసీ–స్వర్ణకార, వండ్రంగి వృత్తిగల సిక్కు). అంటే మొత్తం 11 మంది ముఖ్యమంత్రుల్లో ఇద్దరు మాత్రమే జాటేతర సిక్కులు. జాట్లు మన రెడ్డి, కమ్మలాగా వ్యవసాయాధారిత కులం అనే వేరే చెప్పాల్సిన పనిలేదు. పంజాబ్‌లో రైతు అనే మాటకు సమానార్ధకంగా జాట్ అనే పదం వాడతారు.
Ads
ఇప్పటి ఆంధ్రప్రదేశ్ మాదిరిగా 1966 నవంబర్‌న బక్కచిక్కిన అవశేష పంజాబ్ మొదటి సీఎంగా కాంగ్రెస్ తరఫున పైన చెప్పినట్టు గ్యానీ గుర్ముఖ్ సింగ్ ముసాఫిర్ అయ్యాక 127 రోజులకు గద్దెదిగాల్సి వచ్చింది. 1967 మార్చి ఎన్నికల్లో మరో 9 రాష్ట్రాలతో పాటు పంజాబ్ ప్రజలూ కాంగ్రెస్‌ను ఓడించారు. దాంతో అకాలీదళ్ నేత, మొదటి జాట్ సిక్కు జస్టిస్ గుర్నామ్ సింగ్ మిత్రపక్షాల మద్దతుతో (కాంగ్రెస్‌ను పాతరేయడానికి భిన్న సిద్ధాంతాలున్న కమ్యూనిస్టులు, భారతీయ జనసంఘ్ కలిశాయి) సంకీర్ణ సీఎం అయ్యారు. ఆయన తర్వాత సీఎంలు అయిన లచ్మన్ సింగ్ గిల్ (కాంగ్రెస్ మద్దతు ఉన్న అకాలీ తిరుగుబాటుదారు), ప్రకాశ్‌సింగ్ బాదల్ (శిరోమణి అకాలీదళ్) ఇద్దరూ కూడా జాట్ సిక్కులే. తర్వాత 1972 మార్చి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ (ప్రధాని ఇందిరాగాంధీ) ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా పంజాబ్‌లో ముఖ్యమంత్రి ఎంపికలో ప్రయోగం చేసింది. సిక్కు గ్రంథాలు, కీర్తనలు బాగా చదవి కంఠస్థం చేసిన గ్యానీ జైల్ సింగ్‌ను (ఇప్పటి వరకూ ఏకైక ఓబీసీ సీఎం) ముఖ్యమంత్రి గద్దెనెక్కించింది. రాజకీయ, పాలనా సామర్ధ్యం ఉన్న జైల్‌సింగ్ ఐదేళ్ల 44 రోజులు సీఎం పదవిలో కొనసాగి అవశేష పంజాబ్ రాష్ట్రంలో రికార్డు సృష్టించారు. (1982–87 మధ్య భారత రాష్ట్రపతిగా పనిచేసిన గ్యానీజీ చివరి నెలల్లో అప్పటి కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ గాంధీకి బోఫోర్స్ కుంభకోణం కారణంగా ముచ్చెమటలు పట్టించిన విషయం మా తరం వారికి ఇంకా గుర్తుంది)
1977 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత అకాలీదళ్ తరఫున ప్రకాశ్‌సింగ్ బాదల్ మరోసారి సీఎం అయ్యారు. ఇక ఆయన తర్వాత ముఖ్యమంత్రులైన దర్బారాసింగ్, సుర్జీత్ సింగ్ బర్నాలా, బియాంత్ సింగ్, హర్ చరణ్ సింగ్ బరాఢ్, రాజిందర్ కౌర్ భట్టల్ (బర్నాలా తప్ప మిగిలిన నలుగురూ కాంగ్రెస్ వారే) –వారందరూ జాట్ సిక్కులే. 2002 నాటికి మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన జాట్ సిక్కు ప్రకాశ్ సింగ్ బాదల్ తర్వాత కాంగ్రెస్ తరఫున కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఐదేళ్ల మూడు రోజులు–అంటే పూర్తి పదవీకాలం సీఎం పదవిలో కొనసాగారు. ఆ తర్వాత నాలుగోసారి సీఎం అయిన బాదల్ 2007 నుంచి 2017 వరకూ పదేళ్ల 15 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని ఆల్‌టైమ్ రికార్డు సృష్టించారు. అలాగే అంతకు ముందు కాంగ్రెస్ తరఫున ఐదేళ్లు పూర్తి చేసుకున్న సీఎంలుగా జైల్ సింగ్, అమరీందర్ సింగ్ రికార్డుల్లోకి ఎక్కారు. అయితే, 2017 లో 75 ఏళ్లు నిండుతున్న సమయంలో చివరిసారి ముఖ్యమంత్రి అయిన అమరీందర్ ఈసారి ఐదేళ్లు పూర్తిచేయకుండా నాలుగేళ్ల 187 రోజులకు పార్టీ›నాయకురాలు సోనియాగాంధీ ఆదేశాలతో రాజీనామా చేయాల్సి వచ్చింది.
మొదట లోక్‌సభ మాజీ స్పీకర్, కేంద్ర మాజీ మంత్రి, హిందూ జాట్ కాంగ్రెస్ నేత బలరామ్ జాఖఢ్ కొడుకు, పీసీసీ నేతగా పనిచేసిన సునీల్ జాఖఢ్ తొలి హిందూ సీఎం అవుతారని శనివారం వార్తలొచ్చాయి. అయితే, పటియాలా సంస్థానం మాజీ యువరాజు కూడా అయిన 79 ఏళ్ల అమరీందర్ కొత్త పార్టీ పెట్టకుండా ఆపడానికి అన్నట్టు తొలి దళిత సిక్కు చరణ్ జీత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసి కాంగ్రెస్ గొప్స సాహసం చేసి, అనూహ్యమైన రాజకీయ జూదానికి తెరతీసింది. 58 ఏళ్ల రాందాసియా (ఎస్సీ) సిక్కు అయిన చన్నీ స్వాతంత్య్రం వచ్చాక పుట్టిన తొలి పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు. పంజాబ్ జానాభాలో దళితులు దాదాపు 30 శాతం వరకూ ఉన్నారు. వారిలో చర్మకార వృత్తి మూలాలున్న రవిదాసియా లేదా రాందాసియా సిక్కులే మూడొంతులకు పైగా ఉన్నారు. హిందూ దళితుల్లోనూ ఈ వర్గానిదే పెద్ద వాటా. బహుజన్ సమాజ్ పార్టీ స్థాపకుడు ‘మాన్యవర్’ కాన్షీరామ్ కూడా చర్మకార సిక్కు కుటుంబంలో పుట్టి హిందువుగా పెరిగినవాడు. పంజాబ్ సిక్కుల్లో పెద్ద కొడుకును కుదిరితే హిందువుగా పెంచే ఆనవాయితీ ఉందట.
Share this Article