ఎవరూ తక్కువ కాదు… పోలింగ్ రోజున వోటర్లకు నగదు పంపిణీ చేయడంకన్నా ఇది తక్కువ నైచ్యమేమీ కాదు… ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం… ఇదీ ఎన్నికల అక్రమమే… కాకపోతే దేశంలో ఓ దిక్కుమాలిన ఎన్నికల సంఘం ఉంది కాబట్టి అన్ని పార్టీల ఈ దుశ్చర్యలూ చల్తా…
ఓ చిన్న సంగతి చెప్పుకుందాం… చంద్రబాబు బుర్రలో ఏ(ది మెదిలితే అది ఓ కాగితం మీద రాసిపారేసి, రాబోయే ఎన్నికలకు తొలి దఫా మేనిఫెస్టో అని ప్రకటించేశాడు… అందులో తల్లులకు డబ్బులిచ్చే స్కీమ్ జగన్ నవరత్నాల నుంచి కాపీ… ఏటా మూడు సిలిండర్లు అనే స్కీమ్ కర్నాటక బీజేపీ నుంచి కాపీ… మహిళలకు సర్కారీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం అనే స్కీమ్ కర్నాటక కాంగ్రెస్ నుంచి కాపీ…
ఇంకా రెండో దశ, మూడో దశ మేనిఫెస్టోలు కూడా ఉంటాయి… ఎప్పుడూ జగన్‌ది బటన్ పాలన, కోట్లకుకోట్లు ప్రజలకు పంచేస్తున్నాడు, ఏపీ ఖజానా శ్రీలంక ఖజానాలాగా వట్టిపోతోంది, దివాలా తీస్తోంది అంటూ శోకాలు పెట్టే ఆంధ్రజ్యోతి, ఈనాడు తదితర మీడియా సంస్థలు ఈ తొలి దఫా మేనిఫెస్టోను మాత్రం ఆహా ఓహో అని కీర్తిస్తున్నట్టుగా బొంబాట్ పబ్లిష్ చేశాయి…
Ads
ఫ్రీ స్కీమ్‌లను వ్యతిరేకిస్తూ చాలా నీతులు చెప్పే రాధాకృష్ణ సంక్షేమ శరాలతో సమరశంఖం అని హెడింగ్ కుమ్మేసి వదిలాడు… 18 ఏళ్లు దాటిన ప్రతిమహిళకు 59 ఏళ్లలోపు వరకు నెలకు 1500 అట… ఎందుకు అనడక్కండి… ఏవో కథలు చెబుతాడు చంద్రబాబు… 59 ఏళ్లు దాటితే ఎలాగూ వృద్దాప్య పెన్షన్ వస్తుంది… అంటే యుక్త వయస్సు వస్తే చాలు, ప్రతి మహిళ సర్కారీ సాయానికి అర్హురాలు… చదువుకునే పిల్లలు ఇంట్లో ఎందరున్నా సరే, ఒక్కొక్కరి పేరిట ఏటా 15 వేలు ఇస్తాడట… ఇంకా 200 యూనిట్ల ఫ్రీ కరెంటు వంటి ప్రకటనలు బాకీ ఉన్నాడు చంద్రబాబు…
ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులు అనే నిబంధన తొలగిస్తాడట… ఇది పక్కా తిరోగామి చర్య… ప్రధానంగా మైనారిటీ వర్గాలను బుజ్జగించుకునే చర్య… నిరుద్యోగులకు భృతి ఇస్తాడట… కేసీయార్‌కే ఈరోజుకూ చేతకాలేదు… చంద్రబాబు ‘పథకాల్లో’… ప్రతి రైతుకూ ఏటా 20 వేలు… అర ఎకరం ఉన్నా సరే… అరవై ఎకరాలున్నా సరే, 20 వేలు… తలాతోకా లేని స్కీమ్… ఇక ఇంటింటికీ నీరు… బీసీ అత్యాచార నిరోధక చట్టం…… ఇంటింటికీ నీరు తెలంగాణలో మిషన్ భగీరథ పేరిట అమల్లో ఉన్నదే… ప్రతి రైతుకూ కొంత డబ్బు అనేదీ పాత స్కీమే… ఇప్పటికే నిండా మునిగిపోయి ఉన్న ఏపీ ఖజానా వీటిల్లో ఎన్ని తట్టుకోగలదు..?
ఇవే కాదు, ఇంకా వరాలు గుప్పిస్తాడు చంద్రబాబు… అన్నీ కలిపి ఏటా ఎన్ని లక్షల కోట్లను ఉదారంగా, ఉచితంగా పంపిణీ చేస్తానంటాడో వేచిచూడాలి…, వాస్తవానికి కర్నాటకలో ఈ అలవిమాలిన హామీలతో గెలవలేదు కాంగ్రెస్… బీజేపీ అసమర్థ పాలన, అవినీతి యవ్వారాల కారణంగా వోటర్లు కాంగ్రెస్‌కు మళ్లీ పట్టం గట్టారు… అంతెందుకు..? చంద్రబాబుకు తెలియదా..? పసుపు కుంకుమ గట్రా స్కీమ్‌లతో ఎన్నికల ముందు ఎడాపెడా నిధులను పంచినా సరే, చంద్రబాబును చిత్తుగా ఓడించారు… మరీ 23 సీట్లకు కుదించేశారు…
విచిత్రం, విషాదం ఏమిటంటే… ఇవన్నీ తెలిసీ, ఆల్ ఫ్రీ బాబు అని చంద్రబాబును వెక్కిరిస్తూనే జగన్ కూడా అదే బాటన ప్రయాణించడం… జనానికి సొమ్ము ఏదో స్కీమ్ పేరిట పారేస్తే, వాళ్లే పడి ఉంటారులే అనే భావన… లక్షల కోట్ల అప్పులు తెచ్చి మరీ పంచిపెడుతున్నాడు… సీన్ మరో కోణం నుంచి చూస్తే… రాబోయే మూడు నాలుగు నెలల్లో కేసీయార్ మళ్లీ వరాలు గుప్పిస్తాడు… కాంగ్రెస్ జనరల్ ఎలక్షన్స్‌కు అదే బాట పడుతుంది… ఒకరిని మించి మరొకరు ఖజానాలను అప్పుల్లో ముంచేసే ఇలాంటి స్కీమ్‌లను ప్రకటిస్తారు… గతంలో ఇలాంటి స్కీములకు తమిళనాడు ఉదాహరణగా ఉండేది… ప్రగతికాముకులు తమిళనాడును జాలిగా చూసేవాళ్లు… ఇప్పుడు ప్రతి రాష్ట్రమూ, ప్రతి పార్టీ అదే బాటకు వచ్చేసింది… చంద్రబాబు హామీలకు విరుగుడుగా జగన్ మరింత రెచ్చిపోయి ప్రకటించబోతున్నాడు వరాలు…
నిజానికి రాజకీయ పార్టీలను తప్పుపట్టడానికి ఏమీ లేదు… వాళ్లకు కావల్సినవి వోట్లు… వోట్ల కోసం, తద్వారా వచ్చే అధికారం కోసం ఏ తప్పుడు బాటనైనా పడతాయి అవి… (వీటికి అతీతంగా ఈ కురూపుల మధ్య ఎవరెస్టులా కనిపిస్తున్నది కేవలం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాత్రమే…) వోటర్లను ప్రలోభపెట్టడానికి అవకాశమున్న ప్రతి అక్రమ చర్యనూ రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నాయి… మత, కుల, ప్రాంత ఎమోషన్స్ కూడా వోటర్లను ప్రభావితం చేసే చర్యలు, విధానాలే… ఫెయిర్‌గా, పర్సప్‌ఫుల్‌గా, నిజాయితీగా ఎన్నికల్లో కొట్లాడటం అనేది బూతులాగా వినిపిస్తోంది ఇప్పుడు… కారణం మన ఎన్నికల విధానాలే…
ఎక్కువ పోలింగ్ కాదురా నాయనా… నాణ్యమైన పోలింగ్ కావాలి ఇప్పుడు… అంటే… అందరికీ వోటు హక్కు అనే విషయంలో రీథింకింగ్ కావాలిప్పుడు… కనీస విద్యార్హత, ఆధార్‌తో లింక్ తదితర విప్లవాత్మక పోకడలు అవసరం ఇప్పుడు… అన్నింటికన్నా ముందు ఉచిత పథకాల మీద అధికారిక ఆంక్షలు కావాలి… అదుపు తప్పిన పార్టీలపై అనర్హత వేటు పడాలి… ప్చ్… ఆ శేషన్ ఈరోజుకూ బతికి ఉంటే, ఎన్నికల సంఘం ఆయన చేతుల్లో ఉండి ఉంటే ఎంత బాగుండు…!!
Share this Article