విరాట్- అనుష్క కలిస్తే విరుష్క. విరుష్క దంపతులకు పాప పుట్టింది. ఆ పాపకు ఏ పేరు పెట్టాలో అని భారతీయ భాషలన్నీ పరస్పరం సంప్రదించుకున్నాయి. వాదించుకున్నాయి. చివరికి మన మాయా బజార్లో పింగళివారి-
“ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి?”-అన్న సర్వకాల సర్వావస్థల భాషా సిద్ధాంతమే నెగ్గింది. విరాట్ లో “వి” అనుష్క లో “అ” కలిపితే వా అయ్యింది. దానికి ఇక ప్రత్యయం కలిపితే వామిక అయ్యింది. వామిక అంటే దుర్గాదేవి పేరు కూడా అట. తెలుగులో భావార్థంలో ఇక ప్రత్యయం వస్తుందని చిన్నయసూరి బాల వ్యాకరణం సూత్రీకరించింది.
చేరు- చేరడం-చేరిక
కోరు- కోరడం- కోరిక
దప్పిక
గల్పిక
కథానిక
నవలిక…మాటల్లో చివర ఇక ఇలా చేరిందే.
Ads
తెలుగువారే చిన్నయసూరికి గోచీ కూడా మిగలకుండా చేసినప్పుడు హిందీవారయిన విరుష్కలకు చిన్నయసూరి ఇక ప్రత్యయ భావార్థ సూత్రం తెలిసే అవకాశం లేదు. తెలియాల్సిన అవసరమూ లేదు.
780 కోట్ల ప్రపంచ జనాభాలో ఎవరికీ లేని పేరు పెట్టుకోవడమే నవీన నామకరణ విధానం. ఆ విషయంలో విరుష్కలకు నూటికి నూటొక్క మార్కులు వేయాలి. వామిక పేరులో దుర్గమ్మ పేరు కూడా ధ్వనించడం రెండో లక్ష్యం అయి ఉంటుంది. వారి పాప…వారి ఇష్టం. ఇందులో ప్రపంచానికి, భారతీయ భాషలకు సంబంధం ఉండాల్సిన పనిలేదు.
————————
గుడ్డి గూగుల్లో వెతికి, లేదా సరికొత్త సమాస బంధుర అర్థరహిత నామకరణలతో మనం ప్రేమగా నోరారా పిలుస్తున్న బూతుల పేర్లతో పోలిస్తే వామిక కోటిరెట్లు నయం.
ముద్దులు మూట కట్టినట్లున్న ఒక పాపకు తల్లిదండ్రులు పరవశించి పెట్టుకున్న పేరు- అనాయ!
విహంగమై గగనంలో ఎగురుతుందనుకుని మరొక జంట తమ గారాల పట్టికి పెట్టుకున్న పేరు- విహాయ!
తమ బిడ్డ పెదవుల మీద ఎప్పటికీ చిరునవ్వు చెరిగిపోదనుకుని ఒక జంట నవ్వుతూ నామకరణం చేసిన తెలుగుపేరు- సుహాయ!
కొన్ని పేర్లు ఎంత ముద్దుగా ఉన్నా- ఎందుకో వాడుకోవడం లేదు.
అసహాయ
నిర్లిప్త్
నిస్సహాయ
నీరస్
నిరాశ్
నిర్మాల్య్
———————-
పెంటయ్య
పుల్లయ్య
కోటయ్య
మల్లమ్మ
ఎల్లమ్మ…
పేర్లను కూడా ప్రయత్నిస్తే కొంచెం ట్రెండీగా మార్చుకోవచ్చు.
పెంట్
పెంటన్
పుల్లన్
కోటన్
ఏలే ఎం
ఎం మాల్
ఇలా చివర అమ్మ, అయ్య, అన్న, అప్ప లేకుండా న్, ల్, అని పొల్లు వస్తే చాలు. ఉత్తర భారత టచ్ వచ్చి పరమ ట్రెండీ అయి మన పేరు మనకే ముద్దొస్తుంది.
అజంత, హలంత భాషల లక్షణాలు, ఆ భాషోచ్చారణలకు సొంతమయిన పద్ధతుల గురించి మనకెందుకు?
కుక్కలకు టామీ, సోనీ అని అర్థరహితమయిన శబ్దప్రధానమయిన పేర్లు పెడుతుంటాం. దానికి ఆ పేర్ల మీద అభ్యంతరం ఉన్నట్లు ఇప్పటిదాకా మనకు తెలియదు. మనుషులకయినా అంతే. వారికి అభ్యంతరం లేనంతవరకు- పెట్టే పేర్లకు అర్థం లేకపోయినా పెద్ద అనర్థమేమీ జరగదు.
సరళ అని పేరున్న మహిళ చాలా కఠినంగా ఉండవచ్చు. హిమాంషు అన్నవాడు ఎప్పుడూ నిప్పులుగక్కుతూ చిటపటలాడుతుండవచ్చు. ధవళ్ పెద్దయ్యాక సింగరేణి బొగ్గు కంటే నలుపెక్కవచ్చు. నరసింహ గ్రామసింహానికే బెదిరిపోవచ్చు. శారద పదో క్లాసు మెట్లయినా తొక్కకపోవచ్చు. వీణ గొంతెత్తితే చెవుల్లో రక్తం కారవచ్చు.
———————–
మన పోతన భాగవతంలో అజామిళోపాఖ్యానంలో ఒక మాటతో ముగిద్దాం. నారాయణ, గోవిందా, దుర్గ, లక్ష్మి, ఉమ…అన్న పేర్లు పెడితే…పదే పదే ఆ పేరు పెట్టి పిలిచినందువల్ల నామోచ్చారణ పుణ్యం మన అకౌంట్లో పడుతుందట. ఆ పుణ్యం ఎక్కడ వస్తుందో అన్న భయంతో హాయిగా మనం-
వంకర
టింకర
అంధ
చే
వే
గే
లాంటి వినూత్న పేర్లు పెట్టుకుని పొంగిపోతున్నాం…………….. By… -పమిడికాల్వ మధుసూదన్
Share this Article