ఒక్కసారిగా హడావుడి… హైదరాబాద్ నెటిజనమంతా స్మార్ట్ ఫోన్లలో, కెమెరాల్లో ఈ సీన్లను బంధించడానికి పోటీలు పడ్డారు… అరుదైన దృశ్యాల్ని చూస్తూ సంబరపడిపోయారు… వాట్సప్ గ్రూపులు, ఫేస్ బుక్ షేర్లు, ఇన్‌స్టా పోస్టులు మొత్తం ఇవే ఫోటోలతో నిండిపోతున్నయ్… కొందరికి ఇదేమిటో తెలుసు, కొందరికి తెలియదు… మొత్తానికి ఓ చర్చ… ఇళ్ల నుంచి బయటికి వచ్చి అనువైన కోణాలు వెతికి ఫోటోలు తీయడంలో బిజీ అయిపోయారు చాలామంది… నిజానికి ఏమిటిది..? ఇదొక వింత కాదు, విడ్డూరం కాదు… ఒక ఖగోళ విశేషం… మనం ఇంద్రధనుస్సు చూసినవాళ్లమే కదా… ఇదీ అలాంటిదే… చాలా ఎత్తులో వర్తులాకారంలో ఏర్పడే ఇంద్రచాపం… తెలుగులో వరదగూడు లేదా వరదగుడి అని కూడా అంటారు… తెలంగాణలో సింగిడి అంటారు…
Ads
ఇలాంటి ఫోటోలు కోకొల్లలు ఇప్పుడు సోషల్ మీడియా నిండా… దీన్నే ఇంగ్లిషులో Sun halo లేదా సోలార్ హాలో అంటారు… మన భూవాతావరణంలో క్రిస్టల్స్ ఆకారంలో ఉండే చిన్న చిన్న ఐస్ ముక్కలు ఏర్పడ్డప్పుడు, సూర్య కాంతి భూవాతావరణంలోని ఆ క్రిస్టల్ ఆకారంలో ఉండే ఐస్ ముక్కలపైన పడి ప్రతి ఫలించడం వల్ల సూర్యుడి చుట్టూ వలయంగా ఈ #Sunhalo ఏర్పడుతుంది…. ఈ వరద గూడు చంద్రుడి చుట్టూ కూడా ఏర్పడుతుంది… సూర్యుని యొక్క 22 డిగ్రీల వృత్తాకార హాలో (అప్పుడప్పుడు చంద్రుడి చుట్డూ మూన్ రింగ్… దీన్నే వింటర్ హాలో అని కూడా పిలుస్తారు) అని పిలవబడేది ఈ దృగ్విషయం.., సిరస్ మేఘాలలో ఉన్న షట్కోణ మంచు స్ఫటికాల ద్వారా సూర్యుడు లేదా చంద్రుని కిరణాలు విక్షేపం / వక్రీభవనం జరిగినప్పుడు సంభవిస్తుంది… దీనిని కాలిడోస్కోపిక్ ఎఫెక్ట్ అని కూడా అంటారు… ఇదీ సైంటిఫిక్ వివరణ… ‘‘వరదగూడు ఆవిష్కృతమైందంటే వర్షాలకు సంకేతం… తుఫాన్లు వచ్చే కొన్ని రోజులకు ముందు సిర్రస్ (వలయాకార) మేఘాలతో ఇది ఏర్పడుతుంది… వరదగూడు వల్ల వానలొస్తాయనే ఆశ చిగురిస్తోంది…’’ అంటుంటారు కానీ జరగొచ్చు, జరగకపోవచ్చు… ఇది ఏర్పడినప్పుడు చూసి ఆనందించడమే… అది వర్షాలను మోసుకొస్తే మరింత ఆనందమే కదా…!!
Share this Article