ఆలియా భట్, రణబీర్‌కపూర్ బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్ కోసం దేశమంతా చుట్టేస్తున్నారు… ఉజ్జయిని వెళ్లారు… మహాకాళుడి దర్శనం చేసుకున్నారు… ఈ సందర్భంగా భజరంగ్‌దళ్ కార్యకర్తలు గొడవ చేశారు, వాళ్లను గుడిలోకి అడుగుపెట్టనివ్వబోమని వీరంగం వేశారు… పోలీసులు లాఠీలకు పనిచెప్పారు… ఈ గొడవలతో ఆ ఇద్దరూ సంధ్యా ఆరతి కూడా అవాయిడ్ చేసి వెళ్లిపోయారు… దర్శకుడు ఆయాన్ ముఖర్జీ విడిగా ఒక్కడే దర్శనం చేసుకుని, పూజ చేశాడు… ఇదీ వార్త…
వాళ్లనెందుకు గుడిలోకి అడుగుపెట్టనివ్వకూడదు..? రణబీర్ అప్పుడెప్పుడో, 2012 నాటి ఏదో ఇంటర్వ్యూలో బీఫ్ అనుకూల వ్యాఖ్యలు చేశాడట… అందుకని యాంటీ-హిందూ అట… మరోవైపు ఆలియాభట్ ఇష్టముంటే నా సినిమాలు చూడండి, లేకపోతే మానేయండి అని వ్యాఖ్యలు చేసిందట… ఆమె కూడా యాంటీ-హిందూ అట… విచిత్ర వాదన, వితండ వాదన… క్రమేపీ ఈ బాయ్‌కాట్ పిలుపులు, బాలీవుడ్ సెలబ్రిటీలపై ద్వేషం శృతిమించుతోంది… వాళ్లు యాంటీ-హిందూ అయితే మహాకాళుడి దర్శనం కోసం ఎందుకు వస్తారు..? కామన్ సెన్స్ ప్రశ్న కాదా…!!
ఒకటీరెండు ముఖ్యాంశాలు… సీరియస్ ఇష్యూలకు గాకుండా ప్రతి ఇష్యూకు బాయ్‌కాట్ పిలుపులు, వ్యతిరేక ప్రదర్శనలు చేస్తే, ఇక క్రమేపీ వాటికి విలువ తగ్గిపోయి, ఎవడూ పట్టించుకోడు… నిజంగా సీరియస్ ఇష్యూలు వచ్చినప్పుడు కూడా ఎవడూ స్పందించడు… నాన్నా, పులివచ్చె అన్నట్టు ఉంటుంది… నిజానికి సినిమా బాగుంటే ఈ వ్యతిరేకతలు, బాయ్‌కాట్ పిలుపులు అన్నీ కొట్టుకుపోతాయి… ప్రేక్షకుడు వాటికి పెద్దగా స్పందించడు… కాకపోతే ఈ సినిమా పట్ల ఎందుకోగానీ నెెగెటివిటీ పెరుగుతోంది…
Ads
ఇష్టమున్నవాళ్లే నా సినిమా చూడండి అనే ఆలియా వ్యాఖ్య కాస్త విసుగును, కాస్త పొగురును ధ్వనించవచ్చుగానీ… అందులో యాంటీ-హిందూ పోకడ ఏముంది..? అసలు ఆమె పెళ్లి చేసుకుని, అడుగుపెట్టింది హిందూ కుటుంబంలోకి కాదా..? గతంలో కూడా తను ఎప్పుడూ ఏ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు… ఆమె మీద హిందూ ద్వేషి అనే ముద్ర అబ్సర్డ్…
సేమ్, రణబీర్… అప్పుడెప్పుడో ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు… ‘‘మాది పెషావర్ నుంచి వచ్చిన కుటుంబం కదా… అక్కడి అలవాట్లు, ఇష్టాలు కంటిన్యూ అవుతున్నయ్… నేను కూడా మటన్, పాయ, బీఫ్‌ను ఇష్టపడతాను…’’ ఇదే తను చెప్పింది… ఇది గోమాతకు వ్యతిరేక వ్యాఖ్య కాబట్టి, తను హిందూ ద్వేషి అనేది భజరంగ్‌దళ్ వేస్తున్న ముద్ర… బీఫ్ అంటే గోమాంసమే కాదు కదా… ఎద్దులు, కోడెలు, బర్రెలు, దున్నపోతుల మాంసాన్ని కూడా వ్యతిరేకించాలా..? తనెప్పుడూ వేరే హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా లేవు…
ఆలియాభట్ పద్దతిగా డ్రెస్ వేసుకుంది… గాజులు వేసుకుంది, బొట్టు పెట్టుకుంది… భర్తతో కలిసి వచ్చి, దేవుడి ఎదుట భక్తిగా దండం పెట్టింది… తన భక్తిని, ఆ దేవుడి పట్ల తన విశ్వాసాన్ని ప్రదర్శిస్తే అది తప్పెలా అయ్యింది… ఏ దేవుడైనా సరే, తన దగ్గరకు ఎవరు రావాలనుకున్నా సరే అడ్డుపడటమే నిజానికి దైవద్రోహం… అర్థరహితం… సినిమా ప్రమోషన్ కోసం, పబ్లిసిటీ కోసం గనుక వాళ్లు గుడికి వచ్చి ఉంటే, వ్యతిరేకించినా అర్థం ఉండేదేమో… తమ సినిమా సక్సెస్ కోసం దేవుడిని ప్రార్థించడానికి వచ్చారు… ఆ దేవుడి పట్ల వాళ్ల విశ్వాస ప్రకటననే వ్యతిరేకిస్తే ఎలా..?!
Share this Article