నాయకుడు బలవంతుడు అయినా గాకపోయినా… బలవంతుడిగా కనిపించాలి…! రకరకాల సవాళ్లు ఏవైనా సరే, వాటి ఎదుర్కొనే ధీశాలిగా ప్రపంచానికి కనిపించాలి… లేకపోతే అనుచరగణమే మాట వినదు, ప్రత్యర్థుల్లో ఉత్సాహం పెరుగుతుంది, అవి కొత్త సవాళ్లకు దారితీస్తాయి… కారణం ఏదైనా సరే, చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండాల్సింది… ఇన్నేళ్లుగా మనం చూసిన చంద్రబాబు వేరు… ప్రజెంట్ చంద్రబాబు వేరు… జగన్ జగనే, తను వైఎస్ కాడు… డ్రామా, మెలోడ్రామా, స్ట్రాటజీ అని ఎన్ని సమర్థనలు వినిపించినా సరే, ఈ కన్నీళ్ల ప్రభావం పార్టీ మీద నెగెటివ్‌గా ఉంటుందా..? పాజిటివిటీ పట్టుకొస్తుందా..? కాలమే చెప్పాలి… కాకపోతే నాయకుడే ఏడ్చి మొత్తుకునే స్థితి వస్తే ఇక కేడర్‌లో భరోసా నింపేదెవరు..? చెల్లాచెదురైపోదా..? సేమ్, ముఖ్యమంత్రి కాస్త వీక్ అయిపోతే చాలు, సపోజ్ ఉపఎన్నికల్లో ఓడిపోతే చాలు, ఇక ప్రతి ఎమ్మెల్యే మంత్రి పదవిని డిమాండ్ చేస్తాడు… ప్రతి అనుచరుడు పైరవీ ఫైళ్లను ముందుపెడతాడు… సో, నాయకుడు బలవంతుడిగా కనిపించాలి అనేది నీతి…
ఇది ఎందుకు చెప్పుకోవడం అంటే..? వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడుగా, క్షమించండీ అని జాతి ఎదుట బేలగా మొహం పెట్టాడు కదా… అనేక మెట్లు దిగిపోయాడు ఒక్కసారిగా… నిజానికి మోడీ తత్వానికి, కొన్నేళ్లుగా సాగిస్తున్న ఆధిపత్య ధోరణికి ఇది పూర్తి కంట్రాస్టు… సరే, యూపీ ఎన్నికల కోసం చేశాడా..? ఖలిస్థానీ ముసుగు కుట్రల్ని బ్రేక్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాడా..? ఇంకేమైనా కారణాలున్నాయా అనే చర్చ ఇక్కడ అప్రస్తుతం… యూపీ పశ్చిమ ప్రాంతాల్లో తిరిగొచ్చిన అమిత్ షా ఏం చెప్పాడో… అమరీందర్‌సింగ్, అజిత్ దోవల్ భేటీలో ఏం చర్చించారో… అవీ అప్రస్తుతం… ఒక్కసారిగా తను డీలా పడినట్టు కనిపించగానే ఇక చాలా గొంతులు డిమాండ్లకు దిగాయి… (మాసారు ఇలా హెచ్చరిక జారీ చేయగానే, అలా మోడీ ఆ చట్టాలు రద్దు చేసుకున్నాడు తెలుసా అనే వెర్రి క్లెయిముల గురించి కూడా చెప్పుకోవడం వేస్ట్…)
Ads
ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తవా లేదా..? పీడీపీ మెహబూబా ముఫ్తి గొంతు ఇది…
విద్యుత్తు చట్టాన్ని వెనక్కి తీసుకుంటవా లేదా..? ఇది కేసీయార్ డిమాండ్…
పౌరసత్వచట్టాన్ని వెంటనే రద్దు చేస్తవా లేదా..? జమైత్ ఉలేమా, బీఎస్పీ హెచ్చరిక…
కనీస మద్దతు ధర కల్పించే చట్టం తీసుకొస్తవా లేదా..? లెఫ్ట్ పార్టీల డిమాండ్లు…
ఇప్పుడప్పుడే ఆందోళనల్ని విరమించే సవాలే లేదుపో… తికాయత్ బ్యాచ్ మొరాయింపు…
…… పెట్రో ధరలు, గ్యాస్ ధరలు, కరోనా ఉపశమనచర్యలు, ప్యాకేజీలు, డ్రగ్స్ ధరలు, నిత్యావసరాల ధరల మీద మాత్రం ఎవరూ మాట్లాడరు… అవి తగ్గించడ్రా బాబోయ్ అని ఎవరూ డిమాండ్ చేయరు… పాతబడిన పాత పాత డిమాండ్లన్నీ వినిపిస్తున్నయ్… నువ్వు వెంటనే కుర్చీ దిగిపో అనే ఒక్క డిమాండ్ తప్ప, ఇక ఎవరి నోటికి ఏదొస్తే అదే… యాంటీ-మోడీ, యాంటీ-బీజేపీ శిబిరాల్లో కొత్త ఉత్సాహం… గెలుపు సాధించిన కళకళ… ప్రత్యేకించి మోడీని ఏమీ చేయలేం అనే నిస్పృహ నుంచి, మోడీ అంత పెద్ద బలవంతుడేమీ కాదు, కరెక్టుగా ప్లాన్ చేస్తే దింపేయగలం అనే ఓ కొత్త నమ్మకం పెరిగిపోయింది ఆ క్యాంపుల్లో… కాకపోతే ఎప్పటిలాగే అవన్నీ వింటూ, రియాక్ట్ కాకుండా ఉండటం మోడీ స్టయిల్… అది కంటిన్యూ అయిపోతోంది…
ఇన్నాళ్లూ మోడీ-అమిత్ షా అంటే బీజేపీలో గానీ, సంఘ్ పరివార్‌లో గానీ ఓ ఆధిపత్యం… వాళ్లేం చెబితే అదే నడిచింది… వీహెచ్పీ ప్రవీణ్ తొగాడియా వంటి నేతల్నే శంకరగిరి మాన్యాలు పట్టించారు… పార్టీ అధికారంలో ఉన్న చోట్ల సీఎంలుగా ఎవరిని పీకేయాలో, ఎవరిని పెట్టాలో వాళ్లిష్టం… కర్నాటక, ఉత్తరాఖండ్ చూశాం కదా… యోగిని తప్పించాలనే ఒక్క ఆలోచన మాత్రం సక్సెస్ కాలేదు… అవసరమైతే మళ్లీ అదే గోరఖ్‌పూర్ ఆశ్రమం కేంద్రంగా హిందూ మహాసభ లేదంటే హిందూయువవాహిని… బీజేపీకే నష్టం… సో, ఏ కోణం నుంచి చూసినా సరే వ్యవసాయ చట్టాల రద్దు బీజేపీకి, మోడీకి ఫాయిదా ఏమీ ఇవ్వబోవడం లేదు సరికదా కొత్త సమస్యల్ని తెచ్చే సూచనలే… ఈ అంతర్గత రాజకీయాలకన్నా ఈ చట్టాల ఏకపక్ష రద్దు ద్వారా ఇక ఏ ప్రధానీ సమీప భవిష్యత్తులో వ్యవసాయ సంస్కరణల జోలికి వెళ్లడానికి సాహసించడు అనే చేదునిజమే ఎక్కువ ఆందోళనకరం… ప్చ్, బండి వెళ్లాల్సిన బాటలో వెళ్లడం లేదు…!!
Share this Article