…… By…… Nancharaiah Merugumala…….. వినోద్ దువా హిందూ పఠానట– ఆయన భార్య ‘‘చిన్న’’ తమిళ స్త్రీ….. ప్రణయ్ రాయ్ పేరు వినగానే హిందీ జర్నలిస్టు దువా గుర్తుకొస్తాడు… దాదాపు 37 ఏళ్ల క్రితం అంటే 1984 డిసెంబర్లో దూరదర్శన్‌లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు– విశ్లేషణల ప్రత్యక్ష ప్రసారాలు మొదలయ్యాయి. అప్పటికి 21–28 ఏళ్ల మధ్య వయసున్న మా తరానికి ఇంగ్లిష్‌లో మాట్లాడే ఎన్నికల విశ్లేషకుడు (సెఫాలజిస్ట్) ప్రణయ్ రాయ్, ఆయన మాటలు హిందీలోకి అనువదించే జర్నలిస్టు వినోద్ దువా బాగా తెలిసిన ముఖాలయ్యారు. ప్రైవేటు టీవీ న్యూజ్ చానల్స్ వచ్చాక కూడా వారు పాల్గొన్న కార్యక్రమాలకు బాగా గిరాకీ ఉండేది. ప్రణయ్ రాయ్ కొన్నేళ్లకు న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ) పేరుతో సొంత మీడియా కంపెనీ పెట్టుకుని నెమ్మదిగా సొంత ఇంగ్లిష్, హిందీ చానల్స్ ప్రారంభించారు. వినోద్ దువా అలాంటి పనిచేయలేదు. కొన్ని హిందీ చానల్స్‌లో వినోద్ అనేక జనాదరణ పొందే కార్యక్రమాలు సమర్పించేవారు. ఈ ఏడాది మే నెలలో కొవిడ్–19 సోకడంతో గురుగావ్ మేదాంతా హాస్పిటల్లో వినోద్, ఆయన భార్య పద్మావతి ‘చిన్న’ చేరారు. జూన్‌లో వినోద్ కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. జులైలో పద్మావతి కన్నుమూశారు.
అరవై ఏళ్లు దాటిన అనేక మందికి ఈ మహమ్మారి వల్ల ఆరోగ్యం బాగా దెబ్బతిన్నట్టే వినోద్ కూడా భార్య మరణం తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొన్ని నెలలుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు వినోద్ దువా. అనారోగ్యంతో సోయి లేకుండా నెలల పాటు ఆస్పత్రిలో ఉన్న ప్రముఖులు మరణించినట్టు సోషల్ మీడియా ద్వారా పుకార్లు వ్యాపించడం తెలిసిందే. ఇలాగే వినోద్ కూడా చనిపోయారనే వార్త వైరల్ అయింది. ఇందులో నిజం లేదని ఆయన కూతురు, నటి మల్లికా దువా ఆదివారం ప్రకటించారు. ఆమె వివరణ వార్త చదివాక వినోద్ దువా గురించి మిత్రులకు గుర్తుచేయాలనిపించింది.
Ads
వినోద్ మరణించలేదనీ, ఐసీయూలో కోలుకోకుండా తీవ్ర అనారోగ్యంతో ఉన్న మాట నిజమేనని ఆయన కూతురు చెప్పిన వార్తలోని ఓ విషయం–జాతులు, కులాలు, మతాలు వంటి అంశాలపై కాస్త ఎక్కువే ఆసక్తి ఉన్న నన్ను ఆకట్టుకుంది. వినోద్ దువా భార్య పేరు– పద్మావతి ‘‘చిన్న’’ – అని ఈ వార్తలో చెప్పారు. కోట్స్ లో –చిన్న– అనగానే తెలుగు మహిళేమో అనే అనుమానం వచ్చి గూగుల్‌లో వెతికితే ఆమె తమిళ కుటుంబంలో పుట్టిందని తేలింది. నలుగురు సంతానంలో కడసారి బిడ్డకావడంతో పద్మావతిని ఆ అరవ కుటుంబసభ్యులు ‘చిన్నా’ అని పిలిచేవారని నేను చదివిన ఇంగ్లిష్ వార్త చెప్పింది. ఓ దిల్లీ ఆస్పత్రిలో రేడియాలజిస్టుగా పనిచేసిన ఈ ‘చిన్న’ దువా గాయనిగా, కొత్త వంటలు పరిచయం చేసే వ్యక్తిగా, రకరకాల విలక్షణ చీరలు సేకరించే అభిరుచి ఉన్న స్త్రీగా కూడా సోషల్ మీడియాలో పేరు సంపాదించారట.
‘చిన్న’మ్మ 61 ఏళ్లకే కన్నుమూస్తే, ఆమె 67 ఏళ్ల భర్త చావుబతుకుల్లో ఉన్నాడు. ఇంతకీ ఈ తమిళ ‘చిన్న’– భర్త వినోద్ ఇంటిపేరు– దువా– అనగానే ఆయన పంజాబీ ఖత్రీ అని చాలా ఏళ్లుగా అనుకున్నా. కాని, తన కుటుంబనామాన్ని బట్టి పంజాబీ అనుకోవద్దనీ, ఇప్పటి పాకిస్తాన్ లోని కైబర్ పఖ్తూన్‌క్వా (90 శాతానికి పైగా పఠాన్లు లేదా పఖ్తూన్లు ఉండే పూర్వపు వాయువ్య సరిహద్దు రాష్ట్రం) నుంచి దేశ విభజన తర్వాత దిల్లీ వచ్చేసిన కుటుంబంలో పుట్టానని చెప్పారు. పఠాన్లు అనగానే అంతా ముస్లింలు అనే అభిప్రాయం నిజం కాదని, తాను హిందూ పఠాన్ అని వినోద్ దువా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పష్తూ మాట్లాడే పఠాన్లు లేదా పఖ్తూన్లలో హిందువులు కొద్ది మంది మతం మారకుండా ఇంకా మిగిలి ఉన్నారనే విషయం ఆయన ఇంటర్వ్యూ తర్వాత నావంటి చాలా మందికి తెలిసింది.
పెషావర్ రాజధానిగా ఉన్న వాయువ్య సరిహద్దు రాష్ట్రం నుంచి, ఇంకా లక్షలాది మంది పంజాబీ హిందువులు, సిక్కులు పాక్ పంజాబ్ నుంచి 1947లో ఇండియాకు వలసొచ్చి దిల్లీ, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అప్పట్లో ఇంగ్లిష్ చదువులతోపాటు ప్రతిభా పాటవాలు దక్షిణాదిలో ఎక్కువ ఉన్న జాతిగా పేరొందిన తమిళులు కూడా 1950లు, 60లు, 70ల్లో పెద్ద సంఖ్యలో దేశ రాజధానికి చేరుకుని మంచి ఉద్యోగాలు సంపాదించి సెటిలయిపోయారు. ఈ క్రమంలో పాక్ నుంచి వచ్చిన పంజాబీలు, సింధీలు, పఖ్తూన్లకు, తమిళులకు స్వల్ప సంఖ్యలో పెళ్లిళ్లు అయ్యాయి. ఇలాంటి జంటే పైన చెప్పిన వినోద్ (పఠాన్), పద్మావతి చిన్న(తమిళ) దువా దంపతులు. ఇలా పెద్దల ప్రమేయం లేకుండా ఇష్టపడి మనువాడిన వేర్వేరు భాషా వర్గాల దంపతులు మన హైదరాబాద్ లో కూడా కనిపిస్తారు. ఇక బాలీవుడ్ లో అయితే ఇలాంటి జంటలు చాలా ఎక్కువ. వినోద్ దువా, పద్మావతి ‘చిన్న’ మాదిరిగా కొద్ది మందైనాగాని భాష, కులాలకు అతీతంగా పెళ్లిళ్లు చేసుకోవాలంటే మొదట దేశం మొత్తం బహుభాషా వర్గాల జనం పక్క పక్కనే నివసించే మహానగరాలుగా అవతరించాలి. అలా జరిగితే కులాంతార, భాషాంతర వివాహాల సంఖ్య మొత్తం పెళ్లిళ్లలో ఇప్పటి ఐదు శాతం నుంచి కనీసం పది శాతం వరకూ పెరిగే అవకాశం వస్తుందని సమాజ్ శాస్త్రీల (సోషియాలజిస్టులు) అంచనా…
Share this Article