అవును… ప్రతి రేప్ కేసూ నిజం కాదు… అన్ని కేసుల్లోనూ మహిళలు చెప్పిందేమీ అల్టిమేటు కాదు… కాకపోతే మన చట్టాలు మహిళ పక్షపాతాలు… మీడియా, సమాజం ఎప్పుడూ మగవాడినే అనుమానంగా చూస్తుంది… వేలెత్తి చూపిస్తుంది… ఇది పూర్తి భిన్నమైన కేసు… ఇవీ చదవాలి… రికార్డు కావాలి… తప్పుడు రేప్ కేసులు కొన్నిసార్లు బద్దలవుతుంటయ్, అసలు దోషులెవరో బయటపడక తప్పదు…
ఒక అమ్మాయి… ఒక అబ్బాయి… పెళ్లి కుదిరింది… ఇక దండలు మార్చుకోవడమే తరువాయి… కానీ రెండు కుటుంబాల మధ్య ఏదో తగాదా వచ్చింది… ఆ అమ్మాయిని చేసుకోవడం కుదరదు అని అబ్బాయి పేరెంట్స్ చెప్పారు… అనేకసార్లు ఇలా జరుగుతూనే ఉంటయ్ కదా… కానీ ఆ అబ్బాయిపై అమ్మాయి కేసు పెట్టింది… పెళ్లి పేరుతో తనను మోసం చేశాడనీ, తాను తల్లినయ్యాననీ ఆరోపించింది… ఆ యువకుడు బుక్కయ్యాడు…
Ads
ఇది చెన్నైలో జరిగింది… ఆ అబ్బాయి పేరు సంతోష్… ఆ ఇద్దరి ఇళ్లూ పక్కపక్కనే ఉండేవి… ఒకే కులం… అంతా బాగానే ఉంది… సేమ్ రేంజ్ సంబంధం… కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, పెళ్లి చేసేద్దామని అనుకున్నారు… కానీ అనుకోకుండా ఆస్తి తగాదాలు తలెత్తాయి.,. సంతోష్ కుటుంబం అక్కడి నుంచి వెళ్లిపోయి ఇంకెక్కడో ఉండసాగింది… ఈలోపు ట్విస్ట్ ఏమిటంటే… ఆమె గర్భం ధరించింది…
సంతోషే కారణమని అమ్మాయి పేరెంట్స్ ఆరోపించారు, దుమ్మెత్తిపోశారు, వదిలేది లేదన్నారు… ఆమెను పెళ్లి చేసుకోవాల్సిందేనన్నారు… వార్నీ, ఈ నింద తనపై పడటం ఏమిటని అబ్బాయి మొత్తుకున్నాడు… తనకే పాపమూ తెలియదనీ, అసలు ఆ అమ్మాయితో ‘‘ఆ సంబంధం’’ లేదని చెప్పుకున్నాడు… ఆమె మోసం చేస్తోందని తెలుస్తూనే ఉంది… కానీ తన మాట వినిపించుకున్నవారు లేరు…
ఆ పేరెంట్స్ తనపై రేప్ కేసు పెట్టారు… అసలు రేప్ అంటే ఏమిటి..? ఇది అత్యంత క్లిష్టమైన ప్రశ్న కదా… పోలీసులు అవేమీ ఆలోచించరు కదా… ఆమె ఫిర్యాదు రావడం, వెంటనే తనపై కేసు నమోదు చేయడం, అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి… 2009 నవంబరులో అరెస్టు… 2010 ఫిబ్రవరిలో బెయిల్ వచ్చింది కష్టమ్మీద… బతుకు బర్బాద్ అయిపోయింది…
కాలం గడిచిపోతోంది… అమ్మాయి ఓ పాపకు జన్మనిచ్చింది… తనను దోషిగా బుక్ చేసి, తనపై నింద వేసి, తన బతుకుతో ఆడుకున్న కోపం ఆ అబ్బాయికీ ఉంది… ఇక చట్టపరంగానే కొట్లాడటం స్టార్ట్ చేశాడు… 2016 వచ్చేసింది… డీఎన్ఏ పరీక్షలు చేశారు… తనవల్లే ఆ కడుపు అన్నారు కదా, ఆ పాప తన సంతానమే అన్నారు కదా, ఛలో డీఎన్ఏ పరీక్షలు చేసి నిరూపించాలి అనేది తన క్లెయిమ్…
ఎలాగైతేనేం… ఆ పరీక్షలూ జరిగాయి… తీరా చూస్తే ఆ పాపకూ సంతోష్కూ ఏరకమైన జన్యుసంబంధం లేదని తేలింది… అంటే తను ఆ పాపకు తండ్రి కాదు… దీంతో కోర్టు సంతోష్ మీద పెట్టిన కేసు కొట్టేసింది… అక్కడ ఆగలేదు సంతోష్…
నామీద అన్యాయంగా కేసు పెట్టారు… నన్ను దోషి అని సమాజం నిందించింది… నాకు జరిగిన నష్టం మామూలుది కాదు… సమాజంలో పరువు కోల్పోయాను… నా సంగతేమిటంటూ పరువునష్టం దావా వేశాడు… నిండా మునిగినవాడికి చలేముంటుంది… జస్ట్, 30 లక్షలు ఇప్పించండి అనేది ఆ అబ్బాయి క్లెయిమ్… అక్కడ డబ్బు సమస్య కాదు… ఆ అమ్మాయిదే తప్పు అని మరోసారి బలంగా సమాజానికి చెప్పాలనేదే కాన్సెప్టు… సుదీర్ఘంగా విచారణలు జరిగాయి… చివరకు ఆ అబ్బాయికి 15 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆ మహిళ కుటుంబాన్ని ఆదేశించింది… నిజం గెలిచినట్టేనా..? ఏమో… ఆ అమ్మాయి కుటుంబం పైకోర్టుకు వెళ్తుందేమో…!!
.
అవునూ, మన కార్తీకదీపం టీవీ సీరియల్లో వందల ఎపిసోడ్లుగా కథ మలుపులు తిరుగుతూనే… బొచ్చెడు రేటింగ్స్ సంపాదిస్తూ దుమ్ము రేపుతోంది కదా… ఆదర్శ భర్త అనబడే డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ అనే వైద్యనిపుణుడికి… డీఎన్ఏ టెస్టులు తెలియవా..? ఆ స్క్రిప్టు రైటర్ అంత అజ్ఞానా..? ఏమో… పై కేసు గురించి రాస్తుంటే, చదువుతుంటే… ఇదెందుకు స్ఫురించిందో ఏం పాడో….
Share this Article