Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పేరుకే భానుప్రియ హీరోయిన్… కానీ హవా మొత్తం వై.విజయదే…

October 6, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …. నందమూరి వారు ముగ్గురు ఉన్నారు ఈ అల్లరి కృష్ణయ్య సినిమాలో . నందమూరి బాలకృష్ణ హీరో , నందమూరి రమేష్ దర్శకుడు , నందమూరి మోహన్ కృష్ణ సినిమాటోగ్రాఫర్ . పూర్తి గ్రామీణ నేపధ్యంలో ఇచ్చిపుచ్చుకునే గౌరవాలు , బావామరదళ్ళ సరసాలు , నలుగురూ బాగుంటే చూడలేని ఆషాఢభూతులు , వీటన్నింటితో పాటు ఓ వన్నెల విసనకర్ర వై విజయ . టూకీగా ఇదీ కధ .

(దర్శకుడు నందమూరి కుటుంబ సభ్యుడే అయినా… ఎందుకో పెద్దగా సక్సెస్ కాలేదు… ఎక్కడా ఆయన గురించిన సమాచారం పెద్దగా లేదు… ఎన్టీయార్‌తో టైగర్, బాలయ్యతో ఈ అల్లరి కృష్ణయ్య తీశాడు)…

Ads

అనగనగా ఓ ఊరు . ఆ ఊరికి పెద్ద రావు గోపాలరావు . ఆయనకు ఇద్దరు మేనల్లుళ్ళు . జగ్గయ్య , బాలకృష్ణ . ఊళ్ళో అందరికీ రావు గోపాలరావు , జగ్గయ్య ఎంత చెపితే అంత . రావు గోపాలరావు కుమార్తె అందాల భరిణ భానుప్రియ . బాలకృష్ణ , భానుప్రియలకు ఒకరి మీద ఒకరికి చచ్చేంత ప్రేమ ఉన్నా ప్రతీ క్షణం కీచులాడుకుంటూనే ఉంటారు .

గ్రామం అన్నాక సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి కదండి . ఆ ఎన్నికల్లో మామాఅల్లుళ్ళు చెరొక అభ్యర్ధిని నిలుచోపెట్టడంతో అభిప్రాయ బేధాలు వస్తాయి . మాజీ కరణం గొల్లపూడి మారుతీరావు , ఊళ్ళో మోతుబరి చలపతిరావులు కలిసి రావు గోపాలరావు మీద గుళ్లో అమ్మ వారి నగలు దొంగిలించారనే ఆరోపణతో జైలుకు పంపుతారు .‌హీరో గారు మారువేషాలు వేసి , మిత్రబేధం పెట్టి అసలు దొంగల్ని పోలీసులకు అప్పచెప్పి మామ కూతురిని పెళ్లి చేసుకోవడంతో శుభం కార్డు పడుతుంది .

మెయిన్ ట్రాక్ అంతా బాలకృష్ణ , భానుప్రియల అల్లర్లు , పాటలు ఆటలు , సెంటిమెంట్సులతో ఆహ్లాదంగా నడుస్తుంది . సైడ్ & కామెడి ట్రాక్ వై విజయ , కల్పనారాయ్ , గొల్లపూడి , చలపతిరావులు అదరగొడతారు . ముఖ్యంగా వై విజయ . 1980s సినిమాల్లో వై విజయ లేకుండా సినిమా ఉండే ప్రసక్తే లేదు .

పెద కాపు గారి దెబ్బంటే ఏమనుకుంటున్నావో అని ఓ బూతు సామెత ఉంది . అలాంటిది ఒకటి ఈ సినిమాలో వై విజయ , గొల్లపూడిల మధ్య పెట్టాడు దర్శకుడు . బాగా పేలింది . రాత్రి సాని ఇంట్లో గడిపి పొద్దున్నే మంచం ఇరగ్గొట్టానని బడాయిలు పోతుంటాడు గొల్లపూడి . అసలు కధ ఏంటంటే ఫుల్లుగా మందు కొట్టి పడిపోతుంటాడు . పొద్దున్నే మంచం స్క్రూలను లూజ్ చేసి మంచం విరిగిపోయినట్లుగా వై విజయ గొల్లపూడికి స్టోరీ చెపుతుంటుంది . అదే నిజమనుకుంటాడు పిచ్చి కరణం . ఈ ట్రాక్ అదిరిపోయింది .

బాలకృష్ణ , వై విజయలకు ఓ డాన్స్ పాట కూడా ఉంది . ఇద్దరూ అదరగొడతారు . నీకీ మాకీ దోస్తీ అంటూ సాగుతుంది మారువేషంలో ఈ పాట . తొలి వెన్నెల కాసిన ఎండలో , ఆషాఢం వచ్చింది అందాలకి , బంతిపూల బావయ్య మూడు డ్యూయెట్లు బాలకృష్ణ , భానుప్రియ అదరగొట్టేసారు . ఇద్దరూ చాలా అందంగా ఉంటారు .

దర్శకుడు రమేష్ పాటల్ని బాగా చిత్రీకరించారు . ఓ టీజింగ్ సాంగ్ కూడా ఉంది బాలకృష్ణకు .
ఇతర ప్రధాన పాత్రల్లో జయంతి , అన్నపూర్ణ , సుధాకర్ , రాజ్ వర్మ , జగ్గారావు , గోకిన రామారావు , అరుణ్ కుమార్ , మాణిక్ ఇరానీ , మిక్కిలినేని , ప్రభృతులు నటించారు . వేటూరి వారు పాటలన్నీ వ్రాసారు . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు , బేక్ గ్రౌండ్ మ్యూజిక్ శ్రావ్యంగా ఉంటాయి . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , శైలజలు పాటల్ని పాడారు .

ఫుల్ బాలకృష్ణ మార్క్ మాస్ మసాలా వినోదాత్మక సినిమా . హీరో పక్కన భానుప్రియ , పేరుకే వాంప్ కానీ వయ్యారాల్లో హీరోయిన్లకు ఏం తగ్గని వై విజయ ఉన్నారు . వీళ్ళందరి అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే వాచ్ లిస్టులో వేసేయవచ్చు . యూట్యూబులో ఉంది . చూడబులే . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…
  • కాంతారా చాప్టర్-1 … ఇది వనరుల దోపిడీ కథ… ఓ డిఫరెంట్ రివ్యూ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions