Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ ఆశ్రమ సందర్శనకు కోహ్లీ 5 కోట్లు ఫీజు..? అదీ వ్యాపారమేనా..?

October 8, 2026 by M S R

.
2023 నుంచి కోహ్లీ ఆ ఆశ్రమానికి వస్తున్నాడు.. ఇప్పుడు రూ.5 కోట్ల కథ ఎందుకు? ఆశ్రమానికి విరాట్‌–అనుష్కల వరుస సందర్శనలు.. డబ్బు ఇచ్చారన్న ఆరోపణ.. ఆధారాలు ఎక్కడ?

విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మలు ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్‌ మహారాజ్‌ను కలవడం కొత్త విషయం కాదు. 2023 జనవరి 4న తొలిసారి బృందావనంలోని రాధాకేలీ కుంజ్‌ ఆశ్రమానికి వెళ్లిన ఈ దంపతులు.. ఆ తర్వాత కూడా పలుమార్లు అక్కడికి వెళ్లారు. 2025లోనే జనవరి 10న పిల్లలతో కలిసి వెళ్లారు. అదే ఏడాది మే 13న కోహ్లీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన మరుసటి రోజే మళ్లీ ఆశ్రమానికి వెళ్లారు. ఆ తర్వాత కూడా వారి సందర్శనలు కొనసాగాయి. 2026 జులైలోనూ ఇద్దరూ ఆశ్రమానికి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి.

అంటే.. కోహ్లీకి ఆశ్రమంతో పరిచయం ఈరోజు, నిన్న మొదలైనది కాదు… అలాంటప్పుడు ఇప్పుడు ఒక్కసారిగా తెరపైకి వచ్చిన “కోహ్లీని ఆశ్రమానికి తీసుకురావడానికి రూ.5 కోట్లు ఖర్చు చేశారు” అన్న ఆరోపణ ఆసక్తి కలిగిస్తోంది… అందులో నిజమెంత?

Ads

ఈ ఆరోపణ చేసింది ఫలహారి మహారాజ్‌గా పేరున్న దినేశ్‌ శర్మ. శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్ష్‌ న్యాస్‌ అధ్యక్షుడైన ఆయన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు రాసిన లేఖలో.. రాజస్థాన్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ కంపెనీ, ప్రాపర్టీ బిల్డర్‌ లాబీ కలిసి కోహ్లీని ప్రేమానంద్‌ మహారాజ్‌ వద్దకు తీసుకురావడానికి రూ.5 కోట్లు ఖర్చు చేశాయని ఆరోపించారు. ఆశ్రమం, మహారాజ్‌ ప్రాచుర్యం పెంచుకోవడానికే ఈ వ్యవహారం జరిగిందన్నది ఆయన వాదన.

అయితే ఇక్కడే అసలు ప్రశ్న. ఆ రూ.5 కోట్లు ఎవరు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? బ్యాంకు లావాదేవీ ఉందా? ఏదైనా ఒప్పందం ఉందా? రసీదు ఉందా? కోహ్లీని తీసుకురావడానికి ఏదైనా పీఆర్‌ ఏజెన్సీకి చెల్లింపు జరిగిందా? ఇప్పటివరకు బహిరంగంగా అలాంటి ఆధారం ఏదీ బయటపడలేదు. ఆరోపణకు స్వతంత్రంగా ధ్రువీకరణ కూడా లభించలేదు. మొత్తం బ్లాకులో చెల్లించారా?

దీనిపై కోహ్లీ ప్రతినిధి కూడా గట్టిగానే స్పందించారు. ఫలహారి మహారాజ్‌ చేసిన ఆరోపణలు “పూర్తిగా అవాస్తవం, నిరాధారం, వాస్తవాలకు విరుద్ధం” అని ఖండించారు. కోహ్లీ ప్రేమానంద్‌ మహారాజ్‌ను కలిసేది డబ్బు కోసం కాదని.. తనకు ఉన్న విశ్వాసం, గౌరవంతోనే అని స్పష్టం చేశారు. మీడియా కూడా ఇలాంటి ఆరోపణలను ప్రచారం చేసే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని కోరారు.

ఇక్కడ ఒక చిన్న టైమ్‌లైన్‌ గమనిస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది…. 2023 జనవరిలో కోహ్లీ– అనుష్క తొలిసారి ప్రేమానంద్‌ మహారాజ్‌ను కలిశారు. ఆ తర్వాత 2025 జనవరిలో పిల్లలతో కలిసి వెళ్లారు. మేలో మరోసారి వెళ్లారు. ఆ సందర్భంలో అనుష్క తన మనసులో ఉన్న ఆధ్యాత్మిక ప్రశ్నల గురించి మహారాజ్‌తో మాట్లాడారు. కోహ్లీ కూడా ఆయనతో సంభాషించారు. ఆ తర్వాత కూడా వారి రాకపోకలు ఆగలేదు. 2023 నుంచి 2026 జులై వరకు ఈ దంపతులు పలుమార్లు ఆశ్రమాన్ని సందర్శించారు…

మరి మొదటి సందర్శనే రూ.5 కోట్ల ప్యాకేజీలో భాగమైతే.. ఆ తర్వాత కూడా ఇంతకాలం అదే ఆశ్రమానికి పదేపదే ఎందుకు వెళ్తున్నారు? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది.

అది మాత్రమే కాదు. 2025 మేలో కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మరుసటి రోజే అనుష్కతో కలిసి ప్రేమానంద్‌ మహారాజ్‌ను కలిశారు. అక్కడ మహారాజ్‌ “భగవంతుడి అనుగ్రహం అంటే సంపద రావడం కాదు.. మనసులోని ఆలోచనలు మారడం” అనే భావనతో మాట్లాడారు. అంటే కోహ్లీ జీవితంలో కీలకమైన దశల్లో కూడా ఈ ఆధ్యాత్మిక అనుబంధం కనిపిస్తోంది.

ఇప్పుడు ఆశ్రమంపై ఇతర ఆరోపణలు రావడం, రసిక్‌ దులారీ అనే శిష్యుడి మరణంపై దర్యాప్తు జరుగుతుండటం వేరు. ఆ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ సందర్భంలోనే ఆశ్రమం చుట్టూ మరికొన్ని ఆరోపణలు తెరపైకి వచ్చాయి. కానీ ఒక ఆరోపణ నిజమని నిరూపించడానికి మరో ఆరోపణ ఆధారం కాదు. కోహ్లీకి రూ.5 కోట్లు చెల్లించారన్న అంశానికీ ఇప్పటివరకు ఆధారం బయటపడలేదు.

అందుకే ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం మన దగ్గర రెండు వాదనలు మాత్రమే ఉన్నాయి. ఒకటి.. రూ.5 కోట్లు ఖర్చు చేశారన్న ఆరోపణ. రెండోది.. అది పూర్తిగా అబద్ధమని కోహ్లీ వర్గం ఖండన. మధ్యలో మాత్రం కనిపించాల్సినది ఆధారం.

కోహ్లీ బ్రాండ్ వాల్యూ అపరిమితం… జస్ట్, 5 కోట్లు తీసుకుని ఓ ఆశ్రమానికి ప్రాచుర్యం కల్పిస్తాడా..? అదీ పదే పదే ఆశ్రమానికి వెళ్లడం ద్వారా..? అదే అసలు సందేహం… కోహ్లీ స్వతహాగా ఆస్తికుడు, ధార్మికుడు… ఒక ఆశ్రమానికి కృత్రిమ విలువ క్రియేట్ చేసే పనిలో పాలుపంచుకుంటాడా..?

అనుష్క- కోహ్లీ దగ్గర డబ్బుకు కొదువ లేదు… ఇప్పటికిప్పుడు క్రికెట్‌ను వదిలేసినా మరో పదీపదిహేనేళ్లు కోహ్లీ బ్రాండ్ వాల్యూకు ఢోకా లేదు… నిజం చెప్పాలంటే తన ఇన్‌స్టాలో ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తే ఈ 5 కోట్లు నథింగ్ తనకు… అలాంటప్పుడు ఈ 5 కోట్లకు కక్కుర్తిపడతాడా..? ఈ ఆరోపణల వెనుక ఆశ్రమాల మధ్య ఘర్షణలు, తగాదాల మిస్టరీ ఏదో ఉన్నట్టుంది… ఏమో, యోగీ నోరు విప్పాల్సిందే… అసలు కథ తెలుసుకుని..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ ఆశ్రమ సందర్శనకు కోహ్లీ 5 కోట్లు ఫీజు..? అదీ వ్యాపారమేనా..?
  • SIR – ఈ ఆందోళనల అసలు లక్ష్యం దేశంలో అశాంతి – కల్లోలం !!
  • నూకలు బాకీ ఉంటే… యముడే దిగొచ్చినా ప్రాణాలు తీయలేడు !!
  • బ్లడీ రోమియో – కాదు, బ్లడ్ రోమియో – మరో బ్లడీ ప్యారడైజ్ !!
  • నకిలీ బతుకులు … BRS సోషల్- ఫేక్ ప్రచారాలపై బిగ్‌టీవీ ఫైర్..!!
  • అవతలి వైపు వచ్చిన ప్రశ్న – ఎన్‌కౌంటర్ కథ తెలియదా? ఫీల్డ్‌కు కొత్తా..?
  • అచ్చం కరోనా పుట్టుకలాగే..? బయోవెపన్ తయారీ దశలో ప్రమాదం..?
  • ఏది నిజం? సర్దార్ పటేల్‌ నేతాజీ బోస్‌కు వ్యతిరేకంగా కోర్టుకెక్కాడా?!
  • క్షణాల్లో టికెట్లన్నీ ‘మాయం’ – ఏం జరుగుతోంది నాయుడూ..?!
  • లెంపలేసుకున్న ఈనాడు – ఆ వార్త పొరపాటే అని ఒప్పుకోలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions