ఆహా ఓటీటీ… తెలుగు ఇండియన్ ఐడల్ షో… పోటీలు ముగిశాయి… టాప్ ఫోర్ లేదా టాప్ ఫైవ్ పాల్గొన్న ఎపిసోడ్‌కు బాలయ్య ముఖ్య అతిథి… ఫినాలే అని ప్రకటించలేదు గానీ అది ఫినాలేలాగే సాగింది… నిజానికి అదే ఫినాలే గానీ, అంతకుముందే చిరంజీవికి కోపమొచ్చింది… అల్లు అరవింద్‌కు ఫోనొచ్చింది… దాంతో చిరంజీవితో ఫినాలే షూట్ చేసి, ప్రసారం చేశారు… మమ అనిపించారు…
బాలయ్య తొలిసారి బుల్లితెరకొచ్చాక ఆహాలోనే అన్‌స్టాపబుల్ షో… అది మరో బాలయ్యను ఆవిష్కరించింది… షో సూపర్ హిట్… సెకండ్ సీజన్ కూడా స్టార్టయింది… చంద్రబాబును ఆకాశానికెత్తింది… అల్లు అరవింద్‌కు తెలియవా..? తెలిసే… కావాలనే..! మధ్యలో మెల్లిగా ప్రచారాలు… చిరంజీవి కుటుంబంతో అల్లు అరవింద్‌కు దూరం పెరుగుతోంది అని…! అన్నీ అబద్ధం…
నిన్న అల్లు అరవింద్ కొడుకు శిరీష్ నటించిన సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రిరిలీజ్‌కు చిరంజీవి కాదు ముఖ్య అతిథి… అల్లు అర్జున్ కూడా కాదు, పవన్ కల్యాణ్ కాదు… నందమూరి బాలయ్య..! ఆశ్చర్యంగా అనిపించింది చాలామందికి… సాధారణంగా బాలయ్య ప్రిరిలీజులకు వెళ్లడు… ఇదేకాదు, బాలయ్య అఖండ సినిమా ప్రిరిలీజ్‌కు ముఖ్య అతిథి అల్లు అర్జున్… సో, ఆ రెండు కుటుంబాల నడుమ బంధం పెరుగుతోంది గట్టిగానే… అంతెందుకు, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ తరఫున బాలయ్యతో ఓ సినిమాయే ప్లాన్ చేస్తున్నాడు…
Ads
ఇద్దరి నడుమ బంధం చిక్కబడటం పెద్ద విశేషం కాదు, చిరంజీవి లేకుండా బాలయ్య కనిపిస్తున్నాడు… అదీ విశేషం… అలాగని బావ మరుదుల నడుమ ఏదో దూరం ఏమీ పెరిగినట్టు కాదు… పొలిటికల్ సమీకరణాల్లోనూ ఇమిడేదే… నిజానికి అరవింద్ మంచి వ్యాపారి… లెక్కలు తెలిసినవాడు… ఆలోచించకుండా ఎలా ఉంటాడు…? సినిమాకూ, పాలిటిక్స్‌కూ నడుమ గీత పెట్టి ఆలోచిస్తున్నట్టు పైకి కనిపిస్తున్నాడు కానీ ఆ రెండింటినీ కలిపి లెక్కలేస్తున్నవాడే…
చంద్రబాబు బావమరిది, వియ్యంకుడు బాలయ్య… ఆ బాలయ్య బావకు రాజకీయంగా ఇప్పుడు పవన్ కల్యాణ్ కావాలి… జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన వోట్లు కలవాలి… ఆ పవన్ కల్యాణ్ ఇంకా ఎదగాలని అన్నయ్య చిరంజీవి ఆశ, ఆకాంక్ష… ఆ చిరంజీవి బావమరిదే అల్లు అరవింద్… ఇక బాలయ్య, అరవింద్ దోస్తీ పెరగడం ఉభయతారకమే కదా…
ప్రస్తుతం చిరంజీవి, రాంచరణ్ తమ కొణిదెల ప్రొడక్షన్స్ వ్యవహారాలు వాళ్లే సొంతంగా చూసుకుంటున్నారు… అరవింద్ వేళ్లూ కాళ్లూ పెట్టడు… అలాగే తన గీతా ఆర్ట్స్ వ్యవహారం వేరే… రాంచరణ్, బన్నీ ఎవరి ఇమేజీ వాళ్లది… ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్లది… సమాంతరంగా నడుస్తున్నట్టు కనిపిస్తాయి… దూరం ఉన్నట్టు అనిపిస్తుంది… బాలయ్యతో బంధం పెరగడం అల్లు అరవింద్‌కు ఇండస్ట్రీపరంగా బలం… పొలిటికల్‌గానూ ఎవరికీ వ్యతిరేకం కాదు…
మరి రేప్పొద్దున పరిస్థితులు భిన్నంగా మారితే… ఏముంది..? బావ బావే… బాలయ్య బాలయ్యే… బావకన్నా బాలయ్య ఎక్కువ కాదు కదా… నెత్తురే ఎక్కువ చిక్కన… అంతే… కానీ ఇప్పుడైతే నందమూరి, కొణిదెల క్యాంపుల నడుమ రాజకీయ దోస్తీ పెరుగుతోంది… చంద్రబాబు కోరుకునేది కూడా అదే… సో, అన్‌స్టాపబుల్‌లో చిరంజీవి లేదా పవన్ కల్యాణ్ హఠాత్తుగా ప్రత్యక్షమైతే ఆశ్చర్యపడాల్సిన పనేమీ లేదు… ఈ మొత్తం వ్యవహారంలో ఎందుకోగానీ అల్లు అరవింద్‌కు నాగబాబు ఉనికి పెద్దగా నచ్చినట్టుగా కనిపించదు..!!
Share this Article