కాంతార రిపీట్ అవుతుందని అనుకున్నాడు అల్లు అరవింద్… 15 కోట్లతో నిర్మించబడిన కాంతార 400 కోట్లు సంపాదించింది… తెలుగులో దాని రైట్స్ కేవలం 2 కోట్లకు కొని, కోట్లకుకోట్లు కొల్లగొట్టాడు… దానికి ప్రచారఖర్చు కూడా లేదు పెద్దగా… మొదట కన్నడంలో పాజిటివ్ మౌత్ టాక్ స్టార్టయి, అది క్రమేపీ హైదరాబాద్‌కు చేరి, తెలుగు ప్రేక్షకులను చేరి, కాంతార రిలీజ్ కాగానే తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధించింది…
అఫ్‌కోర్స్, కథకథనాలు భిన్నంగా ఉండటం, రిషబ్ శెట్టి క్లైమాక్స్ నటన అనితర సాధ్యంగా ఉండటం దానికి కలిసొచ్చింది… తరువాత అరవింద్ కన్ను మలయాళంలో హిట్టయిన మల్లికాపురం సినిమాపై పడింది… ఇదీ డివోషనల్ సబ్జెక్టు… మలయాళంలో హిట్ టాక్… ఇంకేముంది కొన్నాడు… తెలుగులోకి రిలీజ్ చేశాడు… చాలా థియేటర్లు తన గుప్పిట్లోనే ఉన్నాయి కదా, రిలీజుకు ఢోకా లేదు… మరో కాంతార అనుకున్నాడు…
అదే ఎదురుతన్నింది… థియేటర్లలో జనం లేరు… అసలు జనానికి ఈ సినిమా వచ్చినట్టు తెలిస్తే కదా… దాని జానర్ ఏమిటో, సింపుల్‌గా కథేమిటో చెబితే, జనంలోకి రీచయితే కొంతైనా ఆసక్తి పుట్టేది… సైలెంటుగా థియేటర్లలోకి వచ్చింది… పోనీ, కాంతారలాగా దీనికి పాజిటివ్ వచ్చి ఉద్దరిస్తుంది అనుకుంటే అదీ జరగలేదు… మలయాళంలో సూపర్ హిట్టయిన ఆ సినిమా తెలుగులో ఫ్లాప్… మామూలు ఫ్లాప్ కాదు, అట్టర్ ఫ్లాప్…
Ads
నిజానికి మలయాళంలో వంద కోట్లు సాధించిందని ప్రచారం చేసుకున్నారు గానీ… అంటే, కొన్ని సైట్లలో రాయించబడతాయి ఇలాంటి వార్తలు… యూట్యూబ్ చానెళ్లు ఉండనే ఉన్నాయి… ఆహా ఓహో… తీరా చూస్తే దానికి అంత సీన్ లేదు… ఈ కథనం రాస్తున్న రోజుకు ఈ సినిమా మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్లు 45 కోట్లు… అందులో ఇండియా కలెక్షన్లు 30 కోట్లు… థియేటర్ రన్ కూడా అయిపోయినట్టుంది… కొచ్చిలోనే 19 షోలకు పడిపోయింది సంఖ్య…
నిజానికి ఫ్యామిలీతో వెళ్లదగిన సినిమా ఇది… భక్తి సినిమా… అయితే ఇలాంటి సినిమాలను టీవీల్లోనే, ఓటీటీల్లోనే చూడటానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ప్రేక్షకులు… థియేటర్ల నిలువుదోపిడీని భరించే స్థోమత లేదు జనానికి… (మరి మిగతా సినిమాలకు వందల కోట్ల కలెక్షన్లు అని ప్రచారం జరుగుతోంది కదా అంటారా..? చెప్పుకోనీ, ప్రచారం కోసమే కదా…) కాంతార కథ వేరు, అది థియేటర్ సరుకు… కానీ మల్లికాపురం సాదాసీదా సినిమా… హైలైట్స్ ఏమీ ఉండవు…
కాంతారలాగే కుమ్మేస్తామని అనుకున్న అల్లు అరవింద్ ఈ వసూళ్లు చూసి షాక్ తిని ఉంటాడు బహుశా… అసలే అయ్యప్ప స్వామి మీద తీసిన సినిమా, తెలుగువారికి యశోద సినిమాతో పరిచయమైన నటుడు ఉన్ని ముకుందన్, ఇప్పుడు ట్రెండ్ డివోషనల్ కాబట్టి సినిమా రన్‌కు ఢోకా లేదని అనుకున్నట్టున్నాడు తను… కానీ ఆ అంచనా తల్లకిందులైంది… కేరళలోని ఓ చిన్న గ్రామంలో షన్ను అనే 8 ఏళ్ల చిన్నారికి అయ్యప్ప అంటే విపరీతమైన భక్తి… తండ్రేమో శబరిమలకు తీసుకెళ్లలేకపోతాడు… ఆమెకు ఆ గుడి వెళ్లాలని బాగా కోరిక…
కుటుంబం కకావికలు… షన్ను కన్నంతా శబరిమల పైనే… పక్కింటి బాబును తీసుకుని బయల్దేరుతుంది… షన్నూను కిడ్నాప్ చేయడానికి ఓ అమ్మాయిల స్మగ్లర్ ప్రయత్నం, కానీ ఎవరో వచ్చి కాపాడతారు… అది అయ్యప్పే అని షన్నూ నమ్మకం… ఆ తరువాత కథ నడుస్తూ ఉంటుంది… నిజానికి పిల్లలు దేవుళ్ల దర్శనం కోసం ఇంటిని వదిలి వచ్చేయడం మనం దేవుళ్లు అనే సినిమాలో చూసేశాం… అందులోనూ పిల్లలే… కథ మనకు కొత్తది కాదు…
రజస్వల కాని ఆడపిల్లలను మాత్రమే, రుతుస్రావం ఆగిపోయిన వృద్ధులను మాత్రమే శబరిమలకు అనుమతిస్తూ ఉంటారు, కాబట్టి 10 ఏళ్లలోపు ఆడపిల్లలు మాత్రమే శబరిమల దర్శనానికి వస్తూ ఉంటారు. మొదటిసారిగా మాల వేసుకునే వారిని కన్నె స్వామి అని పిలుస్తారు… మొదటిసారి మాల వేసుకుని శబరిమల వచ్చే బాలికలను మాలికాపురం అనే పేరుతో పిలుస్తారు… అందుకే ఈ సినిమాకు మాలికపురం పేరు పెట్టారు… సో, ఇలాంటి సినిమాల్ని నడిపించాలంటే ఓ హైప్ క్రియేట్ చేయాలి, కనీసం జనానికి సినిమాను ప్రమోషన్ వర్క్ ద్వారా పరిచయం చేయాలి… అదేమీ లేకుండా, మరో కాంతార అని కలలు కంటే… అయ్యప్ప స్వామి ఆ కళ్లను తెరిపించాడు…!!
Share this Article